శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయండి

  • 18 జూన్ 2019
శాంసంగ్ స్మార్ట్ టీవీ Image copyright AFP

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో స్మార్ట్ టీవీలను తరచూ స్కాన్ చేస్తూ ఉండాలని శాంసంగ్ సంస్థ తన స్మార్ట్ టీవీ వినియోగదారులకు సూచించింది.

"మీ టీవీలపై ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్ దాడులు జరగకుండా నివారించేందుకు తరచూ టీవీలో అంతర్గతంగా ఉండే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో స్కాన్ చేయండి" అని అమెరికాలోని శాంసంగ్ వినియోదారుల సేవా విభాగం ట్విటర్‌లో సూచించింది.

"మీ కంప్యూటర్ చక్కగా పనిచేయాలంటే తరచూ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో దానిని స్కానింగ్ చేయడం చాలా ముఖ్యం. అలాగే, మీ క్యూఎల్‌ఈడీ టీవీ వైఫైకి అనుసంధానమై ఉన్నట్లైతే, దానిని కూడా స్కాన్ చేయాలి" శాంసంగ్ పేర్కొంది.

టీవీనీ ఎలా స్కాన్ చేయాలో చెబుతూ ఒక వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసి, కొద్దిసేపటికే తొలగించింది. ఆలోపే ఆ వీడియోను 200,000 మందికిపైగా చూశారు. కొందరు డౌన్‌లోడ్ చేసి తిరిగి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు.

Image copyright Twitter

ఉన్నట్టుండి శాంసంగ్ ఈ సూచనలు చేయడంపట్ల సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఇదొక అర్ధంలేని సలహా" అని ఒక సెక్యూరిటీ నిపుణుడు వ్యాఖ్యానించారు.

ఏదైనా దాడి జరిగినట్లు గుర్తించడంతో ఈ సూచనలు చేశారా? అని శాంసంగ్‌ను బీబీసీ ఆరా తీయగా... "వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు" ఈ సూచనలు చేశామని శాంసంగ్ తెలిపింది.

ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌ టీవీలో శాంసంగ్ తన సొంత ఆపరేటింగ్ సిస్టం టైజన్‌ను వినియోగిస్తోంది. అందులోనే అంతర్గతంగా మెకఫీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ కూడా లోడ్ చేసి ఉంటుంది.

"కొన్ని మాల్‌వేర్లు టీవీలపై దాడి చేసే అవకాశం ఉంది. కొద్దిపాటి టీవీలలో ర్యాన్సమ్‌వేర్ ఉండటాన్ని చూశాను. అయితే, వినియోగదారులను టీవీనీ స్కాన్ చేసుకోవాలని సూచించడానికి బదులుగా, శాంసంగ్ సంస్థే ఆటోమేటిక్‌గా ఆ టీవీల ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేయడం ఉత్తమం" అని సైబర్ సెక్యూరిటీ సంస్థ పెన్ టెక్స్ పార్ట్‌నర్స్‌కు చెందిన నిపుణుడు కెన్ మున్రో చెప్పారు.

Image copyright Getty Images

శాంసంగ్ చేసిన సూచనలను కొద్దిమంది మాత్రమే అనుసరించే అవకాశం ఉందని మరో సెక్యూరిటీ నిపుణుడు స్కాట్ హెల్మె అన్నారు.

వినియోగదారుల మీద భారం మోపేందుకు ప్రయత్నించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

స్మార్ట్ టీవీల విషయంలో 2015లోనూ శాంసంగ్ తన వినియోదారులకు హెచ్చరిక చేసింది. టీవీ తెరల ముందు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవద్దని, ఆ మాటలు టీవీ తెర నుంచి మూడో వ్యక్తికి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)