మెటికలు విరుచుకుంటే కీళ్లనొప్పులు వస్తాయా?

  • 22 జూన్ 2019
చేతి వేళ్లు విరుస్తున్న మహిళ

ఈ పసిపాప ఎంత ముద్దుగా ఉందో.. నా దిష్టే తగిలేటట్లుంది!

మా ఆయన ఎంత మంచోడో.. ఆయనపై ఎవరి కళ్లూ పడకూడదు..!

ఈ రెండు సందర్భాల్లో టిక్.. టిక్.. అనే శబ్దం సాధారణంగా వినిపిస్తుంటుంది. అది మెటికలు(వేళ్లు విరుచుకోవడం) విరిచిన శబ్దం.

పలు సందర్భాల్లో ఇలా చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ అలా మెటికలు విరిస్తే కీళ్లనొప్పులు వస్తాయా?

ఈ ప్రశ్నకు డా.వాన్ ట్యుల్లేకన్ సమాధానం చెప్పారు.

డా.డోనల్డ్ అన్జర్ అనే వ్యక్తి తన ఎడమ చేతివేళ్లను విరుచుకోవడం అలావాటు చేసుకున్నారు. అలా 50ఏళ్లపాటు రోజుకు కనీసం రెండుసార్లు చేసేవారు. కానీ తన రెండు చేతులకూ కీళ్లనొప్పులు రాలేదు.

అలా.. వేళ్లు విరుచుకోవడం వల్ల ఆర్థరైటిస్ రాదని తన తల్లికి రుజువు చేశారు. అన్జర్ చేసిన ఈ ప్రయత్నానికి లేదా ప్రయోగానికి నోబెల్ బహుమతికి ప్యారడీ అవార్డుగా ఇచ్చే ఇగ్‌నోబెల్ అవార్డును 2009లో గెలుచుకున్నారు.

ఈ అలవాటుతో ఆర్థరైటిస్ రాదని నిరూపించడానికి ఒకరిని ఉదాహరణగా చూపిస్తే సరిపోదు. కానీ చాలా అధ్యయనాలు, ఇలా వేళ్లు విరుచుకోవడానికి, కీళ్లనొప్పులకు సంబంధం లేదని చెబుతున్నాయి.

అలా అని ఊరికే రోజూ మీరు మెటికలు విరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ అలవాటుతో కొందరి చేతివేళ్ల జాయింట్ల వద్ద చిన్న క్రాక్ వచ్చినట్లు కొందరు రేడియాలజిస్టులు భావిస్తున్నారు. ఈ అలవాటు ఎక్కువగా ఉన్న కొందరిలో చేతి పటుత్వం బలహీనంగా ఉందని ఒక అధ్యయనం పేర్కొంది. కానీ ఇందుకు వేళ్లు విరుచుకోవడమే కారణం అని స్పష్టంగా చెప్పలేం.

వేళ్లు విరుచుకున్నపుడు శబ్దం ఎందుకు వస్తుంది?

అది ఎముకల మధ్య రాపిడి కలిగినపుడు వచ్చే శబ్దం కాదు. ఎముకల మీదనుంచి నరాలు జారిన శబ్దం కూడా కాదు(అరుదైన కేసులను మినహాయిస్తే).

మరి శబ్దం దేనికి?

చేతి వేళ్ల జాయింట్లను కాస్త పక్కకు లాగినపుడు, వాటి మధ్య ఉండే జిగురు పదార్థంలో పీడనం తగ్గి, అందులోని వాయువు కరిగి, బుడగలు తయారవుతాయి. ఆ బుడగలు పగిలినపుడు ఆ శబ్దం వస్తుంది. ఈ ప్రాసెస్‌ను 'కేవిటేషన్' అంటారు.

జాయింట్ల మధ్య ఉండే వాయువులు తిరిగి కరగడానికి మళ్లీ 20-30 నిమిషాలు పడుతుంది. అందుకే ఒకసారి మెటికలు విరిచాక, మళ్లీ అరగంట దాక మీరు వేళ్లు విరుచుకోలేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)