ఇలా చేస్తే 180 ఏళ్లు బతకడం సాధ్యమేనట... మీరూ ట్రై చేస్తారా?

  • 26 జూన్ 2019
ఆస్ప్రే Image copyright Getty Images

మనిషి 180 ఏళ్లు బతకడం సాధ్యమేనా? అంటే, సైన్స్, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తే సాధ్యం అమవుతుందని అంటున్నారు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే.

'ది బాస్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తల జీవిత కథలను బీబీసీ వారంవారం ప్రచురిస్తోంది. అందులో భాగంగా ఈవారం 'బుల్లెట్‌ప్రూఫ్' అనే అమెరికన్ కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు డేవ్ ఆస్ప్రేతో బీబీసీ మాట్లాడింది.

ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న డేవ్.. 180 సంవత్సరాలు జీవించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ప్రయత్నాలను చూసి చాలామంది అతనివన్నీ 'వెర్రి' వేషాలు అంటారు. డేవ్ మాత్రం తనను తాను ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ 'బయోహ్యాకర్' అని చెప్పుకుంటారు.

సైన్సు, టెక్నాలజీ సాయంతో జీవశాస్త్రాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుని (హ్యాక్ చేసి) ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించే వ్యక్తిని బయోహ్యాకర్ అంటారు. అలాంటి చర్యలను మిగతా సమాజమంతా 'పిచ్చి చేష్టలుగా' చూస్తుంది.

Image copyright DAVE ASPREY
చిత్రం శీర్షిక డేవ్ ఆస్ప్రే

డేవ్‌ ఆలోచన ప్రకారం, ఆరు నెలలకోసారి ఆయన ఎముకల మజ్జ (బోన్ మ్యారో)లో కొంత భాగాన్ని తొలగించాలి. దాని నుంచి మూలకణాలను (స్టెమ్ సెల్స్) సేకరించి, వాటిని శరీరమంతా ఎక్కించాలి. దాంతో, శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది.

అంతేకాదు, అతను అప్పుడప్పుడు క్రయోథెరపీ చాంబర్‌లో ఉండాలి. ఆ చాంబర్‌లో ఉండే ద్రవరూప నైట్రోజన్ అతని శరీరాన్నిచల్లబరుస్తుంది. తలకు ఎలక్ట్రోడ్లు అమర్చుకోవాలి, పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్ లైట్) కింద గడపాలి.

ఇలాంటి పద్ధతుల్లో శరీరం, మెదడు పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఇప్పటికే తాను 10 లక్షల డాలర్లకు (రూ.7 కోట్లు) పైగా ఖర్చు చేశానని డేవ్ ఆస్ప్రే తెలిపారు. అంత డబ్బు ఖర్చు పెట్టడం కాఫీ వ్యాపారంలో రాణిస్తున్న ఇతనికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ

కాఫీలో బట్టర్ కలిపితే

బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ ఒక అరుదైన రుచిని అందిస్తోంది. ఆ బ్లాక్ కాఫీ తయారీ కోసం మూడు వేర్వేరు పదార్థాలు కొనాల్సి ఉంటుంది. అందులో వెన్న(బట్టర్), శుద్ధి చేసిన కొబ్బరి నూనె కలపాలి.

ఈ కాఫీ తాగితే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని డేవ్ ఆస్ప్రే అంటున్నారు. 2012 నుంచి ఈ కాఫీని మార్కెట్‌లోకి తెచ్చామని, ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా కప్పుల కాఫీ అమ్ముడుపోయిందని ఆయన చెప్పారు.

అయితే, వైద్య నిపుణుల నుంచి ఈ కాఫీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కాఫీలో బట్టర్ కలపడం ఆరోగ్యకరం కాదని వైద్యులు అంటున్నారు.

2004లో టిబెట్ సందర్శనకు వెళ్లినప్పుడు తనకు ఈ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ ఆలోచన వచ్చినట్లు డేవ్ ఆస్ప్రే చెప్పారు. అప్పట్లో అతడు అధిక బరువు (136 కిలోలు)తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

దాంతో, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే తపనతో ధ్యానం చేయడం నేర్చుకునేందుకు టిబెట్‌కు వెళ్లారు. ఒకరోజు పర్వతం మీదికి వెళ్తుండగా మార్గం మధ్యలో జడలబర్రె (యాక్) పాల నుంచి తీసిన వెన్న కలిపిన కాఫీ తాగారు.

ఆ కాఫీ తాగిన తర్వాత మెదడు చాలా మెరుగైనట్లు అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో, తిరిగి కాలిఫోర్నియాకు వెళ్లాక సొంతంగా కొత్తరకం కాఫీ తయారీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక టిబెట్‌లో జడలబర్రె (యాక్) పాలతో తయారు చేసిన వెన్నను కాఫీలో కలుపుతారు.

అమెరికాలో జడల బర్రెలు చాలా బలహీనంగా బక్కగా ఉంటాయి. వాటి నుంచి పాలు సేకరించడం, అందులోంచి వెన్న తీయడం కష్టం. దాంతో, ఆవు పాలతో తయారు చేసే వెన్నను వినియోగించారు. ఆ కాఫీ సాధారణ టీ కంటే చాలా ప్రభావవంతంగా అనిపించింది. దానికి మరింత ప్రత్యేకంగా తయారు చేసేందుకు శుద్ధి చేసిన కొబ్బరి నూనె ('బ్రెయిన్ ఆక్టేన్ ఆయిల్') ను కలిపారు.

"రోజూ ఉదయం ఈ కాఫీని తాగేవాడిని, దాంతో 45 కిలోల బరువు తగ్గాను" అని ఆస్ప్రే చెప్పారు.

అయితే, కాఫీలో బట్టర్ కలపడం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్(బీడీఏ) ప్రతినిధి ఐస్లింగ్ పిగోట్ అంటున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు లేని బుల్లెట్‌ప్రూఫ్ కాఫీని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడంలో ప్రయోజనం లేదని ఆమె చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవ్ ఆస్ప్రే

డేవ్ ఆస్ప్రే మాత్రం వైద్య నిపుణుల విమర్శలను తోసిపుచ్చారు.

"గతంలో నాకు కీళ్ల నొప్పులు ఉండేవి. చిన్నపని చేసినా తీవ్రమైన ఆయాసం, అలసట వస్తుండేది. గుండె దడ సమస్య ఉండేది. ముందస్తు మధుమేహం ఉండేది. ఇన్ని సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడేవాడిని. ఇప్పుడు అవన్నీ దూరమయ్యాయి" అని ఆయన చెప్పారు.

"నేను చెబుతున్న డైటింగ్ ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వస్తున్న ఆధునిక డైటింగ్ విధానాలకు భిన్నమైనది. 4000 ఏళ్లుగా కొనసాగుతున్న పురాతన టిబెట్ సంప్రదాయం ఆధారంగా రూపొందించిన కాఫీ మాది" అని ఆస్ప్రే అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు