కిమ్ – జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

  • 20 జూన్ 2019
జనవరి 2019లో కిమ్, జి జిన్‌పింగ్ కలిశారు. Image copyright AFP
చిత్రం శీర్షిక ఉత్తర కొరియాతో చైనా సంబంధాలను పటిష్టం చేసేందుకు జి జిన్‌పింగ్ ప్రయత్నిస్తున్నారు.

కిమ్ జోంగ్-ఉన్‌తో సమావేశమవడానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఉత్తర కొరియా వెళ్తున్నారు.

2005 తర్వాత చైనా అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇరు దేశాధినేతలు ఇప్పటికే చైనాలో నాలుగు సార్లు కలిశారు. ఈసారి పర్యటనలో ఉత్తరకొరియా ఆర్థిక సమస్యలు, అణుకార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఉత్తర కొరియాను చైనా చాలా ముఖ్యమైన దేశంగా చూస్తోంది.

జపాన్‌లో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు కంటే ముందే జి జిన్‌పింగ్ ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు.

జీ 20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను జిన్‌పింగ్ కలుస్తారు.

హనోయిలో గత ఫిబ్రవరిలో ట్రంప్-కిమ్‌ల మధ్య చర్చలు జరిగిన తర్వాత జిన్‌పింగ్... కిమ్‌ను కలవడం ఇదే తొలిసారి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఉత్తర కొరియాతో చైనా సంబంధాలను పటిష్టం చేసేందుకు జి జిన్‌పింగ్ ప్రయత్నిస్తున్నారు.

ఎందుకు ఇప్పుడే పర్యటిస్తున్నారు?

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడొకరు ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. జిన్‌పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియాను సందర్శిస్తుండటం ఇదే తొలిసారి.

చైనా, ఉత్తరకొరియాల మధ్య కొన్నాళ్లుగా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పర్యటన కిమ్‌కు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది.

ఈ పర్యటన సందర్భంగా హనోయి సదస్సు విఫలమవడం, ఉత్తరకొరియా అణు కార్యక్రమాల గురించి ఇరుదేశాధినేతలు చర్చిస్తారు.

చైనా అధ్యక్షుడి పర్యటన ఈ వారంలోనే ఖరారు అయింది. అయితే, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు ఉత్తరకొరియాలో పర్యటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే అంశంకాదని అమెరికా విశ్లేషకురాలు జెన్నీ టౌన్ వ్యాఖ్యానించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఉత్తరకొరియా అధినేత కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2018 జనవరిలో ఒకే వేదిక మీద కలిశారు.

చైనా ఏం కోరుకుంటుంది

ఉత్తర కొరియాలో స్థిరత్వం ఏర్పడాలని, ఆ దేశంతో ఆర్థిక సహకారం బాగుండాలనే లక్ష్యంతో చైనా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆ దేశం చేస్తున్న అణుకార్యక్రమాలను ఆపడంపై ప్రధానంగా చర్చించాలని భావిస్తోంది.

ఈ రెండు కమ్యూనిస్టు దేశాలు పాత మిత్రులే. కానీ, ప్యోంగ్యాంగ్ అణు లక్ష్యాలను బీజింగ్ విమర్శనాత్మకంగా చూస్తుండటంతో గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

'ఈ పర్యటనతో ఇరు దేశాధినేతల మధ్య కొన్ని ప్రాజెక్టులపై అంగీకారం కుదురుతుంది' అని చైనా అధికార పత్రిక బుధవారం వెల్లడించింది.

ఉత్తరకొరియా ఏం కోరుకుంటుంది

ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ ఈ పర్యటన మూలంగా తమకు చైనా మద్దతు ఉంటుందని ప్రపంచ దేశాలకు చెప్పేందుకు కిమ్ ప్రయత్నిస్తున్నారు.

''తమ స్నేహితులకు తమపై నమ్మకం, సద్భావన లేకపోయినప్పటికీ వారితో సన్నిహితంగా ఉండాలని ఉత్తరకొరియా కోరుకుంటంది'' అని టౌన్ చెప్పారు.

అణు, క్షిపణి ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆ దేశం ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటుంది.

ఉత్తర కొరియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనా కూడా ఆ ఆంక్షలకు మద్దతు ఇచ్చింది. కానీ, అణ్వాయుధీకరణను ప్రోత్సహించేలా కొన్ని ఆంక్షలను సడలించాని చైనా డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)