ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ సంచలనం... 321 పరుగుల లక్ష్యం 41 ఓవర్లలోనే ఉఫ్

  • 18 జూన్ 2019
బంగ్లాదేశ్ Image copyright Getty Images

ఇప్పటిదాకా ఏక పక్షంగా సాగుతున్న మ్యాచ్‌లతోనే ముందుకెళ్తున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. వెస్టిండీస్‌‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 41.3 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది.

వెస్టిండీస్ చేసిన 321 పరుగులు నిజానికి భారీ స్కోరే. మ్యాచ్ క్లిష్టంగానే సాగుతుందని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బంగ్లా బ్యాట్స్‌మన్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు.

ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో మొదట దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు విండీస్‌పై విరుచుకుపడింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. హోప్ 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. లూయిస్ (70), హెట్‌మెయిర్ (50) అర్ధ శతకాలు నమోదు చేశారు.

విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా పేరున్న క్రిస్‌గేల్, ఆండ్రూ రసెల్ మాత్రం డకౌట్ అయ్యారు. అయినా హెట్‌మెయిర్ 26 బంతుల్లోనే 3 సిక్సులు, 4 ఫోర్లతో 50 పరుగులు, హోల్డర్ 15 బంతుల్లోనే 2 సిక్సులు, 4 ఫోర్లతో 33 పరుగులు చేయడంతో వెస్టిండీస్ భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది.

Image copyright Getty Images

సైఫుద్దీన్ 3, ముస్తఫిజుర్ 3, షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ స్కోరు బోర్డును మాత్రం అడ్డుకోలేకపోయారు.

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి ఆరంభాన్నిచ్చారు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన షకీబ్ అల్ హసన్ చెలరేగి ఆడాడు. 99 బంతుల్లోనే 16 బౌండరీలతో 124 పరుగులు చేసి బంగ్లా విజయానికి బాటలు వేశాడు.

తమీమ్, షకీబ్ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ముష్ఫికర్ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు.

ఆ తరువాతే స్టేడియంలో పరుగుల వరద మొదలైంది. ఐదో బ్యాట్స్‌మన్‌గా వచ్చిన లిటన్ దాస్ వెస్టిండీస్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. ఎడా పెడా ఫోర్లు సిక్సర్లతో స్టేడియంలో అన్ని వైపులున్న స్టాండ్స్‌లోకి బంతుల్ని పంపించాడు. గాబ్రియెల్‌ వేసిన ఒకే ఓవర్‌లో వరుగా 3 సిక్సులు కొట్టాడు.

Image copyright Getty Images

69 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఇంకా 51 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. షకిబ్-లిటన్ జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 189 పరుగులు చేసిన లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఏ వెస్టిండీస్ బౌలర్ ఎకానమీ కూడా 6 కు తక్కువ లేదంటేనే బంగ్లా బ్యాట్స్‌మన్ ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించిన షకిబ్ అల్ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ ప్రపంచ కప్‌లో షకిబ్ అల్ హసన్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లో రెండు అర్ధ శతకాలు, రెండు శతకాలు (75, 64, 121,124) సాధించి పెద్ద జట్లకు గట్టి సవాలు విసురుతున్నాడు. ఈ పరుగులు కూడా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి బలమైన జట్లమీద చేసినవే.

ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది.

సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న వెస్టిండీస్, ఈ ఓటమితో దాదాపుగా ఆ ఆశలను గల్లంతు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)