వందల ఏళ్ల క్రితమే గంజాయి వాడకం... సమాధుల్లో బయటపడిన సాక్ష్యాలు

  • 17 జూన్ 2019
చైనాలో గంజాయి సాగు Image copyright XINHUA WU

పశ్చిమ చైనాలోని సమాధుల్లో గంజాయి వాడకానికి సంబంధించిన పురాతన ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు.

2,500 ఏళ్ల కిందటే అక్కడ గంజాయి పీల్చేవారని, కర్మకాండలు, మతపరమైన కార్యక్రమాల్లో గంజాయిని వినియోగించేవారని అధ్యయనాలు చెబుతున్నాయి.

సమాధుల్లో ఖననం చేసిన చెక్కపెట్టెలో గంజాయికి సంబంధించిన అవశేషాలను గుర్తించారు. అవి ఎక్కువ స్థాయిలో మత్తుకలిగించే పదార్థాలని తెలిపారు.

గంజాయి ప్రభావం గురించి అప్పటి వారికి బాగా తెలుసునని దీన్ని బట్టి అర్థం అవుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.

తూర్పు ఆసియాలో క్రీస్తుపూర్వం 4,000 ఏళ్ల కిందటి నుంచే గంజాయి సాగులో ఉంది.

కానీ, మొదట్లో తక్కువ స్థాయి మత్తు కలిగించే గంజాయినే సాగు చేసేవారు.

పామీర్ పర్వతాల్లోని జిర్‌జంకల్‌ ప్రాంతంలో ఉన్న సమాధుల్లో గంజాయి పీల్చే గొట్టాలను గుర్తించారు.

అప్పటి ప్రజలు గంజాయి ఆకు, రాళ్లను ఉపయోగించి నిప్పుపుట్టించి పొగతాగేవారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అధిక ఎత్తులో అనుకూలించే వాతావరణ పరిస్థితులు ఉండటంతోనే ఇక్కడ అధిక స్థాయి టీహెచ్‌సీ ఉన్న గంజాయి మొక్కలు సహజంగా పెరిగాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Image copyright XINHUA WU

గంజాయి మొక్కల పెరుగుదలకు కావాల్సిన తక్కువ ఉష్ణోగ్రత, పోషక స్థాయిలు ఇక్కడ ఉండటం వల్లే వాటి సాగు సాధ్యమైందని చెబుతున్నారు.

గంజాయి మానసిక లక్షణాలుపై ప్రభావం చూపించే పదార్థం అని నాటి ప్రజలకు తెలియడం వల్లే వాళ్లు ఈ మత్తు పదార్థాన్ని ఉపయోగించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మతపరమైన కార్యక్రమాలు, కర్మకాండల సమయంలో వారు గంజాయి మొక్కలను కాల్చినట్లు సాక్ష్యాలు ఉన్నాయి.

సమాధుల్లో దొరికిన బర్నర్స్‌లో ఉన్న గంజాయిని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే పద్ధతిని ఉపయోగించారు.

శాస్త్రవేత్తలు వివిధ పద్ధతుల్లో వేరు చేసిన ఆ రసాయన సమ్మేళనం, ఇప్పటి గంజాయి రసాయిన సమ్మేళనంతో సరిపోయింది.

అలాగే, ఆ సమాధుల్లోని కొన్ని మానవ ఎముకలను పరీక్షించగా వారంతా అక్కడ పుట్టిపెరిగిన వారు కాదని తేలింది.

జర్మనీలోని జెన్‌లో ఉన్న మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ డైరెక్టర్ నికోలే బోవిన్ దీనిపై మాట్లాడుతూ, ''తూర్పు మధ్య ఆసియా ప్రాంతంలోని ప్రజలకు గంజాయి మత్తును కలిగిస్తుందని తెలియడంతో వారు దాన్ని సాగు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ప్రపంచమంతా ఇది సాగులోకి వచ్చింది'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)