జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు?

  • 28 జూన్ 2019
ఒసాకా జీ20 శిఖరాగ్ర సదస్సు Image copyright Getty Images
చిత్రం శీర్షిక జపాన్‌లోని ఒసాకా జీ20 సదస్సుకు హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ డోనల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు

భారతదేశం సహా ప్రపంచంలోని 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ అధినేతలు శుక్రవారం జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన జీ20 సదస్సులో సమావేశమయ్యారు.

వీరిని ''గ్రూప్ 20'' - జీ-20 - అని వ్యవహరిస్తారు. అంటే అర్థం 20 మంది బృందం అని. కానీ ఈ సదస్సు ఎందుకోసం జరుగుతోంది? ఈ భేటీ ప్రాధాన్యం ఏమిటి?

Image copyright Getty Images

ఏమిటీ జీ-20?

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 85 శాతం వాటా ఈ 20 మంది సభ్యులదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 ప్రాంతాల్లోనే ఉంటారు.

ఈ బృందానికి తనకంటూ శాశ్వత సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ బృందంలోని ఒక దేశం తమ ప్రాంతం వంతు వచ్చినపుడు.. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది.

తదుపరి శిఖరాగ్ర సదస్సును, చిన్న చిన్న సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం స్వీకరిస్తుంది.

జీ-20 సభ్యులు కాని దేశాలను ఈ శిఖరాగ్రానికి అతిథులుగా ఆహ్వానించటానికి, అటువంటి దేశాలను ఎంపిక చేయటానికి ఈ దేశానికి వీలుంటుంది. అలా స్పెయిన్‌ను ఎల్లప్పుడూ ఈ భేటీకి ఆహ్వానిస్తుంటారు.

తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో చాలా దేశాల మీద ప్రభావం చూపిన పరిస్థితుల్లో మొట్టమొదటి జీ-20 సదస్సు 1999లో బెర్లిన్‌లో జరిగింది.

అప్పటికే.. ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్ ఆఫ్ ఎయిట్ (జీ8) బృందాన్ని విస్తరించి.. చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చేర్చారు.

అయితే జీ-8 బృందం నుంచి రష్యాను తప్పించారు. దీంతో అది ఇప్పుడు జీ7 బృందంగా మారింది.

మొదట్లో ఈ జీ-20 సదస్సుకు ప్రధానంగా ఆయా దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు.

కానీ 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో అది మారిపోయింది. బ్యాంకులు కుప్పకూలటం, నిరుద్యోగం పెరగటం, వేతనాల్లో మాంద్యం నెలకొనటం వంటి పరిణామాలతో జీ20 సంస్థ ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారిపోయింది.

ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షులు, ప్రధానమంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు.

Image copyright Getty Images

ఈ బృందం ఏం చర్చిస్తుంది?

ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఆర్థిక అంశాలు, సమస్యల గురించి ఈ భేటీకి హాజరైన ప్రపంచ నాయకులు చర్చిస్తారు.

అనంతరం గ్రూప్ సభ్య దేశాల ప్రణాళికల మధ్య సమన్వయం ఉండేలా చేయటానికి ప్రయత్నిస్తారు.

వాణిజ్యం, వాతావరణ మార్పు, ఇరాన్‌తో సంబంధాల్లో సంక్షోభం ఈ ఏడాది చర్చించే పెద్ద అంశాలుగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ సదస్సు నేపథ్యంలో సమాంతరంగా పలు సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరుగుతుంటాయి. వాటిలో ఆయా దేశాల అధినేతలు చాలా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుపుతుంటారు.

ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏఏ దేశాల అధినేతలతో ముఖాముఖి సమావేశమవుతారన్నది చాలా ఆసక్తికరంగా మారింది.

డోనల్డ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు వేర్వేరుగా ముఖాముఖి సమావేశం అవుతున్నారు. పరస్పర ఎగుమతులు, దిగుమతుల మీద అదనపు సుంకాల విధించటం గురించి ఈ భేటీల్లో చర్చించనున్నారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి నుంచి త్వరలో వైదొలగనున్న థెరెసా మే కూడా రష్యా నాయకులతో భేటీ కాబోతున్నారు.

జీ20 సదస్సులో తరచుగా ప్రధానంగా చర్చించే అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి.

ఉదాహరణకు లండన్‌లో జరిగిన 2009 జీ20 శిఖరాగ్ర సదస్సులో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదు ట్రిలియన్ డాలర్లు.. అంటే ఐదు లక్షల కోట్ల డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టాలని ప్రపంచ నాయకులు సమ్మతించారు. నాటి ఆర్థిక సంక్షోభపు తీవ్ర దుష్ఫ్రభావాలను అరికట్టటానికి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ సదస్సుల్లో ఇతర అంశాలు కూడా చర్చకు వస్తుంటాయి. ఉదాహరణకు.. సిరియాలో పాక్షిక కాల్పుల విరమణను ఎలా నిర్వహించాలనే అంశం గురించి 2017 శిఖరాగ్ర సదస్సులో చర్చించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జీ20 నాయకుల మధ్య ఉండే విభేదాలే తరచుగా పతాక శీర్షికలు అవుతుంటాయి

ఫ్యామిలీ ఫొటో ఎందుకు ఉంటుంది?

ఈ సదస్సులో పాల్గొనే ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతలు తరచుగా అందరూ కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతుంటారు.

సదస్సులో నాయకులు చేసుకున్న ఒప్పందాలను ప్రపంచానికి చాటటానికి అందరూ కలిసి మీడియాకు కనిపిస్తారు. కానీ.. ఈ నాయకుల మధ్య ఉండే విభేదాలే తరచుగా పతాక శీర్షికలు అవుతుంటాయి.

గత ఏడాది, కొందరు ప్రపంచ నాయకులు అనూహ్యంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో కరచాలనం చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫొటోలో కుడివైపు చిట్ట చివర్లో నిలుచున్నారు.

ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురైన అనంతరం మొహమ్మద్ బిన్ సల్మాన్ అంతర్జాతీయ వేదిక మీదకు రావటం అదే తొలిసారి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గత ఏడాది జీ20 సదస్సులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌‌ ఫొటోలో ఒక చివర నిల్చున్నారు

అసలు ఈ జీ20 సఫలమైందా?

ఈ గ్రూప్ చాలా చిన్నదవటం.. ఒక విధంగా శాపమైతే.. మరో విధంగా వరం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

నాయకుల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల.. నిర్ణయాలు మరింత వేగంగా తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.

కానీ.. చాలా దేశాలకు స్థానం కల్పించకపోవటం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు న్యాయంగా ఉండవని కొందరు వాదిస్తుంటారు. ఈ జీ20 సమావేశాలకు 170 దేశాలకు ఆహ్వానం ఉండదు.

అంతేకాదు.. ఇది కేవలం ''మాటల కూటమి'' అని.. పనిలో ప్రగతి చాలా స్వల్పమని ఇంకొందరు కొట్టివేస్తుంటారు.

ఈ సమావేశాల్లో నిర్ణయాలు చేయటానికి లాంఛనంగా ఓట్లు వేయటం ఉండదు. తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధంగా కట్టుబడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. ఈ బృందం అనేదే లేకపోతే.. ఏదోవిధంగా దీనిని రూపొందించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటారు.

Image copyright Getty Images

ఈ సదస్సు చుట్టూ తరచుగా భారీ ప్రదర్శనలు జరుగుతుంటాయి.

లండన్‌లో 2009లో జరిగిన సదస్సు సందర్భంగా భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నపుడు.. ఇంటికి వెళుతున్న ఒక సాధారణ పౌరుడు ఇయాన్ టామిల్సన్ అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

జీ20 సదస్సు ఆర్థిక విధానాలను నిరసిస్తూ గత ఏడాది బ్యూనస్ ఎయిర్స్‌లో వేలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ ఏడాది జరుగుతున్న సదస్సుకు ముందు.. హాంగ్ కాంగ్ నిందితుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టాలన్న ప్రణాళిక ఉంది.

జీ-20 పూర్తి సభ్య దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండొనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు