'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘

  • 1 జూలై 2019
డెబ్బీ బాలినో Image copyright DEBBIE BALINO
చిత్రం శీర్షిక డెబ్బీ బాలినో

కెనడాకు చెందిన డెబ్బీ బాలినోకు తొలి కాన్పులో ఓ పాప జన్మించింది. తమ కుటుంబం ఇంకా పెద్దగా ఉండాలన్నది ఆమె కోరిక.

రెండో సారి కూడా ఆమె గర్భం దాల్చారు. ఈసారి కూడా ఆమె కడుపులో ఆడపాప పెరుగుతోందని వైద్యులు చెప్పారు. తమ రెండో కుమార్తె రాక కోసం డెబ్బీ సంతోషంగా ఎదురుచూస్తున్నారు.

అయితే, అనుకోకుండా సమస్యలు మొదలయ్యాయి. డెబ్బీకి గర్భస్రావం అయ్యింది.

అదే తనకు తొలి గర్భస్రావం అని, 2013లో అది జరిగిందని డెబ్బీ గుర్తుచేసుకున్నారు. తాను అప్పుడు 21 వారాల గర్భంతో ఉన్నానని ఆమె చెప్పారు.

ఆ తర్వాత ఐదేళ్లలో మరో ఎనిమిది సార్లు డెబీకి గర్భస్రావాలు అయ్యాయి.

తొలి కాన్పు చక్కగా జరిగాక కూడా డెబీకి సమస్యలు ఎందుకు వస్తున్నాయో వైద్యులు గుర్తించలేకపోయారు.

Image copyright DEBBIE BALINO
చిత్రం శీర్షిక లిటిల్ స్పిరిట్స్ గార్డెన్

20 నుంచి 28 వారాల మధ్య పిండంలో జీవం ఆనవాళ్లు కనిపించడం మొదలవుతుంది. కెనడాలో ఏటా ఈ దశ తర్వాత దాదాపు 3 వేల మంది గర్భస్రావానికి గురవుతున్నారు.

సాధారణంగా ఎవరికైనా గర్భస్రావం జరిగే అవకాశాలు సాధారణంగా 15 నుంచి 20 శాతం దాకా ఉంటాయి.

కానీ, డెబీ వరుసగా తొమ్మిది సార్లు ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

ఈ పరిణామాలతో డెబీ, ఆమె కుటుంబం తీవ్ర బాధకు లోనైంది. అయితే, వారిలో కొన్ని ప్రశ్నలు కూడా ఉదయించాయి.

ఇలా గర్భంలోనే చనిపోయిన శిశువును ఏం చేయాలి? వాళ్ల స్మృతులను గుర్తుపెట్టుకునేందుకు ఏం చేయాలి?

''ఆ శిశువులు అంత్యక్రియలు నిర్వహించేంత పెద్దవారు కారు. అలా అని అసలు వారి ఉనికినే విస్మరించి, ఏమీ చేయకుండా వదిలేయడం సరికాదు. విక్టోరియా నా గర్భంలో చనిపోయినప్పుడు.. మేం ఆమెను ఆసుపత్రిలోనే విడిచిపెట్టాం. వైద్యులు ఆమెను 'బయో వేస్ట్' అన్నారు.. ఆ మాటతో నా గుండె ముక్కలైంది'' అని డెబీ చెప్పారు.

విక్టోరియాను కోల్పోయిన తర్వాత ఆమె అంత్యక్రియల గురించి ఆలోచనలు డెబీ మనసును తొలిచివేశాయి.

రెండో గర్భస్రావం జరిగిన సందర్భంలో ఆమెకు ఓ పరిష్కారం లభించింది. ‘లిటిల్ స్పిరిట్స్ గార్డెన్’ అనే ప్రదేశం గురించి ఓ వైద్యుడు ఆమెకు చెప్పారు.

Image copyright DEBBIE BALINO

బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని రాయల్ ఓక్ బరియల్ పార్క్ శ్మశానంలో ఈ లిటిల్ స్పిరిట్ గార్డెన్స్ ఉంది. గర్భస్థ దశలో మరణించిన శిశువుల కోసమే దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

కాంక్రీటుతో కొన్ని వరుసల్లో దిమ్మెలు నిర్మించి, వాటిపై చిన్న గూళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో గూడు ఒక్కో శిశువుకు స్మృతి మందిరం లాంటింది. ఇలాంటివి ఈ గార్డెన్‌లో 400 దాకా ఉన్నాయి. మొత్తంగా 3 వేల గూళ్లకు చోటుంది.

శిశువులను కోల్పోయి బాధపడుతున్న డెబీ లాంటి వారికి వైద్యులు ఈ గార్డెన్ గురించి చెబుతున్నారు. వాళ్ల బాధను ఇది కొంతైన తగ్గించగలుగుతుందన్నది వైద్యుల ఆలోచన.

ఈ గార్డెన్‌ సేవలు ఉచితం. దీనికి కొంతమంది దాతలు విరాళాలు అందిస్తున్నారు.

దహన సంస్కారాలు నిర్వహించే శిశువుల చితాభస్మాన్ని కలిపేందుకు ఓ ప్రత్యేకమైన స్థలం కూడా ఈ గార్డెన్‌లో ఉంది.

Image copyright CHRISTIE

కాంక్రీటుతో ఈ గూళ్లను నిర్మించారు. ఇందులో తల్లి గర్భాన్ని ప్రతిబింబించేలా ఓ చిహ్నం కూడా ఉంటుంది. శిశువు పేరును కూడా దీనిపై చెక్కుతారు.

శిశువుల తల్లిదండ్రులు వాటికి తమకు నచ్చినట్లుగా అలంకరణలు కూడా చేసుకోవచ్చు.

''గర్భస్రావం చాలా బాధాకరమైన అనుభవం. మీ శిశువు శరీరం కూడా ఉండదు. కానీ, వారిని గుర్తు పెట్టుకునేందుకు లిటిల్ స్పిరిట్ గార్డెన్ ఓ గూడును ఇస్తుంది. నేను కోల్పోయిన శిశువులకు స్మృతిగా ఇక్కడ గూళ్లను తీసుకున్నాక నాకు కొంత సాంత్వన లభించింది'' అని డెబీ చెప్పారు.

''మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాళ్లు జన్మించాల్సిన రోజులు (డ్యూ డేట్) వంటి ముఖ్యమైన సందర్భాల్లో మేం ఈ గార్డెన్‌కు వస్తాం '' అని డెబీ వివరించారు.

Image copyright DEBBIE BALINO

కెనడియన్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్‌లు బిల్ పెచెట్, జోసెఫ్ డేలీ ఈ గార్డెన్‌ను డిజైన్ చేశారు.

జపాన్‌లో తాను రెండేళ్ల గడిపానని, ఆ సమయంలో ఈ గార్డెన్‌కు స్ఫూర్తి లభించిందని బిల్ చెప్పారు.

''జపాన్‌లో జిజో అనే బౌద్ధ సంప్రదాయం ఉంది. మరణించిన చిన్నారులకు గుర్తుగా చిన్న బొమ్మలను వారు తయారుచేస్తారు. మందిరంలో వాటిని పెడతారు. పండుగలప్పుడు వాటిని అలంకరిస్తుంటారు'' అని బెల్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)