ఎలక్ట్రిక్ విమానం వచ్చేస్తోంది

  • 22 జూన్ 2019
ఆలిస్ విమానం Image copyright EVIATION

ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పటికే వచ్చేశాయ్.. ఇప్పుడు విద్యుత్‌తో నడిచే విమానాలూ సిద్ధమవుతున్నాయి.

విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఎలక్ట్రిక్ ఇంజిన్‌ కలిగిన విమానాల రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

కానీ, ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ఎలక్ట్రిక్ విమానాలు తీర్చగలవా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఈ వారం ప్యారిస్‌లో జరిగిన ఎయిర్ షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ విమానం’ నమూనా ఎలైస్‌ను ప్రదర్శించారు.

ఇజ్రాయెల్‌కు చెందిన 'ఏవియేషన్' అనే సంస్థ తయారుచేసిన ఈ మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లో 9 మంది ప్రయాణించవచ్చని, 10వేల అడుగుల ఎత్తు వరకు ఆలిస్ వెళ్లగలదని కంపెనీ తెలిపింది.

గంటకు 440కి.మీ. వేగంతో 1,040 కి.మీ.(650 మైళ్లు) దూరం ప్రయాణించవచ్చని వివరించింది. 2022 సంవత్సరానికి ఈ విమానం సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఏవియేషన్ సంస్థ ఆశిస్తోంది.

సాధారణ విమానాల కంటే ఇది కాస్త భిన్నంగా కనిపిస్తుంది. విమానం ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రొపెల్లర్స్ ఇందులో మూడు ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెండు, చెరో రెక్కకు అమరి, విమానం ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి.

ఏవియేషన్ సంస్థ ఇప్పటికే బోణీ కొట్టింది. అమెరికాకు చెందిన 'కేప్ ఎయిర్' అనే సంస్థ కొన్ని విమానాలను కొనేందుకు ఏవియేషన్‌తో ఒప్పందం చేసుకుంది.

చిత్రం శీర్షిక ఆలిస్ ప్రొపెల్లర్స్ గురించి వివరిస్తున్న వ్యక్తి

సీమెన్స్, మాగ్నిక్స్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ మోటర్లను ఎలైస్ విమానాల కోసం వాడుతున్నారు.

500 మైళ్ల కంటే తక్కువ దూరం ఉన్న మార్గాల్లో ప్రయాణిస్తున్న విమాన సర్వీసుల్లో ఏటా 200 కోట్ల టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని, ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించగలిగే ఎలక్ట్రిక్ విమాన సర్వీసు వ్యాపారానికి ఢోకా లేదని మాగ్నిక్స్ సీఈఓ రోయ్ గాన్జార్క్సీ అన్నారు.

అన్నిటికీ మించి, సంప్రదాయ ఇంధనం కంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు చాలా తక్కువ. ‘సెస్‌నా కారవాన్’ అనే ఒక చిన్న విమానం 160 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 27 వేల రూపాయల ఇంధనం ఖర్చవుతుందని గాన్జార్స్కీ అన్నారు.

కానీ ఎలక్ట్రిక్ విమానంలో అంతే దూరం ప్రయాణించడానికి కేవలం 500-800 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, అంటే దాదాపు 60% నుంచి 80% ఖర్చు తగ్గుతుందని వివరించారు.

ఎలైస్ విమానం లాగ కాకుండా, 1,500కి.మీ. దూరం లక్ష్యంగా ప్రయాణించే విమానాలు సంప్రదాయ ఇంధనంతోపాటు, విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మాత్రం ఎలక్ట్రిసిటీని వాడటం వల్ల కర్బన ఉద్గారాలను నియంత్రించవచ్చు. ఇలాంటి పలు సిద్ధాంతాలు ప్రస్తుతం ఫలప్రదం కానున్నాయి.

Image copyright AIRBUS
చిత్రం శీర్షిక ఎయిర్‌బస్, రోల్స్-రాయ్స్, సీమెన్స్ సంస్థలు 'ఇ-ఫాన్ X' ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నాయి.

ఉదాహరణకు రోల్స్-రాయ్స్, ఎయిర్‌బస్, సీమెన్స్ సంస్థలు 'ఇ-ఫాన్ X' ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 'బి.ఎ.ఇ.-146 జెట్'లో 2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటర్‌ను అమరుస్తారు. ఈ ప్రాజెక్టు 2021 సంవత్సరానికి పూర్తికానుంది.

''అమెరికాకు చెందిన ప్రాట్&విట్నీ సంస్థ, ‘ప్రాజెక్ట్-804’పై పని చేస్తోంది. విమానాల కోసం 1 మెగావాట్ సామర్థ్యమున్న మోటర్‌, ఇతర అనుబంధ వ్యవస్థల గురించిన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ ప్రయోగంతో తాము 30% ఇంధనం పొదుపు చేస్తామని, 2022లో ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని సంస్థ తెలిపింది. కానీ ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌ కోసం 2020 సంవత్సరం మధ్యలోనే విమానాలు అందుబాటులో ఉంటాయని ప్రాట్&విట్నీ వివరించింది.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మోటర్లతో విమానాలు నడిపేందుకు పలు విదేశీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. లండన్-ఆమ్‌స్టర్‌డ్యామ్ మార్గంలో 2027 నాటికి ఎలక్ట్రిక్ విమానాలు నడుపుతామని 'ఈజీ జెట్' తెలిపింది.

బ్యాటరీల సాయంతో విమానం ఎగిరే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం వాడుతున్న ఇంధనంతో సంబంధం లేని విమానయానాన్ని మనం చూడగలం.

విమానయాన రంగం, ఇంధన విమానాల నుంచి హైబ్రీడ్, ఎలక్ట్రిక్ విమానాల వైపు చాలా వేగంగా మళ్లుతుందని పెట్టుబడుల బ్యాంకు యు.బి.ఎస్. నివేదిక పేర్కొంది. ప్రాంతీయ విమానయానం కోసం 2028-2040 సంవత్సరాల మధ్య కాలంలో ఏడాదికి 550 హైబ్రీడ్ విమానాల డిమాండ్ ఉంటుందని యూబీఎస్ నివేదిక జోస్యం చెప్పింది.

కానీ ఎక్కువ దూరం ప్రయాణించగలిగే ఎలక్ట్రిక్ విమానాల విషయంలో ఇంకా భరోసా దొరకలేదు. ఎలక్ట్రిక్ మోటర్లు, జనరేటర్లు, విద్యుత్ సరఫరా, నియంత్రణ వ్యవస్థలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది కానీ, బ్యాటరీ టెక్నాలజీ అంత వేగంగా పురోగతి సాధించలేదు.

చిత్రం శీర్షిక ఎయిర్‌బస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్రేజియా విట్టాడిని

ప్రస్తుతం ఉన్న బ్యాటరీలకంటే 30 రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఆ బ్యాటరీలతో 'ఏ320' విమానం ప్రయాణించే దూరంలో కేవలం ఐదోవంతు దూరం మాత్రమే ప్రయాణించగలం అని ఎయిర్‌బస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్రేజియా విట్టాడిని అన్నారు.

''బ్యాటరీల్లో అధిక శక్తిని నిల్వ చేసుకునే ఒక విప్లవాత్మక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకూ, మనం హైడ్రోకార్బన్ ఇంధనంపై ఆధారపడాల్సిందే'' అని యునైటెడ్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్రెగ్ ఎరమెన్కో అన్నారు.

విమానయాన రంగం నుంచి వెలువడే ఉద్గారాల్లో 80% 1,500కి.మీ. దూరం పైగా ప్రయాణించే ప్యాసెంజర్ విమానాల నుంచే వెలువడుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ విమానాలు ఇంత దూరం ప్రయాణించలేవు. అదే ప్రధానమైన సమస్య.

2050 నాటికి 'జీరో కార్బన్ ఉద్గారాల' లక్ష్యాన్ని అంగీకరించిన మొదటి జీ-7 దేశం ఇంగ్లండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 430కోట్ల మంది విమాన ప్రయాణం చేస్తే, 2037నాటికి ప్రయాణికుల సంఖ్య 800కోట్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో జీరో కర్బన్ ఉద్గారాల లక్ష్యం విమానయాన వ్యాపారానికి పెను సవాలుగా మారింది.

Image copyright UNITED TECHNOLOGIES
చిత్రం శీర్షిక యునైటెడ్ టెక్నాలజీ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ డెమాన్స్ట్రేటర్

యూరప్‌లో, కర్బన ఉద్గారాలు వెలువడటం ఆధారంగా విమానాలను వర్గీకరిస్తామని 'యూరప్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ' తెలిపింది.

నార్వే, స్వీడన్ దేశాలు.. 2040నాటికి తక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాలను ఆపడానికి ఇదే పరిష్కారమా?

ప్రపంచ ఆర్థికరంగంలో, శాంతియుతంగా కలిసి జీవించడం అన్నది, ప్రయాణాలు చేయడం, ఒకర్నొరు అర్థం చేసుకోవడం వల్లే సాధ్యమవుతుంది. అలా కాకుండా ప్రయాణాలు ఆపడం అనేది మంచిదికాదు అని రోల్స్-రాయ్స్‌కు చెందిన పాల్ స్టీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)