అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో

  • 9 జూలై 2019
బ్లీచింగ్ చేయించుకుంటున్న మహిళ Image copyright AFP
చిత్రం శీర్షిక భారతదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ముగ్గురు చర్మ సౌందర్య క్రీములు వాడుతున్నారు

''నా పెళ్లి రోజు నేను అస్సలు బాగా కనిపించలేదు. అది నేను చాలా వికృతంగా కనిపించిన రోజు'' అని భావోద్వేగంతో చెప్పారు శిరోమా పెరీరా (ఆమె అసలు పేరు కాదు).

ఆమె శ్రీలంక రాజధాని కొలంబోలో నివసిస్తున్నారు. దక్షిణాసియాలో చాలా మంది లాగానే పెళ్లికి ముందు తన చర్మ రంగును కాస్త అందంగా, మెరిసేలా చేసుకోవాలని భావించారు.

''పోయిన సంవత్సరం నా పెళ్లికి రెండు నెలల ముందు ఒక సెలూన్‌కు వెళ్లాను. వాళ్లు నా చర్మం తెల్లగా అవటానికి ఒక క్రీమ్ ఇచ్చారు. ఒక వారం రోజులు వాడగానే నా ముఖం బ్లీచ్ చేసినట్లుగా కనిపించింది. చర్మం తెల్లగా అవుతుందనుకున్నాను. కానీ కాలిపోయింది'' అని చెప్పారామె.

అలా పాడైన చర్మానికి చికిత్స చేసుకోవటానికి ఆమె చాలా సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

చిత్రం శీర్షిక షిరోమా పెరీరా చర్మం రంగు తెల్లబరచుకోవటానికి చేసిన ప్రయత్నం ఆమె ముఖం మీద, మెడ మీద ఇంకా చారలను మిగిల్చింది

''చర్మం మీద తెల్లటి బొబ్బలు వచ్చాయి. తర్వాత అవి నల్లని మచ్చలుగా మారాయి'' అని ఆమె తెలిపారు.

సెలూన్‌లో ఆమెకు ఇచ్చిన క్రీమ్.. శ్రీలంకలో అధీకృత అనుమతులు ఉన్న ఉత్పత్తి కాదు. దానిని చట్టవ్యతిరేకంగా దిగుమతి చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్‌లో కొన్నారు.

ఏడాదిగా చికిత్స తీసుకుంటున్నా కూడా పెరీరా మెడ మీద ఇప్పటికీ నల్లటి చారలు కనిపిస్తున్నాయి.

ఆమెలా ఇంకా ఎంతో మంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా మార్కెట్‌లోకి తెస్తున్న వైటెనింగ్ క్రీమ్‌ల మీద అధికారులు దాడులు చేస్తున్నారు.

కానీ ఇది ఒక్క శ్రీలంక సమస్య కాదు. ఆసియా, ఆఫ్రికాల్లో కోట్లాది మంది.. ముఖ్యంగా మహిళలు చర్మం రంగును తెల్లగా చేసుకోవటం కోసం విపరీతమైన చర్యలకు సిద్ధపడుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2027 నాటికి చర్మ సౌందర్య సాధనాల మార్కెట్ 890 కోట్ల డాలర్లకు పెరుగుతందని అంచనా

ప్రపంచ వ్యాప్తంగా.. చర్మ రంగుకు సంబంధించి 2017లో 480 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని అంచనా. 2027 నాటికి ఇది రెట్టింపై 890 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికాల్లో మధ్యతరగతి వర్గాల వారి నుంచే ప్రధానంగా డిమాండ్ వస్తోంది.

సోప్‌లు, క్రీమ్‌లు, స్క్రబ్‌లు, టాబ్లెట్లే కాదు.. చర్మానికి ముదురు రంగునిచ్చే మెలానిన్ పిగ్‌మెంట్ల ఉత్పత్తిని నెమ్మదింపజేసే ఇంజక్షన్లు కూడా ఈ ఉత్పత్తుల్లో ఉన్నాయి.

ఇండియాలో 61 శాతం మంది మహిళలు, చైనాలో 40 శాతం మంది మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చర్మసౌందర్య సాధనాల్లో క్రీములు, మాత్రలు, ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి

అంతర్జాతీయ సమస్య

ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

గర్భిణులు చర్మ రంగును పలుచబార్చే ఒక మాత్రను తీసుకోవద్దని ఘనా అధికారులు గత ఏడాది హెచ్చరించారు. అందులో ఆంటాక్సిడెంట్ గ్లుటాథియోన్ అనే పదార్థం ఉంది.

గర్భంలోని పిల్లల చర్మపు రంగును ఈ మాత్రలు కాస్త తెల్లగా చేస్తాయన్న ఆశతో ఆ దేశ మహిళలు ఈ మాత్రను తీసుకుంటున్నారు.

ఇటువంటి ఉత్పత్తులపై దక్షిణాఫ్రికాలో కొంత కఠినమైన చట్టాలున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాంగోలో చాలా మంది హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీములను వాడుతున్నారు

అక్కడక్కడా నల్లమచ్చలు ఉంటే.. చర్మనిపుణుడి పర్యవేక్షణలో హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీములను సురక్షితంగా వాడవచ్చునని బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ చెప్తోంది.

చర్మం రంగును తేలికచేసే కొన్ని క్రీములు ఉపయోగపడవచ్చునని.. కానీ డాక్టర్ చెప్పనిదే వాడితే అవి ప్రమాదకరం కావచ్చునని ఫౌండేషన్ అధికార ప్రతినిధి ఆంటన్ అలెక్జాండ్రాఫ్ పేర్కొన్నారు.

అయితే.. చర్మపు రంగును తెల్లగా చేసుకోవటానికి ''గుర్తింపు పొందిన సురక్షితమైన పద్ధతి ఏదీ లేదు'' అని ఆయన స్పష్టంచేశారు.

''దుకాణాల్లో కొనుక్కునే క్రీములు పనిచేస్తాయనేందుకు ఆధారమేమీ లేదు. పైగా అవి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. చర్మం అసహజంగా తెల్లగా కావచ్చు. చర్మం దాని సహజ గుణాలను కోల్పోవచ్చు'' అని హెచ్చరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చర్మ సౌందర్య సాధనాలను చర్మ నిపుణుల పర్యవేక్షణలో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు

మెలాస్మా వంటి కొన్ని పరిస్థితుల్లో చర్మపు రంగును తేలిక చేసే ఉత్పత్తులను డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు.

సాధారణంగా పెద్దల్లో ముఖం మీద గోధుమరంగు లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడే మామూలు చర్మ వ్యాధి అది. ఇది మహిళల్లో, ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది.

''చర్మనిపుణుడి సాయంతో చర్మపు రంగును పూర్వస్థితికి తిరిగి తీసుకురావచ్చు. అనుమతి ఉన్న కొన్ని క్రీములను డాక్టర్లు ఉపయోగిస్తారు'' అని అలెగ్జాండ్రాఫ్ తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక చర్మం రంగును తెల్లగా చేసే క్రీముల్లో ఉపయోగించే రసాయనాలు నిజానికి చర్మాన్ని పాడుచేయగలవు

దుష్ప్రభావాలు

కానీ.. చాలా మంది మహిళలు డాక్టర్ల సూచనలు, సిఫారసులు లేకుండానే ఇటువంటి ఉత్పత్తులను వాడుతుంటారు. వాటివల్ల ప్రమాకరమైన దుష్ప్రభావాలు రావచ్చు.

  • చర్మం దురద, వాపులు
  • మండుతున్నట్లు లేదా గుచ్చుతున్నట్లుగా అనిపించటం
  • చర్మం మీద చెక్కులు లేవటం

(ఆధారం - ఎన్‌హెచ్‌ఎస్ యూకే)


Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్లీచింగ్ క్రీముల్లో పాదరసం వంటి పదార్థాలు అత్యధిక మోతాదుల్లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు

పాదరసం

చర్మం మీద మచ్చలను (పిగ్మెంటేషన్) వేగంగా తొలగిస్తామని హామీ ఇచ్చే కొన్ని ఉత్పత్తుల్లో నిజానికి హానికర పదార్థాలు ఉండొచ్చు.

''పాదరసంతో కూడిన చర్మసౌందర్య సాధనాలు ఆరోగ్యానికి ప్రమాదకరం'' అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తోంది.

''చైనా, డొమినికన్ రిపబ్లిక్, లెబనాన్, మెక్సికో, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, అమెరికాల్లో పాదరసంతో కూడిన ఉత్పత్తులను ఇంకా తయారు చేస్తున్నారు'' అని గుర్తించింది.

చర్మంలో మెలానిన్ తయారీని పాదరస లవణాలు నెమ్మదింపచేస్తాయి. ఈ ప్రమాదకర రసాయనాలను ఆయా ఉత్పత్తుల్లో వాడుతున్నారు.

ఈ లోహంతో కూడిన చర్మసౌందర్య ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్‌తో పాటు ఆఫ్రికాలోని చాలా దేశాలు నిషేధించాయి. అయితే అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్ తదితర కొన్ని దేశాలు పాదరసం తక్కువ మోతాదుల్లో ఉండే ఉత్పత్తులను అనుమతిస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చట్టవ్యతిరేకంగా దిగుమతి చేసుకునే సౌందర్యసాధనాలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఆరోగ్యం

''పాదరసం ఓ విషం.. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాగలవు'' అంటారు అలెగ్జాండ్రాఫ్.

చర్మపు రంగును తేలిక చేసే సోపులు, క్రీముల్లో గల ఈ పాదరసం వల్ల తలెత్తే ప్రధాన దుష్ప్రభావాలు ఏమిటంటే:

  • కిడ్నీలు దెబ్బతినటం
  • చర్మం మీద బొబ్బలు, చర్మం రంగు మారటం, చారలు ఏర్పడటం
  • బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను నిరోధించే సామర్థ్యం తగ్గటం
  • ఆందోళన, కుంగుబాటు, మానసిక రుగ్మత, ఉపరితల నరాలు దెబ్బతినటం

(ఆధారం: డబ్ల్యూహెచ్‌ఓ)


దృక్కోణం

''చర్మసౌందర్య సాధనాలు సురక్షితమైనవని జనం అనుకుంటారు. వాటివల్ల రాగల ఆరోగ్య సమస్యల గురించి చాలా మంది ఆలోచించరు. ఈ వైఖరి ఆందోళనకరం'' అంటారు అమెరికాకు చెందిన చర్మనిపుణుడు షే షు.

''నా దగ్గరకు వచ్చే రోగులు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుక్కున్న వివిధ రకాల క్రీములు చేస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది'' అని చెప్పారు.

కాస్మెటిక్స్, వ్యక్తిగత సౌందర్య సాధనాల ప్రతికూల ప్రభావాల మీద ఆయన పరిశోధన చేశారు.

కొన్ని స్కిన్ క్రీముల్లో.. ఉపరితల స్టెరాయిడ్లు ఉంటాయి. వాటిని సరిగా ఉపయోగించకపోతే రోగులకు హాని చేయగలవు.

ప్రమాదం

ఇలాంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను ఏరివేయటానికి కఠినమైన నియంత్రణ ప్రమాణాలు ఉండాలని డాక్టర్ షు చెప్తున్నారు.

''ఔషధ రంగం మీద ఉన్నంత నియంత్రణ కాస్మెటిక్ రంగం మీద లేదు. అగ్రస్థాయి తయారీ సంస్థలు ప్రమాదకర పదార్థాలను ఉపయోగించటం లేదు. కానీ దిగుమతి చేసుకునే కాస్మొటిక్స్‌లో చాలా సమస్యలు ఉన్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.

మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులు వెల్లువగా వస్తున్నాయి. వాటిని గుర్తించటం సులభం కాదు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి, రవాణా చేసి, విక్రయించే నేర ముఠాలను గుర్తించి, పట్టుకోవటం తయారీదారులకు కష్టంగా ఉంది.

కొన్ని ఉత్పత్తుల్లో అసలు అందులో ఉన్న పదార్థాలు ఏమిటనే వివరాలు కూడా వెల్లడించవని డాక్టర్ షు చెప్పారు. వాటిని ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో కనిపెట్టలేమన్నారు.

సత్వర పరిష్కారం కోసం ప్రయత్నించవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.

''మొత్తంగా చూస్తే చాలా ఉత్పత్తులు సురక్షితమే. కానీ.. ఇంటర్నెట్ ద్వారా శక్తివంతమైన ఉత్పత్తులను కొంటున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి'' అని సూచించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ చర్మం రంగు కారణంగా వివక్షను ఎదుర్కొన్నారు

వివక్ష

అందం లోతు చర్మం లోతు అంతదే కావచ్చు. కానీ.. ముదురు వర్ణం ఉన్నవారి పట్ల సమాజంలో ఉండే వివక్ష ఇంకా చాలా లోతైనది. దీనివల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టటానికి సిద్ధపడుతున్నారు.

''దేవుళ్లందరూ ఎందుకు తెల్లగా ఉన్నారు? నల్ల దేవతలు ఎందుకు లేరు?'' అని బాక్సింగ్ సూపర్‌స్టార్ మొహమ్మద్ అలీ ఒకసారి ప్రశ్నించటం ఆలోచనను రేకెత్తించింది.

విభిన్న సంస్కృతులు, భాషల్లో శాంతికి, అందానికి, తెలివికి తెలుపు రంగును ఆపాదిస్తే.. మరణం, విపత్తు, అంద వికారానికి, చెడ్డ ఆలోచనలకు నలుపును ప్రతీకగా చూపుతారు.

Image copyright Suruthi Periyasamy
చిత్రం శీర్షిక ముదురు రంగు ఉన్న మోడళ్ల చర్మ రంగును వాణిజ్య ప్రకటనల చిత్రాల్లో ఫొటోషాప్ ద్వారా తెల్లగా కనిపించేలా చేస్తుంటారని సురుతి పెరియసామి చెప్పారు

వినోద రంగ పరిశ్రమ కూడా ఒక తరహా శరీర నమూనా, శరీర రంగును ప్రోత్సహిస్తోందని.. ఇది లక్షలాది మంది మహిళలను అభద్రతాభావంలోకి నెడుతోందని ఆరోపణలు ఉన్నాయి.

ఇలా లోతుగా పాతకుపోయిన వైఖరులపై పోరాడటానికి క్షేత్రస్థాయిలో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.

''నలుపు అందం'' అనే ఉద్యమం భారత మహిళలు చర్మాన్ని తెల్లగా చేసే సౌందర్యసాధనాలను విడనాడాలని ప్రోత్సహిస్తోంది.

పాకిస్తాన్‌లో కూడా 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అనే ఉద్యమం కూడా ఇటువంటిదే. ''అందంగా ఉండాలంటే తెల్లని చర్మం ఉండాల్సిన అవసరం లేదు'' అన్నది ఈ ఉద్యమ సందేశం.

Image copyright Suruthi Periyasamy
చిత్రం శీర్షిక అందం నిర్వచనాన్ని క్షేత్రస్థాయిలో చాలా ఉద్యమాలు ప్రశ్నిస్తున్నాయి

దేవత

తమిళనాడుకు చెందిన 24 సంవత్సరాల సురుతి పెరియసామి రెండేళ్ల కిందట.. ''డార్క్ ఈజ్ డివైన్'' (నలుపు దైవత్వం) అనే ఉద్యమంలో భాగంగా లక్ష్మీదేవిగా పాత్ర ధరించారు.

దేవుళ్లు, దేవతలను నల్లని చర్మం గల వారుగా చిత్రీకరించవచ్చునన్న లక్ష్యంతో ఆ ఉద్యమం చేపట్టారు.

''నగలు, పట్టుచీరల వాణిజ్య ప్రకటనలు తయారు చేసేవారు.. మోడళ్లుగా తెల్లని చర్మం ఉన్నవారే కావాలని పట్టుపడుతుంటారు. సంపన్నతకు - చర్మపు రంగుకు సంబంధం ఉందన్న భావన సమాజంలో ఉండటం దీనికి కారణం'' అని ఆమె అంటారు.

సూర్యరశ్మి విస్తారంగా ఉండే ఈ ప్రాంతంలో.. ప్రజల్లో అత్యధికుల చర్మ రంగు నల్లగా ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సినిమాలు, అందాల పోటీల్లో తెల్లని చర్మం ఉన్నవారికే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది

మెరిసే చర్మం

ఆమె గత ఏడాది ఒక అందాల పోటీలో పాల్గొన్నపుడు.. ఆమె ''చర్మం మెరిసేలా'' చేసుకోవాలని సూచించారు.

''నిజానికి.. నేను స్కిన్-బ్లీచింగ్ ట్రీట్‌మెంట్ తీసుకుని చర్మపు రంగును తెల్లబరుచుకోవటానకి ప్రయత్నం చేయాలన్నది వాళ్ల సూచనకు అర్థం'' అని ఆమె పేర్కొన్నారు.

ఆ పని చేయటానికి ఆమె సుముఖంగా లేరు. ఆమె వద్ద డబ్బూ లేదు. అయినా కానీ.. దేశవ్యాప్తంగా మహిళలు పోటీపడిన ఆ మిస్ దివా పోటీలో ఆమె టాప్ 25 మందిలో ఒకరిగా నిలిచారు.

ఆ పోటీలో గెలవటానికి మరో ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ''నా చర్మం రంగు కారణంగా నేను గెలిచే అవకాశాలు తక్కువని నాకు తెలుసు. కానీ నేను ఎలా కనిపిస్తాననే దానిమీద నాకు విశ్వాసం ఉంది. ఈ అవరోధాలను అధిగమించగలనని అనుకుంటున్నా'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)