క్రికెట్ ప్రపంచకప్ 2019: ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు

  • 3 జూలై 2019
క్రికెట్ Image copyright Getty Images

"ఇది సంస్కృతిలోనే బలంగా నాటుకుపోయి ఉంది. టీమిండియా ఆట ప్రారంభమవ్వగానే వాతావరణం మారిపోతుంది. అది నాలో ఒక రకమైన భావోద్వేగాన్ని పెంచుతుంది. అందుకే నేను ఇంగ్లండ్ కంటే ముందు భారత జట్టుకే మద్దతు ఇస్తాను."

ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన ఒక భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి చెప్పిన మాట ఇది.

21 ఏళ్ల పవన్ పటేల్ ఇంగ్లండ్‌లోనే పుట్టి పెరిగారు. తాజాగా జూన్ 30న భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాలంటూ పవన్ చీర్స్ కొట్టారు.

ఇలాంటి వారు ఇంగ్లండ్‌లో చాలామంది ఉంటారు.

తమ కుటుంబాల మూలాలు ఇతర దేశాల్లో ఉండి, ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన క్రికెట్ అభిమానుల్లో చాలామంది తమ పూర్వీకుల దేశ జట్టుకే మద్దుతు ఇస్తారు.

1990లో యూకేలోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు లార్డ్ నార్మన్ టెబిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా వలసదారులు, వారి పిల్లలు తమ మూలాలున్న దేశ జట్టుకు కాకుండా, ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మద్దతిచ్చేంత వరకు వాళ్లు బ్రిటన్‌ సమాజంలో కలిసిపోలేనట్లే లెక్క.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకారం, ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టికెట్లు కొనుగోలు చేస్తున్నవారిలో 80 శాతం మందికి పైగా ఇంగ్లండ్‌లో నివసిస్తున్నవారే.

కానీ, వారిలో ఇంగ్లండ్ జట్టుకు మద్దతిస్తున్నది సగం కంటే తక్కువే.

మరి, దీని వెనకున్న కారణమేంటి?

Image copyright PAvan Patel
చిత్రం శీర్షిక టీమిండియా అభిమాని పవన్ పటేల్

సాంస్కృతిక సంబంధం

"నా భారతీయ మూలాలను గుర్తు చేసుకునేందుకు, మా మూలాల పట్ల భావోద్వేగాన్ని వ్యక్తపరిచేందుకు క్రికెట్ మ్యాచ్ నాకెంతో ఉపయోగపడుతుంది. మాకు చిన్నప్పటి నుంచే అది అలవాటైంది" అని పవన్ చెప్పారు.

బ్రిటన్‌లోని చాలా మంది యువ ఆసియన్లు ఇలాంటి అభిప్రాయమే చెబుతారు.

"చిన్నప్పటి నుంచీ టీవీలో భారతీయ క్రికెట్‌ను ఎప్పుడూ చూస్తున్నాను. మా కుటుంబ సభ్యులందరూ భారత్ ఆడే మ్యాచ్‌లను ఆసక్తిగా చూస్తారు" అని పవన్ చెప్పారు.

"భారత జట్టు మాదే అన్నంతగా భావించడానికి కారణం మా కుటుంబ సంస్కృతి, నేపథ్యమే. ఆ సాంస్కృతికి సంబంధం ఇంగ్లండ్ జట్టుతో లేదు" అని ఆయన అంటున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సచిన్, ధోనీ

పాకిస్తాన్ అభిమాని ఏమన్నారు?

28 ఏళ్ల ఆన్నే హయత్... పాకిస్తాన్ జట్టుకు అభిమాని. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఎంపిక విషయంలో పాటిస్తున్న వైవిధ్యం, తాను పెరిగే క్రమంలో లేదని ఆమె అంటున్నారు.

అప్పుడు ఇలాగే ఉండుంటే తనకు ఇంగ్లండ్ జట్టు మీద అభిమానం పెరిగి ఉండేదని ఆమె చెప్పారు.

ప్రస్తుతం ఆసియా మూలాలున్న ఆటగాళ్లు ఇంగ్లండ్ జట్టులో ఆడుతున్నారు.

"నేను ఎదిగే క్రమంలో, ఇంగ్లండ్ జట్టులో ఆసియా మూలాలున్న ఆటగాళ్లను పెద్దగా చూడలేదు. దాంతో, ఇంగ్లండ్ జట్టు మనది అన్న భావన నాకు కలగలేదు. దాంతో, మా కుటుంబ మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి కాబట్టి, ఆ జట్టువైపు ఆకర్షితురాలినయ్యాను."

"కానీ, ప్రస్తుతం మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ లాంటివారు ఇంగ్లండ్ తరఫున ఆడుతుండటంతో, ఇప్పుడు ఆసియన్లకు కూడా ఆ జట్టులో ప్రాతినిధ్యం పెరిగిందన్న అభిప్రాయం నాలో బలపడుతోంది" అని హయత్ చెప్పారు.

Image copyright SAGAR GHELANI

ఉన్నతవర్గాల ఆట

ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ను 'ఉన్నత వర్గాల' క్రీడగా చూస్తారు. ఇంగ్లండ్ పురుషుల అంతర్జాతీయ క్రికెట్ జట్టులో 43 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్నవారేనని ఒక నివేదిక తెలిపింది.

"ఇంగ్లిష్ ఆటగాళ్లలో ఎవరూ కింది స్థాయి కుటుంబాల నుంచి వచ్చినవారు లేరు. వాళ్లంతా ఒక ఉన్నత స్థాయి సముదాయానికి చెందినవారే అన్నట్లుగా ఆ జట్టు ఉంటుంది. అదే భారత జట్టు విషయానికొస్తే, అందులో చాలామంది అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉన్నత స్థాయికి వచ్చిన ఆటగాళ్లు కనిపిస్తారు" అని భారత అభిమాని, ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన 23 ఏళ్ల సాగర్ ఘెలానీ వివరించారు.

సచిన్ తెందూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ లాంటివారి జీవిత కథలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సాగర్ అన్నారు.

ఒకప్పుడు రైల్వే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేసిన ధోనీ, టీమిండియా కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో విజయాలు సాధించిపెట్టారు.

"భారత ఆటగాళ్లు ఎంతో ఆసక్తితో, కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో కష్టపడి క్రికెటర్లు అయ్యారు. అది ఎంతో స్ఫూర్తిదాయకం" అంటారు సాగర్.

Image copyright SIA NAJUMI
చిత్రం శీర్షిక సియా నజుమీ

ద్వేషపూరిత నేరాల ప్రభావం

కొన్ని దశాబ్దాల క్రితం బ్రిటన్‌కు వలసవెళ్లిన ఇతర దేశాల ప్రజల్లో చాలామంది అక్కడ జాత్యహంకార ద్వేషాన్ని, వివక్షను ఎదుర్కొన్నారు. ఇంగ్లండ్ జట్టుకు వారు అభిమానులుగా మారకపోవడానికి ఆ పరిస్థితులు కూడా బలమైన కారణాలు.

అయితే, తాను ఇంగ్లండ్ జట్టుకు మద్దతివ్వకపోవడానికి కారణం జాతివివక్ష కాదని అఫ్గానిస్థాన్ జట్టు అభిమాని 23 ఏళ్ల సియా నజుమి అన్నారు.

"ఇంగ్లండ్‌లో ద్వేషపూరిత నేరాల వల్ల నేను అఫ్గానిస్థాన్ జట్టుకు అభిమానిగా మారలేదు. అది మా అమ్మానాన్నల స్వదేశం, అందుకే నేను అఫ్గాన్ జట్టుకు మద్దతు ఇస్తున్నాను" నజుమి చెప్పారు.

2017/18 సంవత్సరంలో ఇంగ్లండ్, వేల్స్‌లో 94,098 ద్వేషపూరిత నేరాలు రికార్డుల్లో నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2012/13తో పోల్చితే ఈ నేరాల సంఖ్య 123% అధికం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు

మరి ఫుట్‌బాల్?

తాము క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టుకు మద్దతు ఇవ్వకపోయినా, ఫుట్‌బాల్‌లో తమ మద్దతు ఆ జట్టుకే ఉంటుందని సాగర్ అంటున్నారు.

సాగర్ లాగే భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్లకు మద్దతిచ్చే బ్రిటిష్ ఏషియన్లు ఇతర క్రీడల్లో మాత్రం ఇంగ్లండ్‌ జట్టు మీద అభిమానం చూపుతుంటారు.

బ్రిటన్‌లో పుట్టిపెరిగిన బ్రిటిష్ ఏషియన్లలో 77.19 శాతం మంది అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో యూకే జట్లకే మద్దతు ఇస్తారని కామ్‌రెస్, బీబీసీ ఏషియా నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఫుట్‌బాల్ జట్టులోని సభ్యుల్లో విభిన్న సముదాయాలకు చెందినవారు ఉండటమే దీనికి కారణమని పవన్ పటేల్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘చిన్నపాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి పసిపాపను రేప్ చేసి చంపినారు’

నానావతి కమిషన్: గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి

సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని

పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా.. శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా

సుప్రీం కోర్టు: ‘హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ’

BHU: సంస్కృతం ప్రొఫెసర్ ఫిరోజ్ ఖాన్ రాజీనామా.. ధర్నా విరమించుకున్న విద్యార్థులు

రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది