చైనా-హాంకాంగ్‌ వివాదం ఏంటి? హాంకాంగ్‌‌లో భారీ స్థాయిలో నిరసనలు ఎందుకు?

  • 17 జూన్ 2019
యాంకాంగ్ వ్యక్తి Image copyright Reuters

హాంకాంగ్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గొంతును వినిపిస్తున్నారు. హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకూ.. ఈ బిల్లును ఆమోదిస్తే ఏం జరుగుతుంది? ఈ ఆందోళనలు బీజం ఎక్కడ? ఈ ఆందోళనల వెనుక దశబ్దాల కథ ఉంది.

హాంకాంగ్ ప్రత్యేక హోదా

మిగతా చైనా నగరాలతో పోలిస్తే హాంకాంగ్ చాలా భిన్నం. హాంకాంగ్ 150 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో ఉంది. 1842లో హాంకాంగ్ ద్వీపాన్ని చైనా బ్రిటన్‌కు అప్పగించింది. ఆ తర్వాత, 1898లో 'న్యూ టెరిటరీస్‌'గా పిలిచే భూభాగాన్ని కూడా 99 సంవత్సరాల పాటు చైనా, బ్రిటన్‌కు లీజుకు ఇచ్చింది.

కాలగమనంలో హాంకాంగ్ బాగా రద్దీగా ఉండే రేవు పట్టణంగా మారింది. 1950లలో దాని ఆర్థిక వ్యవస్థ ఊపందుకుని, తయారీ రంగ కేంద్రంగా అవతరించింది. పేదరికం, అస్థిరత కారణంగా చైనా ప్రధాన భూభాగం నుంచి చాలా మంది హాంకాంగ్‌కు వలస వచ్చేవారు.

లీజు గడువు దగ్గరపడటంతో 1980 దశకం ఆరంభంలో హాంకాంగ్ భవితవ్యంపై బ్రిటన్, చైనా చర్చలు మొదలుపెట్టాయి. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మొత్తం హాంకాంగ్‌ను తమకు అప్పగించాలని వాదించింది.

'వన్ కంట్రీ, టూ సిస్టమ్స్' (ఒక దేశం, రెండు వ్యవస్థలు) సూత్రం ప్రకారం 1997లో హాంకాంగ్ చైనాలో భాగంగా మారుతుందని ఇరు దేశాలూ అంగీకరించాయి. దీని ప్రకారం చైనాలో భాగంగా ఉన్నా, విదేశాంగ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్‌కు 'అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి' ఉంటుంది.

ఫలితంగా హాంకాంగ్‌కు సొంతదైన న్యాయవ్యవస్థ, సరిహద్దులు ఏర్పడ్డాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, సభలు ఏర్పాటు చేసుకునే హక్కు సహా పౌరులకు వివిధ హక్కులు దక్కాయి.

Image copyright AFP

పరిస్థితులు మారుతున్నాయి

చైనాలోని మిగతా ప్రాంతాల ప్రజలకు లేని స్వేచ్ఛ, హక్కులు ఇప్పుడు హాంకాంగ్ ప్రజలకు ఉన్నాయి. అయితే, వాటికి కాలం చెల్లే తేదీ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ స్థానిక పౌరహక్కుల ఉద్యమ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాద నాయకులను అనర్హులను చేస్తూ తీసుకువచ్చిన ఆదేశాలను అందుకు ఉదాహరణలుగా చూపుతున్నాయి. అనధికారిక ఆంక్షలను, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని కళాకారులు, రచయితలు, పాత్రికేయులు చెబుతున్నారు.

ప్రస్తుత హాంకాంగ్ సీఈఓను 1200 మంది సభ్యులున్న ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. చైనాకు అనుకూలంగా ఉండే ఈ కమిటీని ఎన్నుకునేందుకు మాత్రం కేవలం ఆరు శాతం ఓటర్లే అర్హులు.

హాంకాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొత్తం 70 మంది సభ్యులుంటారు. ఇందులో చాలా సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండవు. చైనా అనుకూల నేతలే, ఈ పదవులను పొందుతుంటారు. మరోవైపు, 'చైనా పట్ల విధేయత'ను తెలిపే ప్రమాణం చేయడానికి నిరాకరించారని, 'హాంకాంగ్ చైనా కాదు' అన్న జెండాలను ప్రదర్శించారని, ఎన్నికైన కొందరు నేతలను కూడా బహిష్కరించారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక బిల్లులో వివాదాస్పదమైన సవరణల గురించి చర్చల సందర్భంగా చట్టసభలో గొడవ జరిగింది

హాంకాంగ్ నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని హాంకాంగ్ రాజ్యాంగం 'ద బేసిక్ లా' చెబుతోంది.

హాంకాంగ్ నాయకులను ఎన్నుకోవడానికి చైనాకు అనుకూలంగా ఉండే ఒక కమిటీ ప్రతిపాదించిన జాబితాలోని ఓటర్లకు అవకాశం కల్పిస్తామని 2014లో చైనా ప్రభుత్వం చెప్పింది. చైనా నిర్ణయాన్ని ఒక 'దొంగ ప్రజాస్వామ్యం' అని విమర్శకులు అన్నారు. హాంకాంగ్ చట్టసభలో చైనా నిర్ణయం వీగిపోయింది.

28సంవత్సరాల తర్వాత.. అంటే, 2047లో హాంకాంగ్ రాజ్యాంగం అమలు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి ఏమవుతుందన్న విషయంలో స్పష్టత లేదు.

Image copyright EPA
చిత్రం శీర్షిక 2014లో కొన్ని వారాలపాటు జరిగిన నిరసనలు

చాలామంది హాంకాంగ్ ప్రజలకు, తాము చైనీయులమన్న భావన ఉండదు

హాంకాంగ్‌లోని చాలా మంది ప్రజలు చైనా జాతికి చెందినవారైనా, హాంకాంగ్ ప్రాంతం చైనాలో ఒక భాగం అయినా, వీరంతా తమను తాము చైనీయులుగా భావించరు.

గతంలో యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ చేసిన ఓ సర్వే.. ఇక్కడి మెజారిటీ ప్రజలు తాము 'హాంకాంగర్స్'(హాంకాంగ్ ప్రజలు)గా భావిస్తారని, కేవలం 15%మందిలో మాత్రమే చైనీయులమన్న భావన ఉన్నట్లు తెలిపింది. హాంకాంగ్ యువతలో కేవలం 3%మందిలో మాత్రమే తాము చైనీయులమన్న భావన ఉందని 2017లో జరిగిన మరో సర్వే పేర్కొంది.

చైనీయులమన్న భావన తమలో లేకపోవడానికి.. తమకు, చైనా ప్రజలకు మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక, న్యాయపరమైన వ్యత్యాసాలను కారణాలుగా చూపుతున్నారు. దీంతోపాటు, 150ఏళ్లపాటు హాంకాంగ్ వలసరాజ్యంగా ఉన్న విషయాన్ని కూడా హాంకాంగర్స్ మరో కారణంగా చూపుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన తెలుపుతున్న దృశ్యం

హాంకాంగ్‌లో జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరగడం లాంటి కారణాలతో గత కొన్నేళ్లుగా హాంకాంగ్‌లో చైనీస్ సెంటిమెంట్ పట్ల వ్యతిరేకత పెరిగింది. కొందరు యువ ఆందోళనకారులు, చైనా నుంచి హాంకాంగ్‌కు స్వతంత్రం కావాలంటూ పిలుపునివ్వడం, చైనా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

'నేరస్థుల అప్పగింత బిల్లు'కు ఆమోదం లభిస్తే, హాంకాంగ్‌ చైనా నియంత్రణలోకి వెళుతుందని ఆందోళనకారుల అభిప్రాయం.

''ఈ బిల్లుకు ఆమోదం దొరికితే, హాంకాంగ్ కూడా చైనాలోని ఇతర నగరాల మాదిరే అవుతుంది' అని 18ఏళ్ల నిరసనకారుడు మైక్ బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించాలని చైనా భావిస్తోంది

2014 డిసెంబర్‌లో, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేస్తున్న చివరి నిరసన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసిన సందర్భంలో నిరసనకారులు.. ''మేం మళ్లీ వస్తాం..'' అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనలు ఆశ్చర్యాన్ని కలిగించవు.

1966లో, స్టార్ ఫెర్రీ కంపెనీ.. చార్జీలను పెంచడంతో నిరసనలు చెలరేగాయి. ఈ ప్రదర్శనలు అల్లర్లుగా పరిణమించి, కర్ఫ్యూ వరకు వెళ్లింది. ఆ సమయంలో హాంకాంగ్ వీధులు వందలాది భద్రతా బలగాలతో నిండిపోయాయి.

1997 నుంచి మళ్లీ నిరసనలు కొనసాగాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు రాజకీయ రూపం తీసుకుని, చైనాతో తలపడుతున్నాయి.

హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటే, తమ నేతలను ఎన్నుకునే అవకాశం ఆ ప్రాంత ప్రజలకు ఉంటుంది. ప్రస్తుతం ఆ స్వయంప్రతిపత్తి కోసం చేస్తున్న ఆందోళనల వెనుక, 'మా అభిప్రాయాలను కూడా వినండి' అనే ఆశ కనపడుతోంది.

2014లో జరిగిన నిరసనల్లో హాంకాంగ్ ప్రజలు, తమ నేతలను తామే ఎన్నుకునే హక్కును డిమాండ్ చేశారు. కానీ 'అంబ్రెల్లా మూమెంట్'గా పిలిచే ఈ ఉద్యమం.. చైనాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే ముగిసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)