డోనల్డ్ ట్రంప్: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళపై ‘ఆమె నా టైప్ కాద'ని కామెంట్

  • 25 జూన్ 2019
జీన్ కారోల్, ట్రంప్ Image copyright REUTERS AND GETTY

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఓ మహిళ గురించి 'ఆమె నా టైప్ కాదు' అంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

ఆమె పూర్తిగా అసత్యాలు చెబుతున్నారని అన్నారు.

''చాలా గౌరవంగా చెబుతున్నా. మొదటి విషయం.. ఆమె నా టైప్ కాదు. రెండో విషయం.. ఆమె చెబుతున్నట్లు ఏదీ జరగలేదు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌పై ఆరోపణలు చేసిన ఆ మహిళ పేరు జీన్ కారోల్. ఆమె అమెరికాలో ప్రముఖ కాలమిస్టు..

75 ఏళ్ల వయసున్న ఆమె ఇటీవలే న్యూయార్క్ మ్యాగజైన్‌లో ఈ ఆరోపణలు చేశారు. ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు.

ఆ తర్వాత సీఎన్ఎన్, ఎమ్‌ఎస్ఎన్‌బీసీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ చట్టపరంగా ట్రంప్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కారోల్ చెప్పారు.

ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళల్లో కారోల్ 16వ వారు.

వీరందరి ఆరోపణలనూ ట్రంప్ తోసిపుచ్చుతున్నారు.

Image copyright AFP/GETTY

కారోల్ ఏం చెప్పారంటే..

1995 చివర్లో గానీ, 1996 ఆరంభంలో గానీ మాన్‌హాటన్‌లో ఉన్న బెర్గ్డాఫ్ గుడ్‌మాన్ స్టోర్‌లో తనను ట్రంప్ లైంగికంగా వేధించారని కారోల్ చెప్పారు.

అక్కడ తామిద్దరం అనుకోకుండా ఎదురుపడ్డామని ఆమె చెప్పారు.

ఆడవాళ్ల లోదుస్తుల గురించి తనను ట్రంప్ సలహాలు అడిగారని, వాటిని వేసుకుని చూపించమని కోరారని ఆరోపించారు.

దుస్తులు మార్చుకునే గదిలో ట్రంప్ తనను ఓ గోడకు నెట్టి, బలవంతంగా తన మీదకు వచ్చారని పేర్కొన్నారు.

కష్టపడి, ట్రంప్‌ను తోసేసి తాను అక్కడి నుంచి బయటపడ్డానని వివరించారు.

Image copyright Getty Images

ట్రంప్ స్పందన ఇది..

ద హిల్ అనే వార్తాపత్రికతో ట్రంప్ మాట్లాడుతూ.. కారోల్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.

ట్రంప్, కారోల్ కలిసి ఉన్న ఫొటొ న్యూయార్క్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. అయితే, కారోల్ ఎవరో తనకు తెలియదని ట్రంప్ అన్నారు.

కారోల్ తన తదుపరి పుస్తకంలో ట్రంప్‌పై మోపిన ఆరోపణల గురించి ప్రస్తావించనున్నారు.

ఈ పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే ఆమె తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ ఇదివరకు ఆరోపించారు.

''ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం. పుస్తకం అమ్ముకోవడం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు'' అని ట్రంప్ అన్నారు.

'నా టైప్ కాదు' అంటూ ట్రంప్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై కారోల్ స్పందించారు.

'నేను ఆయన టైప్ కానందుకు సంతోషంగా ఉంది'' అని ఆమె అన్నారు.

ఇదివరకు జెస్సికా లీడ్స్ అనే మహిళ ట్రంప్ ఓ విమానంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని 2016లో ఆరోపించారు.

దీనికి స్పందిస్తూ ట్రంప్.. ''ఆమె నా తొలి ఛాయిస్ మాత్రం కాబోదు'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)