క్రికెట్ వరల్డ్ కప్ 2019: బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా

  • 29 జూన్ 2019
బాల్, బంతి

ఇంగ్లండ్‌లో క్రికెట్ వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. వరుస విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది.

షమి లాంటి పేసర్లు విసిరే అద్భుతమైన స్వింగర్లను, కుల్‌దీప్ యాదవ్ లాంటి స్పినర్లు చేసే మాయాజాలాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.

ఇలా బంతితో విన్యాసాలు చేయించాలంటే బౌలర్లకు నైపుణ్యం ఉండటం ఒక్కటే సరిపోదు. ఆ బంతికి కూడా సత్తా ఉండాలి.

దాని ఆకారం, కుట్లు సరిగ్గా ఉండాలి. అప్పుడే బంతి దిశను బౌలర్ నియంత్రించగలడు. ఇన్‌స్వింగర్, ఆఫ్‌స్వింగర్, గూగ్లీ, స్పిన్.. ఇలా ఏదైనా వేయగలడు. ఆకారం మారితే, బంతి ఎలా పడుతుందో ఎవరికీ అంతుచిక్కదు.

అందుకే బంతి తయారీ ప్రక్రియ చాలా కీలకం. ఎన్నో సాంకేతిక అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి.

ఆ ప్రక్రియ ఎలా ఉంటుందన్న విషయం గురించి బంతుల తయారీ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా?

తసావర్ హుస్సేన్ అనే నిపుణుడు బంతి తయారీ ప్రక్రియ గురించి బీబీసీకి వివరించారు. ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి ఈ వ్యాపారంలో ఉంది.

''35-40 ఏళ్ల నుంచి మా నాన్న క్రికెట్ బంతులను తయారు చేసే పనిలో ఉన్నారు. 10 ఏళ్ల కిందటే ఆయన తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు'' అని హుస్సేన్ చెప్పారు.

వివిధ ఫార్మాట్లలో వాడే బంతుల్లో ఉండే తేడాల గురించి కూడా ఆయన వివరించారు.

''ఫుల్ కార్క్‌ను వన్డే మ్యాచుల్లో వాడతారు. హాఫ్ కార్క్‌ను టీ20ల్లో వినియోగిస్తారు. బాల్ తయారీలో తోలును ఉపయోగిస్తాం. దాన్ని నాలుగు ముక్కలుగా కత్తిరించి, లోపలి నుంచి వాటిని చేతితో కుడతాం. ఆ తరువాత వీటిని లామినేషన్ చేస్తాం. మెషీన్ మీద పెట్టి, రెండు భాగాలనూ కలుపుతాం. ఆ తరువాత రెండు వరుసల్లో కుట్లు వేస్తారు. దాంతో బాల్ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది'' అని హుస్సేన్ తెలిపారు.

60-70 డిగ్రీలకు వేడి చేసి బాల్‌కు సరైన ఆకృతిని తీసుకొస్తామని, దాని ఆకారం సరిగ్గా ఉందా లేదా అన్ని నిర్ధారించేందుకు ఓ పరీక్ష ఉంటుందని హుస్సేన్ చెప్పారు.

ఓ ప్రత్యేకమైన రంధ్రం గుండా బంతులను దూరుస్తామని, అందులో దూరగలిగినవే ఆటలోకి వెళ్తాయని వివరించారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం బంతి 156 గ్రాముల బరువుండాలని, అంతకు మించి తక్కువున్నా, ఎక్కువున్నా ఆ బంతి ఆటకు పనికిరాదని చెప్పారు.

క్రికెట్ బంతుల తయారీకి సంబంధించిన మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)