శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు

  • 19 జూన్ 2019
రోషన్, గౌరీ
చిత్రం శీర్షిక రోషన్, గౌరీ

చరిత్రలో ఎన్నో ప్రేమకథలను చూశాం... విన్నాం. కుల, మత, వర్గ భేదాలను పక్కనపెట్టి ప్రేమను గెలిపించుకున్న వారెందరో ఉన్నారు. ఈ ప్రేమ కథ కూడా అలాంటిదే.. కానీ కాస్త విభిన్నమైనది.

30 ఏళ్ళ పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన శ్రీలంకలో ఈ ప్రేమ కథ వినూత్నమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైరివర్గాలకు చెందిన రోషన్, గౌరిలు యుద్ధ కాలంలో బద్ధ శత్రువులు.

కానీ, ఐదేళ్ల క్రితం వారిమధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. 'క్రాసింగ్ డివైడ్స్' పేరిట బీబీసీ అందిస్తున్న వరుస కథనాల్లో ఇదొకటి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: శ్రీలంక యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు

‘‘యుద్ధం జరిగిన కాలంలో నేను శ్రీలంక భద్రతా దళంలో ఉండేవాడిని. నా భార్య ఎల్టీటీఈలో ఉండేవారు. అప్పుడు ఇద్దరం శత్రువులం. కానీ, ఇప్పుడు మేం పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నాం’’ అని రోషన్ చెప్పారు.

రోషన్ జయతిలక, గౌరీ మలార్‌లు ప్రేమలో పడ్డారు. రోషన్ సింహళ సముదాయానికి చెందినవారు కాగా, గౌరి తమిళ సముదాయంలో పుట్టి పెరిగారు.

శ్రీలంక అంతర్యుద్ధంలో ఆమె తమిళ టైగర్ల తరపున పోరాడారు. ఆ యుద్ధం 2009లో ముగిసింది. పదేళ్ల క్రితం వాళ్ళు బద్ధ శత్రువులు. కానీ, ఇప్పుడు వారు ఒక పాపకు తల్లిదండ్రులు.

‘‘నేను వావునియాలోని ఇరట్టపెరియకులం గ్రామానికి చెందినవాడిని. ఎల్టీటీఈ కన్నా టైగర్లు అన్న పదాన్నే మేం ఎక్కువగా వినేవాళ్ళం. వాళ్ళు మా శత్రువులు కాబట్టి నాకు వాళ్ళ మీద విపరీతమైన కోపముండేది. శ్రీలంకలోని కబిత్తిగొల్లేవా ప్రాంతంలో వాళ్ళు ఒక బస్సును పేల్చేసి ఎందరో అమాయకుల ప్రాణాలను తీసినప్పుడు నాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది’’ అని ఎల్టీటీఈ గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు రోషన్.

‘‘నేను సింహళ సముదాయానికి చెందిన వారిని ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. వాళ్ళు మంచివారు కాదు, మమ్మల్ని చంపేస్తారు అని భయపడేదాన్ని’’ అని గౌరీ మలార్ అన్నారు.

నాటి అంతర్యుద్ధ కాలంలో అదృశ్యమైన వేలాది మంది తమిళులలో గౌరి పెద్దన్న కూడా ఒకరు. తన అన్నను వెతుక్కుంటూ వెళ్లిన ఆమెను తమిళ టైగర్లు పట్టుకుని, ఆమెకు సైనిక శిక్షణ ఇచ్చారు.

‘‘మా అన్నయ్య బతికున్నాడో, చనిపోయాడో ఇప్పటికీ తెలియదు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మా అన్నయ్య తప్ప ఇంకేమీ వద్దని చెబుతాను’’ అన్నారు గౌరి.

అంతర్యుద్ధం ముగిసిన తరువాత గౌరిని రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. తర్వాత ఆమె సివిల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. 2013లో ఆమెకు పోస్టింగ్ లభించింది.

అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రోషన్ తమిళులతో ఏదైనా చెప్పేందుకు భాష రాక ఇబ్బందులు పడేవారు. రోషన్‌కు గౌరి సహాయం చేస్తుండేవారు. అలా వారి జీవితం కూడా మారిపోయింది.

రోషన్ తొలుత తన మనసులో మాటను గౌరికి చెప్పారు. ఆమె కొంత సమయం తీసుకున్నారు.

అయితే, గౌరి సోదరి, రోషన్ తల్లి ఇద్దరూ ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పారు.

ఆమె 2014లో రోషన్‌ను పెళ్లి చేసుకున్నారు. వాళ్లు తమ కూతురిని బహుళ మతాల, బహుళ సంస్కృతుల మధ్య పెంచుతున్నారు.

‘‘మా అమ్మాయికి తమిళ భాష నేర్పిస్తున్నాం. ఆదివారాలు ఆమెను బౌద్ధ స్కూళ్లకు కూడా పంపిస్తాం. మిగతా రోజులలో సింహళ స్కూలుకు వెళ్తుంది. మేము హిందూ మందిరానికి, బౌద్ధ మందిరానికి వెళ్తుంటాం. అది మాకెప్పుడూ ఓ సమస్య కాలేదు’’ అని తమ జీవనం గురించి చెప్పుకొచ్చారు గౌరి.

పెళ్లైన తర్వాత ఇరు వర్గాల వారూ తమ అన్యోన్యాన్ని చూసి మెచ్చుకున్నారని రోషన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)