తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?

  • 29 జూన్ 2019
సింగపూర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింగపూర్

ప్రస్తుతం భారత్‌లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నై నగరంలో నీటి కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.

సిబ్బంది అవసరాల కోసం నీటిని సరఫరా చేయలేక చెన్నైలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. నీళ్లు లేక కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? దీనిని అధిగమించడం ఎలా? మన చేతుల్లో ఉన్న మార్గాలేమిటి? ఒక్కసారి సహజమైన నీటి వనరులు లేని సింగపూర్‌ గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నలకు చాలావరకు సమాధానాలు దొరుకుతాయి.

Image copyright JEFF GREENBERG

సింగపూర్ ఏం చేస్తోంది?

సింగపూర్‌కు సొంతంగా నీటి వనరులు లేవు. అందుకే తన ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు పూర్తిగా మలేషియా మీదే ఆధారపడుతోంది. 1965లో మలేషియా నుంచి విడిపోక ముందు నుంచీ ఈ విధానం కొనసాగుతోంది.

సింగపూర్‌కు సొంత సహజసిద్ధమైన నీటి వనరులు లేవు కాబట్టి, ఇక్కడ 1868లో తొలి డ్యామ్ నిర్మించారు.

1927 నుంచి మలేషియా నుంచి సింగపూర్ నీటిని తీసుకుంటోందని 'మీడియాకార్ప్' అనే వార్తా సంస్థ తెలిపింది.

ప్రస్తుతం 'ఫోర్ నేషనల్ ట్యాప్స్' కార్యక్రమంలో భాగంగా నీళ్లను పొదుపుగా ఎలా వినియోగించాలన్న అవగాహనను ప్రజల్లో పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Image copyright Getty Images

ప్రతి బొట్టునూ ఒడిసిపట్టి

722 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సింగపూర్‌ భూభాగంలో మూడింట రెండొంతుల ప్రాంతం నీటి నిల్వకు అనుకూలమైనదని ప్రభుత్వం చెబుతోంది. దాంతో, తన భూభాగంలో పడే ప్రతి వర్షపు బొట్టునీ ఒడిసిపట్టి నిల్వ చేసుకునేందుకు 17 కుంటలను ఏర్పాటు చేసింది.

సింగపూర్‌లో అధిక భాగం పట్టణ ప్రాంతమే అయినప్పటికీ, భారీ ఎత్తున పైపులు, కాలువులు ఏర్పాటు చేసి వర్షపు నీటిని సేకరిస్తోంది. ఆ నీటిని పలు దశల్లో శుద్ధి చేసిన తర్వాత ప్రజలకు సరఫరా చేస్తుంది.

మలేషియా నుంచి

సింగపూర్‌కు నీళ్ల తరలింపునకు సంబంధించి 1961లో మలేషియా, సింగపూర్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, 2061వ సంవత్సరం వరకూ మలేషియాలోని జోహోర్ నది నుంచి ప్రతి రోజూ 250 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేందుకు వెసులుబాటు ఉంది. ఆ ఒప్పందం గడువు ముగిసేలోగా స్థానికంగా సొంత నీటి వనరులను అభివృద్ధి చేసుకునే దిశగా సింగపూర్ ప్రయత్నాలు చేస్తోంది.

Image copyright ROSLAN RAHMAN

పునర్వినియోగం

వాడిన నీటిని పునర్వినియోగించేందుకు అవసరమైన సాంకేతికతను కూడా సింగపూర్ వినియోగిస్తోంది.

నీటి పునర్వినియోగ కార్యక్రమాన్ని 1970లోనే ప్రారంభించారు. కానీ, బడ్జెట్ కేటాయింపులు సరిపోకపోవడంతో రెండు దశాబ్దాలపాటు ఆ కార్యక్రమం ముందుకు కదలలేదు.

2000లో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ యుటిలిటీ బోర్డ్ (పీయూబీ) కింద మళ్లీ ప్రారంభించారు. 2003 నాటికి రెండు ప్లాంట్లలో నీటి శుద్ధిని ప్రారంభించి, 10,000 ఘనపు మీటర్ల నీటిని శుద్ధి చేశారు.

ఇళ్లల్లో, హోటళ్లతో పాటు, కొన్ని పరిశ్రమల నుంచి నీరు నేరుగా ఈ ప్రాంట్లలోకి వస్తుంది. పరిశ్రమల నుంచి వచ్చే నీటిని కూడా తాగేందుకు యోగ్యంగా మారే వరకూ వివిధ దశల్లో శుద్ధి చేస్తున్నామని, దానిపట్ల ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని సింగపూర్ పబ్లిక్ యుటిలిటీ బోర్డు చెబుతోంది.

ప్రస్తుతం అలాంటి ప్లాంట్లు ఐదు ఉన్నాయి. దాదాపు 40 శాతం సింగపూర్ నీటి అవసరాలను ఆ ప్లాంట్లు తీరుస్తున్నాయి. 2060 నాటికి 55 శాతం నీటి అవసరాలను తీర్చాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Image copyright facebook

తాగునీరుగా సముద్ర జలాలు

డిసాలినేషన్ (నిర్లవణీకరణ) అంటే సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగించి ఆ నీటిని తాగేందుకు యోగ్యంగా మార్చడం.

నీళ్ల కోసం సింగపూర్ ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేస్తున్నది ఈ ప్రాజెక్టు కోసమేనని అధికారులు చెబుతున్నారు.

ఈ విధానం ద్వారా నీటిని శుద్ధి చేసేందుకు వినియోగించే యంత్రాలకు విద్యుత్ ఖర్చులు భారీగా అవుతాయని, అందుకే ఇది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం సింగపూర్ నీటి అవసరాల్లో 30 శాతం వరకు నిర్లవణీకరణ ప్లాంట్లే తీరుస్తున్నాయి.

ఇప్పుడు చెన్నై ప్రజల దాహార్తిని తీర్చేందుకు మహాబలిపురం సమీపంలో అలాంటి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Image copyright facebook

అవగాహన

2030 నాటికి ప్రతి వ్యక్తి రోజులో 140 లీటర్లకు మించి నీరు వినియోగించకుండా ఉండేలా అలవాటు చేసుకోవాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.

ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, 2000 నుంచి 2015 వరకు దేశంలో నీటి అవసరాలను తీర్చేందుకు ఏడు బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టారు. 2021 నాటికి మరో నాలుగు బిలియన్ డాలర్ల నిధులు వెచ్చించాలని ప్రణాళికలో ఉంది.

"నీటి వినియోగం గురించి పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. నీళ్ల సంరక్షణ, ప్రాముఖ్యత గురించి ఒకటో తరగతి నుంచే పిల్లలకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తారు" అని సింగపూర్‌లో ఉంటున్న పీజీ విద్యార్థి అశ్విని సెల్వరాజ్ వివరించారు.

పర్యావరణ మార్పుల కారణంగా నీటి వనరులు దెబ్బతింటున్నాయని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)