యూరోపియన్ యూనియన్ కమిషన్‌ అధ్యక్ష పదవి చేపట్టనున్న తొలి మహిళ ఈమే

  • 3 జూలై 2019
ఉర్సులా Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉర్సులా

యూరోపియన్ యూనియన్(ఈయూ) కమిషన్‌ అధ్యక్ష పదవికి తొలిసారి ఒక మహిళ నామినేటయ్యారు.

జర్మనీ రక్షణ మంత్రి ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌ను ఈయూ నేతలు నామినేట్ చేశారు. ప్రస్తుత ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్ స్థానంలో ఉర్సులా ఈ పదవిని చేపట్టనున్నారు.

మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్‌ క్రిస్టీన్ లగార్డె యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) హెడ్‌గా నామినేటయ్యారు. ఈసీబీకి నేతృత్వం వహించే అవకాశం మహిళలకు దక్కడం కూడా ఇదే తొలిసారి.

యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్, ఫారిన్ పాలసీ చీఫ్‌గా స్పెయిన్‌కు చెందిన జోసెఫ్ బారెల్ నామినేటయ్యరు. యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్‌ పదవికి ఇంకా ఎవరినీ నామినేట్ చేయలేదు. బుధవారం ఈ నామినేషన్ ఉండొచ్చు. జర్మనీకి చెందిన యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు మేన్‌ఫ్రెడ్ వెబర్, బల్గేరియాకు చెందిన సోషలిస్ట్ నాయకుడు సెర్గీ స్టానిషెవ్ ఈ రేసులో ఉన్నారు.

నియమితులైనవారి నేపథ్యమిదీ..

ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌:

బ్రసెల్స్‌లో జన్మించిన ఉర్సులాకు 13 ఏళ్ల వయసప్పుడు ఆమె కుటుంబం జర్మనీకి తరలిపోయింది. లండన్‌లో ఎకనమిక్స్, హానోవర్‌లో మెడిసన్ చదివిన ఆమె అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.

2005 నుంచి ఏంగెలా మెర్కెల్‌కు చెందిన కన్జర్వేటివ్ క్రిస్టియన్ డెమొక్రాట్స్(సీడీయూ)లో ఉర్సులా సభ్యురాలిగా ఉన్నారు.

ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టనున్న తొలి మహిళగానేకాదు.. గత 60 ఏళ్లలో ఈ పదవి చేపడుతున్న తొలి జర్మన్ కూడా ఆమే.

Image copyright AFP
చిత్రం శీర్షిక క్రిస్టీన్ లగార్డె

క్రిస్టీన్ లగార్డె:

ఫ్రాన్స్‌కు చెందిన 63 ఏళ్ల క్రిస్టీన్ లగార్డె ప్రస్తుతం ఐఎంఎఫ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ పదవికి చేపట్టిన తొలి మహిళగా 2011లో ఆమె రికార్డు సృష్టించారు.

పారిస్, అమెరికాల్లో చదువుకున్న లగార్డె అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.

2005లో ఫ్రాన్స్ వాణిజ్య మంత్రిగా, 2007లో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిగా ఆమె పదవులు చేపట్టారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక చార్లెస్ మైఖేల్

చార్లెస్ మైఖేల్:

38 ఏళ్ల వయసులోనే 2014లో బెల్జియం ప్రధాని పీఠంపై కూర్చున్నారు. 1841 తరువాత బెల్జియంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడు ఆయనే.

1998లో బ్రసెల్స్‌లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన ఆయన ఆ తరువాత ఏడాదిలో బెల్జియం పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

మైఖేల్ తండ్రి లూయిస్ మైఖేల్ కూడా యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు.

Image copyright EPA

జోసెఫ్ బారెల్:

72 ఏళ్ల జోసెఫ్‌ ఈయూలో కీలక బాద్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

ఇంతకుముందు 2004 నుంచి 2007 వరకు యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం స్పెయిన్ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

1975 నుంచి స్పానిష్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయనకు ముక్కుసూటి మనిషిగా పేరుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)