1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్

  • 5 జూలై 2019
1983 ప్రపంచకప్ Image copyright Getty Images

1983 ప్రపంచ కప్ విజయం భారత్‌లో క్రికెట్‌పై ఆసక్తిని అమాంతం పెంచింది. కపిల్ డెవిల్స్ అనూహ్య విజయంతో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ప్రాముఖ్యం పెరిగింది.

ఈ విజయం తర్వాత బీసీసీఐ ఆర్థికంగా ఎదిగింది. దీంతో ఐసీసీలో బలమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కలిగింది.

భారత జట్టు విజయాలకు అది ప్రారంభం అయితే, వెస్టిండీస్ పతనం, ఆధిపత్యానికి ముగింపు ఆ ప్రపంచ కప్‌ పరాజయంతోనే ప్రారంభమైంది.

సెమీఫైనల్స్ సమరానికి టీమిండియా సిద్ధమవుతున్న ఈ సమయంలో ఓసారి 1983 సెమీఫైనల్‌లో విజయం సాధించిన నాటి సంగతులను గుర్తుచేసుకోవాలి.

Image copyright Getty Images

1983 జూన్ 22 - బాబ్ విల్లీస్ సారథ్యంలోని బలమైన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది.

అయితే భారత జట్టు ఇంగ్లండ్‌ను 60 ఓవర్లలో 213 పరుగులకు కట్టడి చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆ రోజుల్లో ఓ సవాలే. పైగా ప్రత్యర్థి జట్టులో విల్లీస్, ఇయాన్ బోధమ్ వంటి దిగ్గజ బౌలర్లున్నారు. సరిగ్గా అప్పటికి సంవత్సరం క్రితం ఇదే బౌలింగ్ ద్వయం భారత్‌ను 0-2తో టెస్టు సిరీస్ కోల్పోయేలా చేసింది.

దూకుడైన బ్యాటింగ్‌కు పేరుపొందిన కృష్ణమాచారి శ్రీకాంత్, మరో సీనియర్ సునీల్ గావస్కర్‌లు ఓపెనింగ్ చేస్తూ 20 ఓవర్లలో 46 పరుగులు చేశారు. సెమీఫైనల్, ఫైనల్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన మరో ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ రెండు సిక్సులు బాది 46 పరుగులు చేశాడు.

యశ్‌పాల్ శర్మ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు.

Image copyright Getty Images

ఇక గెలిపించాల్సిన బాధ్యత కపిల్ దేవ్, సందీప్ పాటిల్‌ల భుజాలపై పడింది. సందీప్ పాటిల్ ఇదే గ్రౌండులో సంవత్సరం క్రితం జరిగిన ఓ మ్యాచ్‌లో బాబ్ విల్లీస్ బౌలింగ్‌లో ఆరు వరుస బౌండరీలు బాదాడు. దీన్ని పునరావృతం చేస్తూ ఇప్పుడు కూడా విల్లీస్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు బాదాడు. భారత్ లక్ష్యానికి చేరువగా వచ్చింది.

అప్పుడే క్రికెట్ చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చూడని ఓ ఘటన జరిగింది.

Image copyright Getty Images

ఈ మ్యాచ్‌కు డాన్ ఓల్సర్ అంపైరింగ్ చేస్తున్నారు. భారత విజయానికి కేవలం 5 పరుగులు కావాలి. పాటిల్ ఓ బౌండరీ బాదాడు. దీంతో స్కోరు సమమైంది. కానీ ప్రేక్షకులు మ్యాచ్ అయిపోయిందనుకుని, మైదానంలోకి, పిచ్ పైకి పరిగెత్తుకొచ్చారు. గ్రౌండు మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది.

అప్పట్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉండేవి కాదు. మైదానంలోకి వచ్చినవారంతా భారత మూలాలున్నవారే.

పెవిలియన్ దగ్గర నిలబడి ఉండమని బాబ్ విల్లీస్ తమ ఆటగాళ్లతో చెప్పాడు. చివరి పరుగు కూడా పూర్తైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్దామన్నాడు. ఓ బౌలర్, వికెట్ కీపర్ తప్ప మిగిలిన 9 మంది ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని పెవిలియన్ దగ్గర నిలబడి చూస్తున్నారు.

అంపైర్లు కూడా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. కానీ డాన్ ఓల్సర్ మాత్రం ఓ స్టంప్ ఊడపీకి, తన వైపు వస్తున్న ప్రేక్షకుల వైపు చూపిస్తూ, వారికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత కాసేపటికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. తనపై దాడి జరిగితే రక్షించుకునేందుకే ఆ స్టంప్ తీసిపట్టుకున్నానని మాజీ పోలీస్ కూడా అయిన ఓల్సర్ ఆ తర్వాత వ్యాఖ్యానించారు.

1983లో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకూ ఏ అంపైర్‌కూ స్టంప్‌లను తీసుకుని ఆత్మరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు