అలసిపోతున్నారా? పని చేయాలంటే విసుగొస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది? పరిష్కారాలేమిటి?

  • 9 జూలై 2019
నిస్సత్తువగా ఉన్న మహిళ Image copyright Getty Images

ఎప్పుడూ అలసిపోయినట్లుగా అనిపిస్తోందా? మీరు చేయాల్సిన పనులు చూస్తే విసుగుగా అనిపిస్తోందా? ఉద్యోగంలో చేసే పని చాలా ఎక్కువగా ఉందనిపిస్తోందా?

అయితే మీరు బర్నౌట్ - అంటే నిస్సత్తువ జబ్బుతో బాధపడుతుండొచ్చు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు.

బర్నౌట్ లేదా నిస్సత్తువ అనేది ఒక వృత్తిపరమైన జబ్బు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు అధికారికంగా గుర్తించింది.

''పనిచేసే చోట తరచుగా ఒత్తిడికి లోనవుతున్న ఫలితంగా వచ్చే వ్యాధి'' అని ఈ నిస్సత్తువను నిర్వచించింది.

ఉద్యోగానికి సంబంధించి, పనికి సంబంధించి నిస్సత్తువ, వ్యతరేకత, విసుగు భావనలు ఈ జబ్బు లక్షణాలు.

అయితే.. సమస్య ఏమిటో స్వయంగా తెలుసుకోవటం కష్టం కావచ్చు.

''మీకు సన్నిహితంగా ఉండే వాళ్లు, మేనేజర్లు మీకు ఈ జబ్బు ఉందని గుర్తించగలరు'' అంటారు ఈ జబ్బు నిపుణులైర డాక్టర్ రాచెల్ మోరిస్ పేర్కొన్నారు.

నిస్సత్తువతో బాధపడుతున్నవాళ్లు.. అస్థిరంగా, విసుగుగా, నిరాశగా, నిర్లిప్తంగా మారవచ్చునని.. సరిగా తినటం మానివేస్తుంటారని, నిరంతరం అలసిపోయినట్లుగా భావిస్తుంటారని ఆమె వివరించారు.

వెన్ను నొప్పి, జీర్ణాశయ సమస్య, తలనొప్పి అంటూ తరచుగా విధులకు సెలవు పెట్టే వాళ్లు నిజానికి నిస్సత్తువతో బాధపడుతుండవచ్చునని చెప్పారు.

నాకున్న సమస్య ఏమిటి?

మీరు నిస్సత్తువతో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే.. ఈ ప్రశ్నలు వేసుకోండి:

  • మీ పని తగ్గించుకోవాలని మీకు సన్నిహితంగా ఉన్నవారు ఎవరైనా మీతో అన్నారా?
  • మీ పని పట్ల కానీ, మీ సహోద్యోగుల పట్ల కానీ, మీ వినియోగదారుల పట్ల కానీ ఇటీవలి కాలంలో మీకు కోపం కానీ, విచారం కానీ కలిగిందా?
  • మీ స్నేహితులతో, కుటుంబంతో, చివరికి మీతో మీరు కూడా తగినంత సమయం గడపలేకపోతున్నామన్న అపరాధ భావం మీకు ఉందా?
  • సరైన కారణం లేకుండానే ఏడవటం, కోప్పడటం, అరవటం, ఆందోళనకు గురవటం వంటి భావోద్వేగాలకు గురవటం పెరుగుతోందా?

ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా 'అవును' అనే సమాధానం మీరు ఇచ్చినట్లయితే.. మీరు మారాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. బ్రిటన్ వైద్యుల ఆరోగ్య కార్యక్రమం కోసం రూపొందించిన ఈ ప్రశ్నలు.. ఉద్యోగం చేసే వాళ్లు, పని చేసే వాళ్లు అందరూ తమకు నిస్సత్తువ వ్యాధి ఉందేమో తెలుసుకోవటానికి ప్రాధమికంగా ఉపయోగపడతాయి.

Image copyright Getty Images

నిజానికి ఈ నిస్సత్తువ వ్యాధి తలెత్తటానికి ఆరు నెలల నుంచి ఏడాదిన్నర కాలం వరకూ పట్టొచ్చు.

'ద బర్నౌట్ బైబిల్' రచయిత, సైకోథెరపిస్ట్ డాక్టర్ జాకీ ఫ్రాన్సిస్ వాకర్.. నిస్సత్తువ రోగులకు చికిత్స చేయటంలో స్పెషలిస్ట్.

''నా దగ్గరకు వచ్చే వాళ్లు.. తాము అంతకుముందు ఎంతో సమర్థవంతంగా చేసిన పనులను ఇప్పుడు అకస్మాత్తుగా సరగా చేయలేకపోతున్నామని చెప్తుంటారు. తమ మంత్రమేదో పోయనట్లుగా ఆశ్చర్యపడుతుంటారు'' అని ఆమె చెప్పారు.

అంతకుముందున్న సృజనాత్మకత, నైపుణ్యాలు మృగ్యమై.. 'ఎలాగోలా కొనసాగటం' అనే పద్ధతిలో పడిపోతారు.

నిస్సత్తువ అనేది ఒత్తిడి కన్నా చాలా భిన్నమైనదంటారు డాక్టర్ వాకర్.

''ఒత్తిడి అనేది స్థూలంగా చెప్తే.. ఏదైనా పరిస్థితిలో మీకు అందుబాటులో ఉన్న వనరులకన్నా డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నపుడు ఎదురయ్యేది. ఆ వనరులు మానసిమైనవి కావచ్చు, శారీరకమైనవి కావచ్చు, సమయం - సామర్థ్యాలు కావచ్చు'' అని పేర్కొన్నారు.

మనుషులు బాగా రాణించాలంటే కొంత ఒత్తిడి కూడా అవసరం. కానీ పని పతాకస్థాయికి, ఒత్తిడి శిఖర స్థితికి చేరుకున్న తర్వాత.. ఒత్తిడి పెరుగుతూ పోతుంటుంది.. పని పడిపోవటం మొదలవుతుంది.

చిత్రం శీర్షిక ఎర్క్స్-డోడ్సన్ కర్వ్ ప్రకారం.. ఒత్తిడి పెరుగుతూ ఉంటే పనితీరు పడిపోతూ ఉంటుంది

కెరీర్ మీద కోరికలున్న వాళ్లు మాత్రమే కాదు...

కెరీర్‌లో పైకి ఎదగాలన్న గాఢవాంఛ గలవాళ్ల మీద.. లేదంటే.. తాము చేసే పని ఇష్టం లేని వారి మీద మాత్రమే నిస్సత్తువ ప్రభావం చూపుతుందన్న అపోహ ఉందని.. కానీ అది నిజం కాదని డాక్టర్ మోరిస్ అంటారు.

''టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు వివిధ వృత్తుల్లో ఉన్నవారిని చాలా మందిని చూశాను. సాధారణంగా ఎక్కువ విజయం సాధించేవారు, పని పరిపూర్ణతావాదులు ఎక్కువగా నిస్సత్తువకు గురవుతుండవచ్చు. ఎందుకంటే తమ పని గుర్తింపు ద్వారా వీరికి చాలా విలువ లభిస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగాలు చేసే వాళ్ల మీదే కాదు.. ఇంట్లో సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించే వారి మీద కూడా నిస్సత్తువ తీవ్ర ప్రభావం చూపగలదు.

''పిల్లలు లేదా వృద్ధులైన బంధువులు, వైకల్యం ఉన్నవాళ్లు - తదితరుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే వాళ్లని తీవ్ర నిస్సత్తువకు లోనవుతున్న వాళ్లుగా వర్గీకరించవచ్చు. ఈ రోగులు పూర్తిగా అలసిపోతుంటారు. సానుభూతి కూడా లభించని నీరసానికి లోనవుతుండటం కూడా జరగొచ్చు'' అని డాక్టర్ వాకర్ వివరించారు.

అయితే.. చాలా మంది తాము నిస్సత్తువగా ఉన్నామని చెప్పటానికి సిగ్గుపడుతుంటారు. దీనిపట్ల తిరస్కార భావం ఉండటమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు.

తమ నిస్సత్తువకు తామే కారణమని తమను తాము నిందించుకుంటూ ఉంటారని కూడా చెప్పారు.

చిత్రం శీర్షిక నిస్సత్తువను ఎదుర్కొనే పటిమను, సానుకూల పని సంస్కృతిని పెంపొందించటానికి తోడ్పడే ‘షేప్స్ ప్రోగ్రామ్’ను రూపొందించారు రాచెల్ మోరిస్

ఒక రోజులో తగినంత సమయం లేదు

ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడేందు కోసం డాక్టర్ రాచెల్ మోరిస్ ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేశారు.

మన నిస్సత్తువ ముప్పును తగ్గించుకోవటానికి మనం చేయగలిగిన పనులు ఉన్నాయని ఆమె అంటారు.

మన పటిమను పెంచుకోవటం అందులో ఒకటి. అంటే.. ఒత్తిడికి ఆరోగ్యకరమైన రీతిలో ప్రతిస్పందించగలగటం. సవాళ్లు ఎదురైనపుడు బంతిలా పైకి లేవగలగటం.. ఆ క్రమంలో మరింత బలోపేతం కావటం.

మీరు ఆరోగ్యంగా ఉన్నారన్న భావన పెంపొందించే పనులు.. వ్యాయామం చేయటం, మనుషులతో సంబంధాలు, తగినంత నిద్రపోవటం వంటివి చేయటానికి వెసులుబాటు చూసుకోవటం ముఖ్యమని మోరిస్ సూచిస్తున్నారు.

''ఒకేసారి పెద్ద మార్పులు చేయటం నిజంగా కష్టం. కాబట్టి చిన్న చిన్న పనులతో మొదలుపెట్టవచ్చు. లంచ్ సమయంలో ఐదు నిమిషాలు నడవటం, ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగటం వంటి పనులు'' అని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మన శారీరక, మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం కూడా నిస్సత్తువకు దారితీయగలదు

బాగా ఒత్తిడిలో ఉన్న వాళ్లు తాము నియంత్రించలేని విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తుండటం మరో సమస్య అని మోరిస్ పేర్కొన్నారు. తాము నియంత్రించగల వాటి మీద మాత్రమే కేంద్రీకరిస్తే ఒత్తిడి తగ్గే వీలుంటుందన్నారు. దీనిని జోన్ ఆఫ్ పవర్ (శక్తి పరిధి)గా ఆమె అభివర్ణిస్తారు.

అలాగే.. అసలే పనేక పనులతో నిండిపోయిన షెడ్యులులో మరిన్ని పనులు చేర్చటానికి బదులుగా.. చేయాల్సిన పనులను ప్రాధాన్యాల వారీగా చేసుకుంటూ పోవటం కూడా ముఖ్యమని సూచించారు.

ఉద్యోగులు ముఖ్యమైన, అత్యవసర పనులను గుర్తించి, అవసరం లేని పనులను పక్కనపెట్టటానికి సాయపడేందుకోసం ఆమె ఒక పద్ధతిని రూపొందించారు.

అలాగే.. పనికి - జీవితానికి మధ్య సంతులనం సాధించాటానికి తోడ్పడే విధానాలను గుర్తించాలని ఆమె సూచిస్తున్నారు.

పారిశ్రామికవేత్తలు, డిజిటల్ - టెక్నాలజీ రంగంలో పనిచేసే మిలీనియల్స్.. చాలా మార్పులకు, ఉద్యోగాల విషయంలో అభద్రతకు లోనవుతుంటారని.. అయినా ఒత్తిడి మధ్య రాణించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రోజులో 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ కాలంలో పని ప్రాంతానికి భౌతిక సరిహద్దులను నిర్ధారించటం కష్టమవుతోంది

విషపూరిత పని సంస్కృతి

అమెరికాలో 7,500 మంది పూర్తికాలపు ఉద్యోగుల మీద 2018లో నిర్వహించిన గ్యాలప్ అధ్యయనంలో.. మూడింట రెండు వంతుల మంది ఉద్యోగాల్లో నిస్సత్తువకు లోనైట్లు గుర్తించారు.

నిస్సత్తువకు కారణాలు:

  • పని దగ్గర న్యాయంగా చూడకపోవటం
  • నిర్వహించలేనంత పని భారం
  • నిర్వర్తించాల్సిన విధులపై స్పష్టత లేకపోవటం
  • మేనేజర్ల నుంచి మద్దతు లభించకపోవటం
  • నిర్హేతుకమైన కాలపరిమితి ఒత్తిడి

పని ఒత్తిడికి అతి పెద్ద కారణం విషపూరిత పని సంస్కృతి కావచ్చునని డాక్టర్ వాకర్ భావిస్తున్నారు. కంపెనీల మీద వ్యయం తగ్గించుకోవాలన్న ఒత్తిడి ఉన్నపుడు.. తక్కువ మంది ఉద్యోగుల నుంచి ఎక్కువ ఫలితాలు ఆశిస్తుంటారు. సమస్యకు సంబంధించిన ఈ కోణాన్ని గుర్తించటానికి సంస్థలు మరింత కృషి చేయాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.

''పనిలో ఒత్తిడి విషయంలో కంపెనీలు కొంత మద్దతు అందిస్తున్నప్పటికీ.. తరచుగా వ్యక్తి.. అంటే ఉద్యోగి మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుంటారు.. సంస్థ మీద కాదు'' అని డాక్టర్ వాకర్ వ్యాఖ్యానించారు.

''ఉద్యోగులే ఒత్తిడికి గురవుతున్నారనేదే ఇప్పుడు నెలకొన్న భావన. 'కాబట్టి వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడటానికి సాయం చేస్తాం' అనుకుంటారు. కానీ.. పనిచేసే చోట అనుసరించే విధానాలను మార్చే అంశం మీద దృష్టి పెట్టటం అరుదు'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)