హ్యాకింగ్: మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...

  • 20 ఆగస్టు 2019
మొబైల్ ఫోన్ Image copyright Getty Images

చాలామందికి స్మార్ట్‌ఫోన్ అనేది ప్రపంచాన్ని చూపించే ఒక ద్వారం లాంటిది. మరి, ఆ ఫోనే మీ వ్యక్తిగత జీవితంలోకి పరాయి వ్యక్తులు తొంగిచూసేందుకు ఆధారంగా మారితే?

ఇంటర్నెట్ సాయంతో హ్యాకర్లు మీ ఫోన్‌లో నిఘా సాఫ్ట్‌వేర్‌ (స్పైవేర్)ను ఇన్‌స్టాల్ చేసేసి, మీ వ్యక్తిగత చాటింగ్ సహా, మైక్రోఫోన్, కెమెరా.. ఇలా అన్నింటినీ వారు నియంత్రణలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

నిజమే... హ్యాకర్ల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, ఉద్యమకారులు, న్యాయవాదుల కదలికలు, రోజువారీ పనులపై నిఘా పెడుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కీలకమైన ఆధారాలను మేం పరిశీలించాం.

మరి, ఈ పని చేస్తున్నదెవరు? ఎందుకు చేస్తున్నారు? మన జేబుల్లోని ఫోన్లలోకి చొరబడే ఆ స్పైవేర్‌ ఏం చేయగలదు?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మొబైల్ ఫోన్ కెమెరా

సైబర్ ఆయుధం

అత్యంత ప్రభావవంతమైన ఈ నిఘా సాఫ్ట్‌వేర్ ఒక ఆయుధం లాంటిదని, చాలా కఠినమైన షరతులతో దానిని అమ్ముతారని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లుకౌట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన నిపుణుడు మైక్ ముర్రే చెప్పారు.

"మీరు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నా సరే... మీ స్మార్ట్‌ఫోన్‌లో హ్యాకర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలరు. ఆ తర్వాత ఫోన్‌తో మీరు ఏ పనిచేసినా ఆ విషయాలను ఈ సాఫ్ట్‌వేర్ హ్యాకర్లకు చేరవేస్తుంది. మీ ఫోన్‌లోని జీపీఎస్ ఆధారంగా ఆ సాఫ్ట్‌వేర్ మీ కదలికలను ట్రాక్ చేస్తుంది" అని ముర్రే వివరించారు.

"ఫోన్ మైక్రోఫోన్‌, కెమెరాలను కూడా ఆ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాకర్లు నియంత్రణలోకి తీసుకోవచ్చు, మీ సంభాషణలను రికార్డు చేయొచ్చు. మీ చుట్టూ ఏం జరుగుతోందో కూడా ఫోన్ కెమెరాతో హ్యాకర్లు చూసే వీలుంటుంది. అంతేకాదు, మీ ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా ఆ సాఫ్ట్‌వేర్ తస్కరిస్తుంది. ఫొటోలు, ఫోన్ నంబర్లు, క్యాలెండర్ వివరాలు, ఈ-మెయిల్‌... ఇలా మీ ఫోన్‌లో ఉన్న ప్రతి ఫైల్‌నీ హ్యాకర్లు చోరీ చేసే ప్రమాదం ఉంటుంది."

"ఒక్క మాటలో చెప్పాలంటే... ఆ సాఫ్ట్‌వేర్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యిందంటే చాలు, మీరు ఏం చేసినా ట్రాక్ చేసేస్తుంది, ఫోన్‌లో ఉన్న డేటాను పూర్తిగా దోచేస్తుంది."

స్పైవేర్ల సమస్య చాలా ఏళ్లుగా ఉంది, కానీ ఈ కొత్త సాఫ్ట్‌వేర్ మరింత ప్రభావవంతమైనది.

ఈ సాఫ్ట్‌వేర్ మన ఫోన్‌లో ఉన్నట్లు గుర్తించడం కూడా అంత సులువు కాదని మైక్ అంటున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెక్సికన్ డ్రగ్ మాఫియా డాన్‌ను పట్టించిన నిఘా సాఫ్ట్‌వేర్.

డ్రగ్ మాఫియాను పట్టించిన స్పైవేర్

మెక్సికన్ డ్రగ్ మాఫియా నాయకుడు జోక్విన్ 'ఎల్ చాపో' గజ్మన్ కోట్లకు పడగలెత్తాడు.

అతడిని జైలులో వేస్తే, భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్‌లో ఉంటూ... దాదాపు ఎవరూ ట్రాక్ చేయడానికి వీల్లేని ఫోన్లను వినియోగిస్తూ మళ్లీ తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకున్నాడు.

అయితే, అతని గుట్టును ఛేదించేందుకు మెక్సికో అధికారులు ఓ అధునాతన నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. దానిని మాఫియా డాన్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఫోన్లకు పంపించారు. అలా అతని రహస్యాలన్నింటినీ తెలుసుకోగలిగారు.

ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు ఇలాంటి సాఫ్ట్‌వేర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎల్ చాపో ఉదంతం చెబుతుంది.

కానీ, ఆ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.

Image copyright Getty Images

బ్లాగర్‌పై నిఘా

బ్లాగర్ రోరి డోనాఘీ పశ్చిమాసియా ప్రచార గ్రూపును ప్రారంభించారు. అందుకోసం ఒక వెబ్‌సైట్ కూడా నడుపుతున్నారు. యూఏఈలో మానవహక్కుల ఉల్లంఘనల మీద ఆయన కథనాలు రాస్తుంటారు.

ఆయన వెబ్‌సైట్‌ వీక్షకుల సంఖ్య కొన్ని వందల్లో మాత్రమే ఉంటుంది. అయితే, ఆయనకు ఉన్నట్టుండి ముక్కూ ముఖం తెలియని ఎవరెవరి నుంచో ఈ-మెయిళ్లు రావడం మొదలయ్యాయి. ఆ మెయిళ్లలో ఏవేవో లింకులు పంపుతున్నారు.

ఆ మెయిళ్లపై అనుమానం వ్యక్తం చేసిన రోరీ ఒక ఈ-మెయిల్‌ను టొరంటో విశ్వవిద్యాలయంలోని 'సిటిజెన్ ల్యాబ్' అనే పరిశోధనా కేంద్రానికి పంపించారు.

ఆ ఈ-మెయిళ్లలోని లింకు క్లిక్ చేస్తే ప్రమాదకరమైన మాల్‌వేర్ డౌన్‌లోడ్ అవుతుందని, అది యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్లకు కూడా చిక్కదని పరిశోధకులు గుర్తించారు.

అబూదాబిలో యూఏఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఒక సంస్థ నుంచి ఆ మెయిళ్లు వచ్చాయని బయటపడింది.

బ్రిటన్‌కు చెందిన 'గిరో' అనే ఒక బ్లాగర్ మీద, అతని కుటుంబ సభ్యులందరి మీదా నిఘా పెట్టి, వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడైంది.

Image copyright Getty Images

హక్కుల కార్యకర్తలపై నిఘా

పౌరహక్కుల మీద పోరాడుతూ పురస్కారాలు అందుకున్న ప్రముఖ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్‌ మీద కొన్నేళ్ల పాటు యూఏఈ ప్రభుత్వం నిఘా పెట్టింది.

2016లో ఆయనకు అనుమానాస్పద లింకులు కలిగిన సందేశాలు వచ్చాయి. వాటిని ఆయన సిటిజెన్ ల్యాబ్‌కు పంపారు.

పరిశోధకులు ఎలాంటి ఫైళ్లూ లేని ఐఫోన్‌ను వినియోగించి ఆ లింకును క్లిక్ చేశారు. ఆ తర్వాత ఆ ఫోన్‌లో ఒక నిఘా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయినట్లు, ఫోన్ నుంచి సమాచారం ఎవరికో వెళ్లిపోతున్నట్లు గుర్తించారు.

ఐఫోన్‌ను అత్యంత భద్రతతో కూడిన ఫోన్‌గా అందరూ భావిస్తారు. అయినా, ఆ ఫోన్‌లోనూ గుట్టుచప్పుడు కాకుండా ఆ నిఘా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయింది. అది యాపిల్ సంస్థకు పెద్ద సవాలే విసిరింది.

దాంతో, వెంటనే ప్రపంచవ్యాప్తంగా యాపిల్ హుటాహుటిన తన ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేసి, ఐఫోన్ వినియోగదారులందరూ తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ సూచించింది.

యూఏఈ ప్రభుత్వం మన్సూర్ ఫోన్‌ నుంచి ఎలాంటి సమాచారం సేకరించిందో స్పష్టత లేదు, కానీ ఆ తర్వాత ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నారు.

లండన్‌లోని యూఏఈ రాయబారి బీబీసీతో మాట్లాడుతూ, తమ భద్రతా సంస్థలు ఇతర దేశాల మాదిరిగానే దేశీయ, అంతర్జాతీయ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తాయని అన్నారు. అయితే, నిఘా వ్యవహరాల గురించి మాత్రం ఆయన స్పందించలేదు.

Image copyright Getty Images

జర్నలిస్టులపై దాడి

2018 అక్టోబర్‌లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలోకి వెళ్లిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ తిరిగి ప్రాణాలతో రాలేదు. ఆయన్ను సౌదీ ఏజెంట్లు హత్యచేశారు.

ఖషోగ్జీ ఐఫోన్‌ హ్యాక్ అయిందని, సౌదీ ప్రభుత్వమే ఆ పని చేసిందని ఆయన స్నేహితుడు ఒమర్ అబ్దుల్ ఆజిజ్ అంటున్నారు. తన స్నేహితుడి ఖషోగ్జీ దారుణ హత్యలో ఆ హ్యాకింగే కీలక పాత్ర పోషించిందని ఒమర్ భావిస్తున్నారు.

తామిద్దరం తరచూ రాజకీయాలతో పాటు పలు విషయాలపై చర్చించుకునేవాళ్లమని, ఫైళ్లను షేర్ చేసుకునేవాళ్లమని, ఆ ఫైళ్లన్నింటినీ చాలాకాలంగా సౌదీ ప్రభుత్వం తస్కరించిందని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై సౌదీ ప్రభుత్వం స్పందిస్తూ... మొబైల్ ఫోన్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్ ఉంది, కానీ దాని వెనుక సౌదీ అరేబియా ఉన్నట్లు చూపించే సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది.

Image copyright Getty Images

వాట్సాప్‌లో లోపం

కోట్లాది మంది వినియోగించే వాట్సాప్ మెసెంజర్ యాప్‌లో భద్రతా లోపం ఉన్నట్లు 2019 మేలో వెల్లడైంది.

ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని వినియోగదారుల ఫోన్లు, డివైజ్‌ల మీద హ్యాకర్లు దాడి చేశారన్న విషయం నిర్థరణ అయింది. వినియోగదార్ల ఫోన్లలో వాట్సాప్ ద్వారా నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలిగారని వాట్సాప్ సంస్థ వెల్లడించింది.

ఆ నిఘా సాఫ్ట్‌వేర్ ద్వారా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న ఫోన్లలోని మెసేజ్‌లను చదివే వీలుంటుందని తేలింది.

దాంతో, వెంటనే ఆ లోపాన్ని సరిచేస్తూ వాట్సాప్ అప్‌డేట్ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)