వ్యాక్సిన్లు పనిచేస్తాయా... టీకాలపై భారతీయులకు నమ్మకముందా

  • 19 జూన్ 2019
టీకా Image copyright Getty Images

టీకాల మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం అంటే, నివారించదగిన ప్రమాదకర అంటు వ్యాధులపై పోరాడటంలో ప్రపంచం వెనుకడుగు వేయడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచే టీకాల పట్ల కొన్ని ప్రాంతాల ప్రజల్లో అత్యంత ఆందోళన కలిగించే స్థాయిలో అపనమ్మకం ఉందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

140 దేశాలకు చెందిన 1,40,000 మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను బ్రిటన్ కేంద్రంగా పనిచేసే వెల్‌కం ట్రస్ట్ విశ్లేషించింది.

ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న అతిపెద్ద 10 ప్రమాదాల జాబితాలో పిల్లలకు టీకాలపై నమ్మకం లేకపోవడం అనేది కూడా ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సమాచారాన్ని చూడాలంటే మీకు లేటెస్ట్ (జావా స్క్రిప్ట్‌ను సపోర్ట్ చేసే) బ్రౌజర్ అవసరం

వెల్‌కం గ్లోబల్ మానిటర్ సంస్థ 140 దేశాల్లో ప్రతినిధులతో సర్వే చేయించింది. సైన్స్‌ మీద నమ్మకం, శాస్త్రవేత్తలు, ఆరోగ్య సమాచారం, వైద్య ఆరోగ్య శాస్త్రం పట్ల ప్రజల్లో అవగాహన స్థాయి, టీకాల మీద ప్రజల వైఖరి అనే అంశాల మీద ఈ సర్వే చేశారు.

ఈ అంతర్జాతీయ సర్వేలో అనేకమంది తమకు టీకాల మీద పెద్దగా విశ్వాసం, నమ్మకం లేదని చెప్పారు.

టీకాలు సురక్షితమేనా అని అడిగినప్పుడు:

  • 'కొంత మేర అంగీకరిస్తున్నాం' లేదా 'బలంగా అంగీకరిస్తున్నాం' అని 79 శాతం (10 మందిలో 8) మంది చెప్పారు.
  • 'కొంత మేరకు విభేదిస్తున్నాం' లేదా 'బలంగా విభేదిస్తున్నాం' అని 7 శాతం మంది చెప్పారు.
  • మరో 14 శాతం మంది మాత్రం 'ఏదీ చెప్పలేం' లేదా 'మాకు తెలియదు' అని అన్నారు.

టీకాలు పనిచేస్తాయని నమ్ముతున్నారా? అని అడిగినప్పుడు:

  • 84 శాతం మంది 'బలంగా అంగీకరిస్తున్నాం' లేదా 'కొంత మేర అంగీకరిస్తున్నాం' అని చెప్పారు.
  • 5 శాతం మంది 'బలంగా' లేదా 'కొంతమేర' విభేదించారు.
  • 12 శాతం మంది మాత్రం అంగీకరించలేదు, విభేదించలేదు, తమకేమీ తెలియదని కూడా చెప్పలేదు.
Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక తట్టు ప్రమాదకరంగా మారొచ్చు

ఈ విషయం ఎందుకింత ముఖ్యం?

తట్టు లాంటి ప్రాణాంతకమైన అంటువ్యాధుల నుంచి టీకాలు మనకు ఎంతగానో రక్షణ కల్పిస్తాయన్న విషయాన్ని శాస్త్రీయ ఆధారాలు వెల్లడించాయి.

టీకాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. టీకాల కారణంగానే మశూచి (అమ్మవారు) అంటువ్యాధి దాదాపుగా కనుమరుగైంది. పోలియో లాంటి ఇతర వ్యాధులనూ సమూలంగా నివారించే దిశగా అడుగులు పడుతున్నాయి.

'పుంజుకుంటున్న తట్టు'

కానీ, తట్టు లాంటి అంటు వ్యాధులు మాత్రం తిరిగి పుంజుకుంటున్నాయి. మూఢనమ్మకాలు, భయం, తప్పుడు సమాచారం కారణంగా కొంతమంది ప్రజలు టీకాలను తిరస్కరిస్తుండటమే అందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రోగనిరోధక విభాగం నిపుణుడు డాక్టర్. ఆన్ లిండ్‌స్ట్రాండ్ అంటున్నారు.

"కొన్ని ప్రాంతాల్లో టీకాల పట్ల ఇప్పటికీ అపనమ్మకం ఉండటం శోచనీయం. దానివల్ల నివారించదగిన వ్యాధులను కట్టడి చేయడంలో ప్రపంచం సాధిస్తున్న పురోగతికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది" అని లిండ్‌స్ట్రాండ్ అన్నారు.

"కొన్ని వ్యాధులు తిరిగి పుంజుకుంటున్నాయి. అలా వ్యాధులను కట్టడి చేయడంలో వెనుకడుగు వేయడం ఏమాత్రం ఆమోదనీయం కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

తట్టు దాదాపు పూర్తిగా కనుమరుగై పోయిందనుకున్న దేశాల్లో కొంత కాలంగా మళ్లీ పుంజుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 2016తో పోల్చితే 2017లో 30 శాతానికి పైగా అధిక కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఏదైనా కారణంతో ఒక వ్యక్తి టీకాలు వేయించుకోకపోతే అతనికి ఈ వ్యాధి సోకినప్పుడు, అది టీకాలు వేయించుకున్న వారి మీద కూడా ప్రభావం చూపుతోంది.

అందరూ టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకునే వీలుంటుంది.

"ఒక ప్రాంత జనాభాలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 95 శాతం కంటే తక్కువ ఉంటే, తట్టు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాధి మళ్లీ విజృంభించడానికి కారణం అదే" అని వెల్‌కం ట్రస్టుకు చెందిన నిపుణుడు ఇమ్రాన్ ఖాన్ వివరించారు.

టీకాలను ఎక్కడ తక్కువ నమ్ముతున్నారు?

అధిక ఆదాయం కలిగిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లోనూ కొంతమందిలో టీకాల భద్రత పట్ల అపనమ్మకం చాలా అధికంగా ఉంది.

ప్రస్తుతం తట్టు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. ప్రపంచంలో టీకాల పట్ల ప్రతికూల భావన ఉండటం ఫ్రాన్స్‌లోనే అధికం. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు టీకాలు సురక్షితం కాదని భావిస్తున్నారు.

అంటువ్యాధులను నివారించడంలో టీకాలు బాగా పనిచేస్తాయన్న విషయాన్ని నమ్మనివారు కూడా ఈ దేశంలోనే అధికంగా ( 19 శాతం మంది) ఉన్నారు. ఇక్కడ 10 శాతం మంది పిల్లలకు టీకాలు వేయించడం చాలా అవసరమన్న దానినీ అంగీకరించడంలేదు.

ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు పిల్లలకు తప్పనిసరిగా వేయించాల్సిన టీకాలు మూడు ఉండగా, ఇప్పుడు వాటికి అదనంగా మరో 8 టీకాలను కూడా ఆ జాబితాలో చేర్చింది అక్కడి ప్రభుత్వం.

ఇటలీలో 76 శాతం మంది టీకాలు సురక్షితమని నమ్ముతున్నారు. దేశంలో రోగ నిరోధకత స్థాయి తగ్గడంతో టీకాలు వేయించుకోని చిన్నారులను పాఠశాలలు నిషేధించడం, వారి తల్లిదండ్రులకు జరిమానా విధించేలా అనుమతిస్తూ ఇటీవల ఇటలీ ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించింది.

టీకాలు వేయించడాన్ని తప్పనిసరి చేయడం చాలా ముఖ్యమని యూకే ఆరోగ్య శాఖ మంత్రి మ్యాథ్ హాన్‌కూక్ అన్నారు.

అమెరికాలోనూ తట్టు కేసుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెరుగుతోంది. 2019లో ఇప్పటి వరకు 26 రాష్ట్రాలలో 980 కేసులు నమోదయ్యాయి.

ఉత్తర అమెరికా, దక్షిణ, ఉత్తర యూరప్‌లో కేవలం 70 శాతం మంది మాత్రమే టీకాలు సురక్షితమని నమ్ముతున్నారు.

పశ్చిమ యూరప్, తూర్పు యూరప్‌ ప్రాంతాల్లో ఆ శాతం 59, 50 శాతాలకే పరిమితమైంది.

గతేడాది యూరప్ దేశాల్లో అత్యధికంగా యుక్రెయిన్‌లో 53,218 తట్టు వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో 50 శాతం మంది మాత్రమే టీకా మందులు సురక్షితమని నమ్ముతున్నారు. బెలారస్‌లో 46 శాతం, మాల్డోవాలో 49 శాతం, రష్యాలో 62 శాతం మందికి మాత్రమే టీకాలపై నమ్మకం ఉందని సర్వేలో వెల్లడైంది.

Image copyright Getty Images

అగ్రస్థానంలో దక్షిణాసియా

తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోని అత్యధిక శాతం మంది టీకాలు సురక్షితమని అంగీకరిస్తున్నారు. టీకా మందులను విశ్వసించే ప్రాంతాల్లో దక్షిణ ఆసియా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 95 శాతం మంది ప్రజలకు టీకాలపై నమ్మకం ఉంది.

దక్షిణాసియా తర్వాత తూర్పు ఆఫ్రికా ఉంది. ఇక్కడ 92 శాతం మంది ప్రజలు వ్యాక్సీన్లను విశ్వసిస్తున్నారు. బంగ్లాదేశ్, రువాండా దేశాలు ఎన్నో సవాళ్లను అధిగమించి గరిష్ఠ స్థాయిలో రోగనిరోధకతను సాధించాయి.

సర్వైకల్ కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలందరికీ హెచ్‌పీవీ వాక్సీన్‌ను పూర్తిస్థాయిలో అందించిన తొలి అల్పాదాయ దేశంగా రువాండా నిలిచింది.

అపనమ్మకానికి కారణమేంటి?

శాస్త్రవేత్తల మీద, వైద్యుల మీద, నర్సుల మీద విశ్వాసం ఉండే ప్రజల్లో వ్యాక్సిన్లపై నమ్మకం అధికంగా ఉంటోందని ఈ సర్వేలో తేలింది.

టీకాలపై నమ్మకం తక్కువగా ఉండటం వెనుక ఉన్న పూర్తి కారణాలను వెల్‌కం నివేదిక వివరించలేదు కానీ, అందుకు చాలా కారణాలు ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అందులో నిర్లక్ష్యం కూడా ఒక కారణమని అంటున్నారు. చాలా అరుదుగా వచ్చే వ్యాధి గురించి ప్రజలు సాధారణంగానే పెద్దగా పట్టించుకోరు. అలాంటి నిర్లక్ష్యమే కొన్ని వ్యాధులు తిరిగి పుంజుకునేందుకు కారణమవుతోంది.

మరో కారణం, టీకా మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భావన కావొచ్చు. అయితే, వ్యాక్సిన్లను పలుమార్లు పరీక్షించి అవి సురక్షితం అని నిర్ధరించుకున్న తర్వాతే ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.

ఇంకో కారణం ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందే తప్పుడు సమాచారం. ఫలానా మందు లేదా టీకా వాడితే సమస్యలొస్తాయంటూ అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో పోస్టులు వ్యాప్తి చెందుతుంటాయి. అలాంటి పోస్టులను చదివి కూడా కొందరు టీకాలపై అపనమ్మకం పెంచుకునే అవకాశం ఉంది.

జపాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సీన్ గురించి, ఫ్రాన్స్‌లో ఇన్‌ఫ్లూయెంజా టీకా గురించి పెద్దఎత్తున తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింది.

"టీకాల పట్ల ప్రజల్లో ఉన్న సందేహాలు, అపోహలను తొలగించేందుకు సరైన మార్గం ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు సరైన విధంగా శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలి" అని డాక్టర్ లిండ్‌స్ట్రాండ్ చెప్పారు.

(ఈ కథనంలోని ఇంటరాక్టివ్ ఫీచర్‌ను బెక్కీ డాలే, క్రిస్టీన్ జీవన్స్ రూపొందించారు. డెబీ లోయిజౌ డిజైన్ చేయగా, స్కాట్ జార్విస్, కాటియా ఆర్ట్‌సెన్కోవా డెవలప్ చేశారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)