హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?

  • 19 జూన్ 2019
జాషువా వాంగ్ Image copyright Getty Images

హాంకాంగ్‌లో లక్షలాదిమంది ప్రజల ఆగ్రహజ్వాలలకు కారణమైన నేరస్థుల అప్పగింత బిల్లు విషయంలో ఆ ప్రాంత ప్రజలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ క్షమాపణలు చెప్పారు.

చైనాకు నేరస్థుల అప్పగించే ఒప్పందం మేరకు ప్రతిపాదించిన 'ఎక్స్ట్రడిషన్ బిల్'ను ప్రజలు వ్యతిరేకించారు.

ఈ బిల్లును విరమించుకోవాలని, కేరీ లామ్ రాజీనామా చేయాలని హాంకాంగ్ ప్రజలు నినదించారు. అయితే, బిల్లును పూర్తిగా ఆపేస్తామని కేరీ లామ్ ప్రసంగం హామీ ఇవ్వకపోయినా, ప్రజల భయాందోళనలకు సమాధానం దొరికేవరకూ బిల్లును పునఃసమీక్షించమని, బిల్లును తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

కానీ హాంకాంగ్‌లో నిరసనలు ఇంకా చల్లారలేదు. బిల్లును శాశ్వతంగా రద్దు చేయాలని, హాంకాంగ్ ప్రజలు స్వేచ్ఛాయుత ఎన్నికల ద్వారా తమ నేతను తామే ఎన్నుకుంటారని ప్రజలు ఉద్యమిస్తున్నారు.

హాంకాంగ్ వీధులన్నీ లక్షలాది ప్రజల నిరసనలతో నిండిపోయాయి. ఇంతమంది వెనకున్నది ఎవరు? వీరిని నడిపించింది ఎవరు?

ఆ వ్యక్తి పేరు జాషువా వాంగ్. అతని వయసు 22 సంవత్సరాలు.

జాషువా హాంకాంగ్‌లో చదువుతున్నారు. జూన్ 17వ తేదీన జాషువా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలయ్యాక, తాను మళ్లీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటానని, చైనాకు అనుకూలంగా ఉన్న కేరీ లామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, వివాదాస్పద బిల్లును శనివారమే కేరీ లామ్ ఉపసంహరించుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పారు. కానీ ప్రజలు మాత్రం నిరసనలను ఆపలేదు.

చిత్రం శీర్షిక ‘ప్రజల తిరుగుబాటును నేను సమర్థిస్తున్నాను. ఇది తిరుగుబాటు.. అల్లర్లు కావు’

జాషువా వాంగ్ ఎవరు?

హాంకాంగ్‌లో 2014లో జరిగిన 'అంబ్రెల్లా మూమెంట్' ముఖచిత్రం జాషువా వాంగ్. స్వేచ్ఛాయుత ఎన్నికల విధానం ద్వారా తమ నాయకులను తామే ఎన్నుకుంటామని, చైనా ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే విధానం రద్దు కావాలని అంబ్రెల్లా మూమెంట్ డిమాండ్.

జాషువ వాంగ్, ఇతర విద్యార్థులు నాయకత్వం వహించిన ఈ ఉద్యమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. 79 రోజులపాటు సాగిన ఈ ఉద్యమంతో హాంకాంగ్ నగరం స్తంభించిపోయింది.

విద్యార్థి నాయకులు, కొందరు ప్రొఫెసర్లు, ఒక బాప్టిస్ట్ మినిస్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. 2017, 2018 సంవత్సరాల్లో రెండు వేరు వేరు కోర్టు తీర్పులతో జైలుకు వెళ్లిన జాషువా, తగ్గించిన శిక్ష కారణంగా నెల రోజులు జైల్లో ఉండి, జూన్ 17న విడుదలయ్యారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2015లో కోర్టు ముందు నిరసన తెలుపుతున్న జాషువా వాంగ్

'మన నిరసన గళాన్ని వినిపించడానికి ఇదే సరైన సమయం'

జైలు నుంచి విడుదలయ్యాక, తాను మళ్లీ నిరసనల పాల్గొంటానని, హాంకాంగ్ నాయకురాలిగా ఉండటానికి కేరీ లామ్‌ అనర్హురాలని జాషువా అన్నారు. 2014లో జరిగిన ఉద్యమ అవశేషాలు ఇప్పుడు మళ్లీ జీవం పోసుకున్నాయని స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

''మన నిరసన గళాన్ని వినిపించేందుకు ఇదే సరైన సమయం. ప్రజల తిరుగుబాటును నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. నేరస్థుల అప్పగింత బిల్లుకు సవరణలు చేసి, ప్రాథమిక మానవ హక్కులను అణిచివేయాలని చూస్తున్నారు'' అని జైలు నుంచి విడుదలయ్యాక జాషువా మాట్లాడారు.

జాషువా బీబీసీతో మాట్లాడుతూ, 'బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకోవడం కాదు.. పూర్తిగా రద్దు చేయాలి' అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జైలు నుంచి విడుదలయ్యాక, జాషువా వాంగ్ రాకకు ముందు జూన్ 17, సోమవారంనాడు హాంకాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్డింగ్ ముందు గుమికూడిన నిరసనకారులు

'ఇది తిరుగుబాటు.. అల్లర్లు కావు

''హాంకాంగ్ ప్రజలు ఇక ఏమాత్రం మౌనంగా ఉండరు అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. నిరసనలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగించి నిరసనకారులపై దాడికి ప్రయత్నిస్తే, దాని అర్థం.. హాంకాంగ్ ప్రజలను ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారుచేయడమే అవుతుంది. కేరీ లామ్ ప్రజా తిరుగుబాటును అల్లర్లు అని పేర్కొన్నారు. అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలి.''

వాట్ నెక్స్ట్..?

ఇలాగే నిరసనలను కొనసాగించి, కేరీ లామ్‌పై జాషువా ఒత్తిడి పెంచుతారని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.

''స్వేచ్ఛ కోసం మేం చెల్లించే మూల్యం.. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను ఎదుర్కోవడం.. చివరికి రక్తమైనా చిందిస్తాం. మేం ఇంతవరకూ చేసిన నిరసన ప్రదర్శనలకంటే గొప్పగా, భవిష్యత్తులో 10 లక్షలకుపైగా హాంకాంగ్ పౌరులు మళ్లీ వీధుల్లోకి వస్తారు.''

''మా నిరసనలకు పరిష్కారం ఒక్కటే.. హాంకాంగ్ ప్రజలు తమ నేతను స్వేచ్ఛాయుత ఎన్నికల ద్వారా తామే ఎన్నుకోవాలి. ఇదే మా కోరిక.. ఈ కారణంతోటే ప్రజాస్వామ్యం కోసం మేం పోరాడుతున్నాం'' అని జాషువా అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేరీ లామ్ రాజీనామా, నేరస్థుల అప్పగింత బిల్లు శాశ్వత రద్దును డిమాండ్ చేస్తూ ఆదివారం ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు

శనివారంనాడు బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు కేరీ లామ్ ప్రకటించాక, శనివారం మళ్లీ ప్రజలు పెద్దఎత్తున ర్యాలీ చేశారు. నిరసనకారుల సంఖ్య ఇరవై లక్షలు ఉంటుందని నిర్వాహకులు చెబుతుండగా, 3.38లక్షల మంది నిరసనలో పాల్గొన్నట్లు హాంకాంగ్ పోలీసులు చెబుతున్నారు.

అయితే, బుధవారం జరిగిన నిరసనలో నిరసనకారులకు, పోలీసులకు జరిగిన గొడవలో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను వాడారు. పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. కానీ ఆదివారం జరిగిన నిరసన ప్రశాంతంగా ముగిసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)