భారత్-పాక్ మ్యాచ్: ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫరాజ్

  • 18 జూన్ 2019
సర్ఫరాజ్, ఇమ్రాన్ ఖాన్

భారత్ 89 పరుగుల తేడాతో గెలిచినందుకు అభినందనలు.

అయినా, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు కొట్టినవాడికి 140 పరుగులు చేయడం ఒక లెక్కా.

ఇక్కడ బాధేంటంటే, వర్షం ఎటూ మొదలైపోయింది. అది తర్వాత గంటో, రెండు గంటలో అలాగే పడుంటే దాని సొమ్మేం పోయేదో..

కానీ టైమ్ బాగోలేనప్పుడు అన్నీ అలాగే జరుగుతాయి. పాకిస్తాన్ 35 ఓవర్లు ఆడిన తర్వాత, వర్షం పడగానే డక్‌వర్త్ లూయిస్ ఫార్ములాతో మ్యాచ్‌ను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు తగ్గించారు. అంటే తర్వాత వేసే 30 బంతుల్లో పాక్ 130 పరుగులు కొట్టాలి.

అంతకంటే ఘోరమైన జోక్ ఇంకేముంటుంది. 3 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచుల్లో ఒక్కటి కూడా ఓడిపోకుండా ఉంటేనే ఈ జోక్‌ నుంచి తేరుకోగలుగుతుంది.

Image copyright Getty Images

ప్రస్తుతం ఆ పని.. జానపద కథల్లో మాంత్రికుడి దగ్గర బందీగా ఉన్న రాజకుమారిని విడిపించడం కంటే కష్టంగా కనిపిస్తోంది.

భారత్ తర్వాత మ్యాచ్ అఫ్గానిస్తాన్‌తో, పాకిస్తాన్ నెక్ట్స్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఇక నేనేం చెప్పాలి.

కానీ మనసులో చిన్న ఆశ కూడా ఉంది. 1992 వరల్డ్ కప్‌లో కూడా పాకిస్తాన్ ఇలాంటి స్థితిలోనే ఉంది. కానీ చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీ పైనల్‌, తర్వాత ఫైనల్ చేరుకుంది.

కానీ ఇది 1992 కాదు, ఇప్పటి జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆనాటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా కాదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ముందు మోదీ గెలుస్తారని జోస్యం చెప్పారు. అదే ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చెయ్, స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, బౌలర్లను మొదట ఆడించు. సాదాసీదా ఆటగాళ్లను వెనక ఉంచు ఎందుకంటే, వాళ్లు ఈ మ్యాచ్ ప్రెషర్ తట్టుకోలేరు అని ఒక సందేశం పంపించారు.

కానీ సర్ఫరాజ్ ఆయన వద్దని చెప్పిన అన్నీ చేశాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్‌కు బదులు బౌలింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ కూడా తనకు నచ్చినట్టు మార్చాడు.

బౌలర్లతో ఇష్టమొచ్చినట్టు షార్ట్ పిచ్ బంతులు వేయించాడు. సర్ఫరాజ్ బహుశా షార్ట్ పిచ్ బంతి చూడగానే రెచ్చిపోయే రోహిత్ శర్మ మనసు గాయపడకూడదని అనుకున్నాడో ఏమో.

అయినా ఇమ్రాన్ ఖాన్ సూచనలిచ్చినంత మాత్రాన ఏమైపోతుందిలే. ఇప్పటివరకూ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ భారత్‌తో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 1992లో పాకిస్తాన్ కప్ గెలుచుకుని ఇంటికి తీసుకొచ్చినపుడు కూడా భారత్‌తో మాత్రం గెలవలేకపోయింది.

అయినప్పటికీ, ఏం ఫర్వాలేదు.. ఆయేగా, ఆయేగా, అప్నా టైమ్ ఆయేగా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)