భారత్‌లో చిన్నారుల మరణాలు: ఒక్క ఏడాదిలోనే 12 లక్షల మంది పిల్లలు చనిపోయారు

  • 7 జూలై 2019
બાળકો Image copyright Getty Images

దేశంలో ఒక్క 2015 సంవత్సరంలోనే 10 లక్షల మందికి పైగా అయిదేళ్ళ లోపు వయసున్న చిన్నారులు మరణించారు. అయితే, అన్ని చోట్లా ఈ మరణాలు ఒకే రకంగా లేవు. ప్రాంతీయ వ్యత్యాసాలు చాల ఎక్కువగా కనిపిస్తాయి.

బీహార్‌లో కొన్నిరోజుల వ్యవధిలోనే 150 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దేశ ఆరోగ్య వ్యవస్థ మీద, పిల్లల పట్ల చూపిస్తున్న అశ్రద్ధ మీద దేశ ప్రజలు తమ దృష్టి పెట్టేలా చేసింది.

శిశు మరణాల సంఖ్య 2000 సంవత్సరం నుంచి బాగా తగ్గింది. సగానికి సగం తగ్గిందని చెప్పొచ్చు. కానీ, పుట్టిన పిల్లల ఆయుష్షు మాత్రం మెరుగుపడలేదు.

ఒక్క 2015లోనే భారత్‌లో దాదాపు 12 లక్షల మంది అయిదేళ్ళలోపు వయసు పిల్లలు మరణించారని, ఆ ఏడాది ప్రపంచం మొత్తం మీద ఇదే అత్యధికమని ప్రముఖ వైద్య పత్రిక 'లాన్సెట్' వెల్లడించింది.

ఆ 12 లక్షల్లో సగం మంది పిల్లలు కేవలం 3 రాష్ట్రాలలోనే మరణించారు. అవి ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లు. దీనికి కొంతకారణం ఈ రాష్ట్రాలలో జనాభా ఎక్కువ ఉండడమైతే, తీవ్ర ప్రాంతీయ అసమానతలను కూడా ఆ మరణాలు ఎత్తిచూపుతున్నాయి.

Image copyright Getty Images

ఏ రాష్ట్రంలో ఎలా?

2015లో పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో కేరళలో 9 మంది మాత్రమే మరణిస్తుండగా మధ్యప్రదేశ్‌లో ఆ సంఖ్య 62. దేశంలో అయిదేళ్ళలోపు పిల్లల సగటు మరణాల రేటు 43 కాగా, మధ్యప్రదేశ్‌లో దాని కంటే దాదాపు 20 ఎక్కువ.

ఈ విషయంలో తక్కువ ఆదాయ రాష్ట్రాలైన అస్సాం, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌ల పరిస్థితి కూడా అదే. అధికాదాయ రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉంది.

మానవాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు మొదటినుంచీ ముందంజలోనే ఉన్నాయి.

భారత ప్రజారోగ్య సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ దిలీప్ మౌలాంకర్ దానికి కొన్ని కారణాలు చెప్పారు.

"కేరళ ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే వ్యవసాయ సంస్కరణలు, మహిళా సాధికారత, విద్య, పూర్తి స్థాయి సిబ్బందితో పని చేసే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న పడకలు, టీకాల కోసం, ఇతర వైద్య సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టడం.. ఇవన్నీ కారణమే" అని ఆయన చెప్పారు.

జనాభా అధికంగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మౌలికమైన ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం చాలా కష్టతరమైన పని అని ప్రొ. మవలాంకర్ అంటున్నారు.

అక్కడ చాలాచోట్ల సరైన రోడ్లు ఉండవు. ముఖ్యంగా తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళేందుకు చాలా గ్రామాలకు సరైన దారులు లేవు. దాంతో ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రయాణానికే చాలా సమయం పడుతుంది.

"పాలనాపరమైన సమస్యలు" ఉన్న మాట నిజమే అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అంగీకరిస్తోంది. కొన్ని రాష్ట్రాలలో "ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా ఉండడం వలన వైద్యసేవలలో, ముఖ్యంగా ప్రసవాల విషయంలో, ఆలస్యంతో పాటు నాణ్యమైన సేవలు కూడా అందడం లేదు."

పిల్లలెందుకు చనిపోతున్నారు?

యునిసెఫ్ తాజా నివేదిక ప్రకారం 2017లో భారతదేశంలో నెలలోపు వయసు పిల్లల మరణాలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రసవ సమయంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, రెండోది నెలలు నిండకుండానే జరుగుతున్న ప్రసవాలు.

ఈ మరణాలన్నీ నివారించగలిగినవే; మాతాశిశు వైద్యసేవలను మెరుగు పరచాల్సిన అవసరాన్ని గుర్తు చేసేవే.

2005లో ఈ లక్ష్యంతోనే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు వైద్య ఆరోగ్య సేవలు తక్కువగా అందుబాటులో ఉన్న 8 రాష్ట్రాలలో వాటిని మెరుగుపరచడం దీని లక్ష్యం.

ఆ రాష్ట్రాలు: బీహార్, ఛత్తీస్ గడ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లు. వాటికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ (ఈఏజీ) రాష్ట్రాలని పేరు పెట్టారు.

అక్కడ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు, అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు, సిజేరియన్ ఆపరేషన్లకు సదుపాయాలు కల్పించేందుకు పథకాలను రూపొందించారు.

వీటికి తోడు నగదు ప్రోత్సాహక పథకాలను కూడా అమల్లోకి తెచ్చారు. ఆస్పత్రులలో ప్రసవించే స్త్రీలందరికీ ప్రసవానికి ముందూ, తర్వాతా ఉచిత వైద్య సేవలను అందించే జననీ సురక్షా యోజన (జేఎస్‌వై), పిల్లలకు ఏడాది వచ్చేవరకు అవసరమైన అన్ని సేవలూ అందించే జననీ శిశు సురక్షా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. సిజేరియన్ కాన్పులు సైతం వీటి కింద ఉచితమే.

డాక్టర్లు, శిక్షణ పొందిన నర్సులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆస్పత్రి ప్రసవాలను ప్రోత్సహిస్తే మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం ఉద్దేశం.

ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలను వారు సమర్ధవంతంగా పరిష్కరించడమే కాకుండా, నవజాత శిశువులకు రాగల జబ్బులను కూడా వారు ముందే పసిగట్టి పరిష్కరించగలుగుతారు.

"ఇప్పటికే ఆస్పత్రి ప్రసవాల విషయంలో మంచి విజయం సాధించాము, గత 12 ఏళ్ళలో అవి రెట్టింపు అయ్యాయి" అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలాని అన్నారు.

దేశం మొత్తం మీద ఈ పెరుగుదల ఉంది కానీ, బీహార్ రాష్ట్రాల్లో వీటి సంఖ్య 63.8 శాతం దగ్గరే ఆగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది.

కేరళలో ఆస్పత్రి ప్రసవాల సంఖ్య 99.9 శాతం కాగా, తమిళనాడులో 99 శాతంగా ఉంది. దేశం మొత్తం మీద తమిళనాడుదే అగ్రస్థానం.

"ఆస్పత్రి ప్రసవాలకు విముఖత చూపిస్తున్న ప్రాంతాలు అక్కడక్కడా కొన్ని ఉన్న మాట వాస్తవమే" అని ఒప్పుకుంటూ.. "ఇప్పుడు మా దృష్టంతా 'లక్ష్య' కార్యక్రమం మీద ఉంది. తల్లికీ బిడ్డకీ కూడా ఆ అనుభవం ఆనందదాయకంగా ఉండేలా చేయడమే దాని ఉద్దేశం" అని ఝలాని వివరించారు.

ఏ జబ్బులు ఎక్కువ ప్రాణాంతకం?

మొదటి నెల తర్వాత చనిపోయే పిల్లల్లో సగం మందికి పైగా న్యుమోనియా, విరేచనాల వల్లే చనిపోతున్నారని యునిసెఫ్ రిపోర్ట్ చెపుతోంది.

భారత్‌లో ఐదేళ్ళ లోపు పిల్లలకు న్యుమోనియా రావడానికి ప్రధాన కారణాలు పౌష్టికాహార లోపం, బరువు తక్కువగా పుట్టడం, తల్లి పాలకు మాత్రమే పరిమితం కాకపోవడం, చిన్నమ్మవారు లేదా తట్టుకు టీకాలు వేయించకపోవడం, ఇంటి లోపలి గాలి కాలుష్యం, కిక్కిరిసిన ఇళ్ళల్లో ఉండడం.

ఈ పరిస్థితి దృష్ట్యా చిన్న పిల్లల్లో న్యుమోనియా నివారణకు ఒక కొత్త వ్యాక్సిన్ తీసుకురానున్నట్టు 2017లో ప్రభుత్వం ప్రకటించింది.

దేశమంతటా వ్యాక్సినేషన్ (టీకాల) సేవలను పెంచడానికి అదే సంవత్సరం ప్రారంభించిన 'ఇంద్రధనుష్‌'లో అది ఒక భాగం.

దాని ప్రభావం మరికొన్నేళ్లలో తెలుస్తుందేమో కానీ, ఇప్పుడైతే వ్యాక్సినేషన్ సేవలు అందడంలోనూ ప్రాంతీయ అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 నివేదిక ప్రకారం, ఈ విషయంలో పంజాబ్ 89.1 శాతం, కేరళ 82.1 శాతంతో పై స్థాయిలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ 38.2 శాతం, అస్సాం 47.1 శాతంతో అట్టడుగున ఉన్నాయి.

విరేచనాల (డయేరియా) నివారణకు పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక రకం విరేచనాల నివారణకు మాత్రమే వ్యాక్సిన్ లభిస్తోంది.

కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం, పారిశుధ్య సదుపాయాలు తక్కువగా ఉన్న ఝార్ఖండ్ (24 శాతం), బీహార్ (25 శాతం), ఒడిషా (29 శాతం), మధ్యప్రదేశ్ (33 శాతం) రాష్ట్రాలలోనే ఐదేళ్ళ లోపు పిల్లలకు డయేరియా ఎక్కువగా వస్తోంది.

పారిశుధ్య సదుపాయాలు ఉండడమంటే మలమూత్రాలు డ్రైనేజీలోకి వెళ్ళే ఏర్పాటు గల సొంత మరుగుదొడ్డి (టాయిలెట్) లేదా ఎవరితోనూ పంచుకోనవసరం లేని ఏదో ఒక రకమైన గుంత మరుగుదొడ్డి కలిగి ఉండడమని చెప్పొచ్చు.

గత అయిదేళ్ళుగా ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్ అభియాన్' ద్వారా ఇంటికొక మరుగుదొడ్డి కార్యక్రమాన్ని చాలా చురుకుగా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నది.

తొమ్మిది కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరుబయట మలవిసర్జన నుంచి దూరమయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి.

Image copyright TWITTER/MIN IT, KTR
చిత్రం శీర్షిక తెలంగాణలో ప్రవేశ పెట్టిన జెట్టీ యంత్రాలు

మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఆరోగ్య విద్య, ప్రజల ప్రవర్తనలో మార్పు కూడా అవసరమని ప్రొ. మవలాంకర్ అంటున్నారు.

"శుభ్రమైన తాగునీరు లభించడం, దాని గురించి అవగాహన కలిగి ఉండడంతో పాటు శరీరం నీరసించినపుడు ఒ.ఆర్.ఎస్ కలుపుకుని తాగడం, ఈగల వంటి కీటకాల నుండి ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం అవన్నీ కూడా విరేచనాల నివారణకు అవసరమైన చర్యలే" అని ఆయన చెప్పారు.

అన్ని అంశాలలోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వైద్యసేవల అందుబాటులో, టీకాలు వేయించడంలో, పారిశుధ్యంలో, విద్య, మహిళా సాధికారత... అన్నింటిలోనూ ఆ రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నారు.

అయిదేళ్ళ లోపు పిల్లలు అర్ధంతరంగా చనిపోకుండా ఉండేందుకు ఇవన్నీ అవసరమే. ఈ విషయంలో వెనకబడ్డ ప్రాంతాలు ఆ రాష్ట్రాలను మార్గదర్శకంగా తీసుకోవచ్చు.

(పరిశోధన, గ్రాఫిక్స్ : షాదాబ్ నజ్మి, పునీత్ కుమార్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)