'ఈ గ్రామానికి కరువు తెలీదు, 15 ఏళ్ల వరకు కరువు రాదు'

కరువు కాలంలో గ్రామాలు నీటికి కటకటలాడటం మనకు తెలుసు. అలాంటిది కరువు మధ్యే నీటితో కళకళలాడే గ్రామాలు కూడా ఉంటాయంటే నమ్మడం కష్టం. కానీ, మహారాష్ట్రలోని పటోదా గ్రామాన్ని చూస్తే మాత్రం ఆ విషయాన్ని నమ్మితీరాల్సిందే. ప్రజల్లో అవగాహన పెంచడం, వనరుల సద్వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం... వీటన్నింటి సాయంతో ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించింది.
మహారాష్ట్రలోని ఆ ఆదర్శ గ్రామం పేరు పటోదా. కరువు పీడిత ఔరంగాబాద్ జిల్లా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది.
'మా గ్రామంలో మేం స్వావలంబన సాధించాం. అంటే ఈ గ్రామ ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. గ్రామాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఇళ్ల ముందర చెట్లు ఎలా నాటుకోవాలి, వృథా నీటిని ఎలా పారెయ్యాలి, వాటర్ మీటర్ ఎలా ఉపయోగించాలి, వృథా నీటితో ఏం చేయొచ్చు వగైరా విషయాలన్నీ మా ప్రజలకు నేర్పించాం. ప్రజలు దానికి అనుగుణంగా నడచుకుంటున్నారు' అని ఆ పటోదా గ్రామ పెద్ద భాస్కర్ పేరే చెబుతారు.
ఆ గ్రామం కరువును ఎలా జయించిందో ఈ కింది వీడియోలో చూడండి

2011-12లో పటోదా గ్రామం రాష్ట్ర స్థాయిలో సంత్ గాగ్డేబాబా గ్రామస్వచ్ఛతా అభియాన్ అవార్డును గెల్చుకుంది.
'నా పేరు రత్నా పేరే. నాది ఈ ఊరే. పెళ్లి తర్వాత నేను పర్భణికి వెళ్లిపోయాను. పర్బణీలో ఇప్పుడు చాలా తీవ్రమైన కరవు ఉంది. అక్కడ నీటికి బాగా కొరతగా ఉంది. కానీ పటోదాలో ఉండే అమ్మాయిలు, కోడళ్లు, తల్లులకు మాత్రం దూరం నుంచి నీళ్లు మోయాల్సిన అవసరమే ఉండదు' అంటారు మరో మహిళ.
ఈ ఊళ్లో గ్రామ పంచాయతీ ద్వారా రోజుకు 24 గంటలూ ఫిల్టర్డ్ వాటర్ సరఫరా అవుతుంది. ఇక్కడి నీటి లభ్యతను చూసి గ్రామానికి కోడళ్లుగా వచ్చిన మహిళలు చాలా సంతోషిస్తున్నారు.
'నాకు పెళ్లయి పదిహేను రోజులే అవుతోంది. మా అమ్మ వాళ్ల గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగడానికి కూడా నీరు దొరకడం కష్టమే. నీళ్లు తేవడానికే రోజూ నేను రెండు, మూడు గంటలు కష్టపడేదాన్ని. పటోదాలో మాత్రం అలాంటి సమస్యే లేదు. కాబట్టి ఆ ఖాళీ సమయంలో నేను మరేదైనా పని చేయగలుగుతున్నా' అంటారు ఆ గ్రామానికి కొత్త కోడలిగా వచ్చిన వైష్ణవి.
- చేతిలో డబ్బున్నా చుక్క నీరు సంపాదించుకోలేకపోతున్నాం
- ‘పది నిమిషాలు ఆగితే వందల మంది చనిపోయేవారు.. ఆ టైంలో యుద్ధం ఆపించా’
పటోదాలోని ఆంగన్వాడీ సెంటర్లో, స్కూల్ దగ్గర, వీధుల్లో సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశారు. మురుగు కాల్వల కోసం విడిగా గోతులు తవ్వించారు. ఆ నీటిని రీసైకిల్ చేసి పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి దగ్గరే కాబట్టి అక్కడి నుంచి వచ్చే వృథా నీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు.
'గత పదిహేనేళ్లలో మేమెన్నడూ కరువును ఎదుర్కోలేదు. రాబోయే పదిహేనేళ్లలో కూడా కరువు వస్తుందేమోనన్న భయం మాకు లేదు' అంటారు పటోదావాసులు.
'మేం ఈ గ్రామంలో ఎన్నో పనులు చేశాం. రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, మామూలు నీరు, సోలార్ ద్వారా వేడి నీరు సరఫరా వంటి సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీటన్నింటి కోసం ప్రతి కుటుంబం సగటున చెల్లించాల్సింది నెలకు 291 రూపాయలు మాత్రమే. ఈ ఖర్చుతోనే ఈ సదుపాయాలన్నీ లభిస్తాయి. అట్లాగే ఏడాది పొడవునా పని చేసే ఉచిత పిండి గిర్నీలను కూడా ఏర్పాటు చేశాం' అంటారు గ్రామ పంచాయతీ ఉద్యోగి దీపాలీ పేరే.
ఈ గ్రామంలో ఉన్న 1500 ఎకరాల వ్యవసాయ భూమిలో 70 శాతానికి నీటి సౌకర్యం ఉంది.
ఇక్కడ నూటికి నూరు శాతం మంది టాయిలెట్లను వాడతారు. 6 పబ్లిక్ టాయిలెట్లు కూడా ఉన్నాయి.
గ్రామంలోని రోడ్లపై 15 సోలార్ లైట్లు ఉన్నాయి. 11 బయోగ్యాస్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు. పటోదాకు ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- రూ.500 ఇంధనంతో 160 కి.మీ. ప్రయాణించే విమానం
- భారత్తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- ‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’: ఉబర్
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేయనున్న ఏడు కీలక శక్తులు
- కోర్టులకు వేసవి సెలవులు అవసరమా...
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)