ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్.. గాయంతో వెనుదిరిగిన భారత ఓపెనర్

  • 19 జూన్ 2019
శిఖర్ ధావన్ Image copyright Getty Images

ఎడమచేతి బొటనవేలుకు గాయం కావటంతో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ 2019లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఈనెల 9వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించింది.

ఈ మ్యాచ్‌లోనే ధావన్ వేలికి గాయమైంది. ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ ధావన్ ఎడమచేతి బొటనవేలికి తగిలింది.

దీంతో, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ఆయన దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో శిఖర్ స్థానంలో మరో బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే.

కాగా, శిఖర్ గాయపడిన వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన రిషబ్ పంత్‌ను లండన్ పంపించింది. కానీ, అతడిని జట్టుతో కలపలేదు.

శిఖర్ గాయం తీవ్రత తెలిసిన తర్వాతే పంత్‌ను జట్టుతో కలపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం గాయపడిన ఆటగాడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తే.. గాయపడ్డ ఆటగాడు కోలుకున్నా కూడా అతడిని తిరిగి తీసుకునే వీలు లేదు.

ఇప్పుడు శిఖర్ ధావన్ గాయం తీవ్రతపై స్పష్టతకు వచ్చిన బీసీసీఐ అతడి స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐసీసీని కోరింది.

ఈ విషయాన్ని టీమిండియా జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణియం మీడియాకు వెల్లడించారు. ధావన్‌కు జూలై రెండో వారం వరకూ విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారని చెప్పారు.

33 ఏళ్ల శిఖర్ ధావన్ ఇప్పటి వరకు వన్డేల్లో 17 సెంచరీలు నమోదు చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. తదుపరి మ్యాచ్ ఈనెల 22వ తేదీన అఫ్గానిస్తాన్‌తో జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు