సెక్స్ విప్లవానికి తెర లేచిందా?

  • 13 జూలై 2019
శృంగారం, పునరుత్పత్తి Image copyright Getty Images

మనుషులు సెక్స్ ఎందుకు కావాలనుకుంటారు?

అంటే, 'పిల్లల్ని కనేందుకు' అనే మాట బహుశా చాలామంది చెప్పే జవాబులో ఒక ముఖ్య భాగంగా ఉండొచ్చు. అవును, పిల్లల్ని కనడానికి సెక్సే ఇప్పటివరకు ఉన్న ముఖ్య పద్ధతి.

కానీ, పునరుత్పత్తితో శృంగారానికి సంబంధం లేకుండా పోయినప్పుడు? అప్పుడు సెక్స్ గురించి మనం ఏమనుకుంటాం?

ప్రపంచంలో మొట్టమొదటి 'టెస్ట్ ట్యూబ్ బేబీ' పుట్టిన 1978 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఐ.వి.ఎఫ్ ద్వారా మొత్తం 80 లక్షల మంది పిల్లలు పుట్టారు. పిండ దశలోనే జన్యుపరమైన లోపాలను గుర్తించే కొత్త సాంకేతిక పద్ధతులను కనుగొనే కొద్దీ ఐ.వి.ఎఫ్ జననాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

"భవిష్యత్తులో కూడా ప్రజలు సెక్స్‌లో పాల్గొంటారు.. కానీ, పిల్లల్ని కనడం కోసం శృంగారంలో పాల్గొనే వారి సంఖ్య తగ్గుతుంది" అని 'ద ఎండ్ ఆఫ్ సెక్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్' పుస్తక రచయిత హెన్రీ టి గ్రీలీ నాతో అన్నారు.

"మరో 20 నుంచి 40 ఏళ్ళలో - చెప్పుకోదగ్గ మొత్తంలో ఆరోగ్య బీమా ఉన్న ప్రపంచ ప్రజల్లో అత్యధికులు- ల్యాబ్ ప్రెగ్నెన్సీలనే ఎంచుకుంటారు" అని కూడా ఆయన చెప్పారు.

పిండాన్ని గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే జన్యు విశ్లేషణ (పీ.జీ.డి) జరిపే శాస్త్రం ఎటువంటి నైతిక, చట్టబద్ధమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నదో గ్రీలీ తన పుస్తకంలో రాశారు.

"చాలా విధానాలకు ఎదురైనట్టుగానే మొదట్లో దీని పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ, కాలం గడిచేకొద్దీ పి.జి.డి ద్వారా కన్న పిల్లలకు రెండు తలలు, ఒక తోక లాంటివేమీ లేవని రుజువయ్యాక ప్రజలు వీటి పట్ల వ్యతిరేకతను విడనాడడమే కాక... సెక్స్ రహితంగా పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు కూడా" అంటారాయన.

పిల్లలు ప్రయోగశాలలో రూపుదిద్దుకునే రోజులు వచ్చాక; సంభోగం ద్వారా పిల్లల్ని కనాలనుకునే స్త్రీల సంఖ్య తగ్గిపోయాక; పిల్లల్ని కనడానికి లైంగిక నైతికతతో ఎటువంటి సంబంధమూ లేకుండా పోయాక - అటువంటి ప్రపంచంలో శృంగారానికి అర్ధం ఏముంటుంది?

Image copyright Getty Images

'సెక్స్ దేనికోసం?'

మనలో కొత్త ఆలోచనలను ప్రేరేపించేందుకు డేవిడ్ హాల్పెరిన్ కొంతకాలం క్రితం ఈ శీర్షికతో ఒక వ్యాసం రాశారు. సెక్స్ దేనికి? అనే ప్రశ్న మన తర్కబుద్ధి ఎప్పుడో ఒకప్పుడు వేసుకోకుండా ఏమీ ఉండలేదు. ఆ విచికిత్స చేయడంలో తప్పు కూడా ఏమీ లేదు. మనుషులంటేనే మేధోపరంగాను, భావోద్వేగాల పరంగాను కూడా కుతూహలం ఉండే జీవులు కదా! సెక్స్ అనుభూతుల గురించి చర్చించుకోవడం, వాటిపై సిద్ధాంతాలను తయారు చేయడం ప్రతి దాన్నీ విపులంగా, విమర్శనాత్మకంగా పరిశీలించే మానవ నైజానికి చాలా సహజమైన విషయం.

సెక్స్ ఎందుకు అనేదానికి జీవశాస్త్రపరంగా అందరికీ తెలిసిన జవాబు ఎలాగూ ఉంది. లైంగిక కోరికలను తీర్చుకోవడంతో పాటు పిల్లల్ని కని, అనుబంధాలను ఏర్పరచుకోవదానికి అది మనకు ఉపయోగపడుతుంది. పాశ్చాత్య సంప్రదాయం నుంచి మనకు లభించిన ఈ రెండు కారణాలూ ఒక అంతిమ లక్ష్యాన్ని పెట్టుకుని ఏర్పడ్డ భావనలే.

స్వీయ ఆనందాలకు కూడా పరిమితులు అవసరమని భావించిన 'బైరాగి పెద్దమనుషులు' సెక్స్‌ను కూడా ఒక అర్ధవంతమైన చట్రంలోకి ఇమడ్చాలని చూశారని గతంలో ఒక వ్యాసంలో రాశాను నేను. పిల్లల కోసం పాల్గొనే సెక్స్‌లో తప్పు లేదనేది వారి ఆలోచనా సారాంశం.

ఈ నైతికతే క్రమంగా క్రైస్తవ సంప్రదాయంలోకి, ముఖ్యంగా సెయింట్ అగస్టీన్ ద్వారా ప్రవేశించింది. పాశ్చాత్య ఆలోచనా ధోరణి మీద దీని ప్రభావం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. పిల్లల కోసం పాల్గొనే సెక్స్‌కు ఎటువంటి అనైతికతా ఉండదని చెప్పే సిద్ధాంతం అది. (ఇక్కడ చిన్న వివరణ ఇవ్వడం అవసరం. ఇది క్రైస్తవ నైతికతలా ప్రసిద్ధమైనప్పటికీ దీని మూలాలు వేరే చోట ఉన్నాయి. నిజానికి బైబిల్‌లోని సాంగ్ ఆఫ్ సోలమన్ పుస్తకం ఇద్దరు ప్రేమికుల మధ్యనున్న గాఢ, మోహపూరితమైన, ఆంక్షల్లేని శృంగారాన్ని ఒక ఉత్సవంలా వర్ణిస్తుంది. అయితే , తర్వాత వచ్చిన వ్యాఖ్యాతలు దీనికి తప్పుడు భాష్యం చెప్పి ఆ ప్రేమికులను కాస్తా భార్యాభర్తలను చేశారు.)

Image copyright Getty Images

సెక్స్ ఎందుకు అనేదానికి మరో ముఖ్యమైన జవాబు అరిస్టాటిల్ నుంచి వచ్చిందని హాల్పెరిన్ చెబుతారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో తను రాసిన 'ప్రయర్ అనలిటిక్స్'లో ఆయన చేసిన ఒక సూత్రీకరణ చూడండి.

"శృంగారం కోరుకునేది సంభోగం కంటే ఎక్కువగా ప్రేమనే అయినపుడు శృంగారానికి కావాల్సింది ప్రేమే కానీ.. సంభోగం కాదని అనుకోవాలి. కావాల్సింది ప్రేమే అయినపుడు శృంగారం అంతిమంగా కోరుకునేది కూడా అదేనని అనుకోవాలి. అలాంటప్పుడు సంభోగం శృంగారానికి గమ్యం అయినా కాకుండా ఉండాలి లేదా ప్రేమ వ్యక్తం చేయడానికి అదొక మార్గమైనా అయి ఉండాలి."

హాల్పరిన్ వివరణ ప్రకారం అరిస్టాటిల్ ఉద్దేశంలో "శృంగార వాంఛలకు అంతిమ గమ్యం ప్రేమే. సెక్స్‌ను తన గమ్యంగా ఎంచుకునేది ప్రేమ కాదు, సెక్సే ప్రేమను గమ్యంగా ఎంచుకుంటుంది."

ఆయన చెప్పేది సెక్స్‌లో పాల్గొనడానికి అసలు కారణం సెక్స్ కానే కాదు, మనుషులకు ప్రేమ కావాలి, ప్రేమించబడడం కావాలి; సెక్స్‌ను సెక్స్‌గా చూడొద్దు, అది మరింత ఉన్నతమైన, ఉదాత్తమైన దానికి సంకేతం అని.

చాలామందిలాగే అరిస్టాటిల్ కూడా సెక్స్, ప్రేమ భావనలు జమిలిగా కలుగుతాయని భావించినట్టున్నారు తప్ప, అవి నిజంగా కలిసే ఉంటాయా అనేది పరీక్షించి చూడలేదు.

"శృంగార వాంఛల అంతిమ లక్ష్యం సెక్స్ కాదు" అనేది మాత్రం ఆయన రుజువు చేసి చూపించారని హాల్పరిన్ అంటారు. అలాంటపుడు మనం ఆసక్తిగా అడగవలసిన ప్రశ్న సెక్స్‌కు, ప్రేమకు మధ్యనున్న సంబంధం గురించి కాదు, సెక్స్‌కి, శృంగారానికి మధ్యనున్న ఆశ్చర్యకరమైన సంబంధం గురించి అడగాలి. అరిస్టాటిల్ చెప్పింది నిజమే అయితే సెక్స్‌కి శృంగార వాంఛలను తీర్చే ఉద్దేశమే లేదు, దాని లక్ష్యం మరేదో. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్స్ సెక్స్ కోసం కాదు.

మళ్ళీ మొదటికి వద్దాం. మరి సెక్స్‌లో ఎందుకు పాల్గొంటాం? పిల్లల్ని కనడానికేనా? అవును. అనుబంధాలను ఏర్పరచుకోవడానికా? అవును. ఆ ప్రశ్నకు ఇవ్వగల ఎన్నో జవాబుల్లో అవి రెండు మాత్రమే. ఎన్నో సాంస్కృతిక అంశాల్లాగే సెక్స్ ఎందుకు అనేదానికి కూడా ఒక జవాబు మాత్రమే ఉండదు. ఆహారం విషయం తీసుకోండి. ఎందుకు తింటాం? బతకడానికి అనేది అందరికీ తెలిసిన జవాబు. కలిసి ఎందుకు తింటాం? అనేదానికి కూడా మన దగ్గర జవాబు ఉంది. ఎవరు సంపాదించింది వారు తీసుకొచ్చి పంచుకుని తినడమనేది మన పూర్వీకులకు లాభసాటిగా ఉండేది. అదే అలవాటు కొనసాగింది. మరి, ఇప్పటి ఆహారపు అలవాట్ల గురించి అలాంటి వివరణ ఏమిస్తాం? బంగారు రేకులు అద్దిన బర్గర్లు, ఇన్ స్టాగ్రాముల్లో ఫుడ్ అకౌంట్లు, కుకింగ్ నెట్‌‌వర్కులు, సహోద్యోగులతో హ్యాపీ అవర్స్, పాట్‌లక్ డిన్నర్లు - ఇవన్నీ వచ్చాక రాను రాను ఆహారంతో మన సంబంధాన్ని నిర్వచించడం కష్టమైపోతోంది. మనకూ, జంతువులకు మధ్య ఉన్న ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే అనవసర పనులు చేయడంలో మనం పొందే ఆనందం. కొన్ని పనులు చేయడంలో మనకు చాలా ఆనందం, సరదా ఉంటాయి. అందుకే వాటి గురించి ఎందుకు అనే ప్రశ్న వేసుకోము. బహుశా సెక్స్ కూడా అలాంటిదే కావొచ్చంటారు హాల్పరిన్. "సెక్స్ చేయడానికి కారణం తెలియకపోవడమే సెక్స్‌కు అసలు కారణం" అంటారాయన.

Image copyright Getty Images

సెక్స్‌లో పాల్గొనడానికి అది మనకిచ్చే ఆనందమే ప్రధాన కారణమని 'పవిత్రుల'తో సహా మనందరమూ ఒప్పుకోవలసిన సమయం వచ్చిందేమో!

న్యాయంగా మాట్లాడాలంటే సెక్స్ ఆలోచన మనలో రావడానికి ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఆ సమయంలో వేరే పనేదో చేసుకునేవాళ్ళం కదా! అయితే, గత కొన్ని దశాబ్దాలలో సెక్స్‌లో పాల్గొనడానికి మనం ఇంతకాలం చెప్పుకున్న కారణాలను సవాలు చేసే పరిస్థితులు ఏర్పడాయి.

వాటిలో 'పిల్' (గర్భనిరోధక మాత్ర) ఒకటి. కొందరు ఈ పరిణామానికి చాలా భయపడిపోయారు. వారిలో రచయిత పెర్ల్ బక్ ఒకరు. ఆయన 1968లో 'రీడర్స్ డైజెస్ట్' పత్రికలో ఒక వ్యాసం రాస్తూ "పిల్ అంటే ఏమిటో అందరికీ తెలుసు. అది చాలా చిన్నదే కానీ, సమాజం మీద అది చూపించే ప్రభావం అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసకరమైనది కావచ్చు" అన్నారు.

ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా విచ్చలవిడిగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల నాగరికత నాశనం అవుతుందని ఆ రోజులలో చాలామంది ఛాందసవాదులు భావించారు. పెర్ల్ బక్ కూడా ఆ హిస్టీరియాలోనే కొట్టుకుపోయినట్టున్నారు. సెక్స్ పట్ల ప్రస్తుత ఉదారవాద అభిప్రాయాలకు మూలకారణం సెక్స్ విప్లవంగా పిలవబడిన 'పిల్' రాకే కారణమని వాళ్ళందరి అభిప్రాయం.

చాలా సంవాదాలలో సెక్స్ విప్లవం వల్ల ఏం జరిగిందో మాట్లాడకుండా అన్ని అవాంఛనీయ మార్పులకు సెక్స్ విప్లవమే కారణమని నిందవేసి ముగిస్తారు. వాళ్ళు ఏమన్నప్పటికీ 1960లతో మొదలుపెట్టి సెక్స్ పట్ల ప్రజల అభిప్రాయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయని పరిశోధకులు గుర్తించారు.

శాన్ డియాగో యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జీన్ ఎం ట్వేన్గ్ 1970 దశాబ్దం నుంచి 2010 వరకు సెక్స్ పట్ల అమెరికన్ల వైఖరిలో వచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేశారు. 2015లో ఆమె రాసిన ఒక పరిశోధనా పత్రంలో "ఆ 50 ఏళ్ళలో అమెరికన్లు వివాహేతర శృంగారాన్ని అంగీకరించే మనఃస్థితికి చేరుకున్నారు" చెప్పారు.

Image copyright Getty Images

సెక్స్ ఆలోచనలలో మతపరమైన కారణాలు తగ్గి, వ్యక్తిగత కారణాలు పెరగడం కూడా గమనించారు. లైంగికత సామాజిక కట్టుబాట్లకు లోబడి ఉండనక్కరలేదని భావించే అమెరికన్ల సంఖ్య పెరగడం కూడా గమనించారు. ఇప్పటి తరాల అభిప్రాయమూ అదే. 20వ శతాబ్డంతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పటివారికి ఎక్కువమంది లైంగిక భాగస్వాములు ఉండడమే కాక వారిలో 'క్యాజువల్' సెక్స్ కూడా బాగా పెరిగిందని గమనించారు.ఇంత పెద్ద జనాభాలో వయస్సు, జాతి, జెండర్, మతం వంటి అనేక కారణాల వల్ల అభిప్రాయాలలో తేడాలు రావొచ్చు. కానీ, కాలం గడిచేకొద్దీ "లైంగిక ధోరణులలో, ప్రవర్తనలో తరాల మధ్య అర్ధవంతమైన మార్పులు వచ్చాయి" అని మాత్రం చెప్పొచ్చని ట్వేన్గ్ అన్నారు.

కాబట్టి సెక్స్ పట్ల మన అభిప్రాయాలు ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఏర్పడేవే అనేది అర్ధమవుతోంది. అంటే, మన లైంగిక నైతికత కాలతీతమైనదేమీ కాదు, అది ఎప్పటికప్పుడు కొత్తగా రూపొందుతూ వస్తున్నదే. భవిష్యత్తులోనూ మారేదే. బహుశా మనం సిద్ధపడిందాని కంటే చాలా వేగంగా మారుతూ పోవచ్చు.

Image copyright Getty Images

ఏది సహజం?

మానవులకు సంబంధించిన ప్రతి అలవాటూ, పద్ధతీ లాగే ఇదీ మనకు ఎక్కడి నుంచో వచ్చిందే. సహజాతమేమీ కాదు. మన కంటే ముందు నుంచి ఈ భూమి మీద బతుకుతున్న జంతుజాలం నుంచి ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రయాణం ద్వారా మనం ఈ లైంగిక పద్ధతులను, ప్రవర్తనను, నైతికతను అలవరచుకున్నాము. ప్రాణికోటి ఆరంభం నుంచే మొదలైన ప్రయాణం ఇది.

కేవలం మానవ జాతి గురించి మాత్రమే ఆలోచించినా సెక్స్ పట్ల ఒకనాడు మనం సహజం అనుకున్న కొన్ని అభిప్రాయాలు ఇప్పుడు సహజం కాదని తేలిపోయింది.

ఓసారి ఒక అమెరికన్ మతగురువు స్వలింగ సంపర్కాన్ని ఖండిస్తూ ఒక జోక్‌లా తన మతస్తులకు ఇలా చెప్పడం విన్నాను నేను. "ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉండకూడదని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. కొట్టంలో పశువులకు కూడా ఆ విషయం తెలుసు." స్వలింగ సంపర్కం అసహజమైనది కాబట్టే పశువులు కూడా ఆ పని చేయవు అని పాస్టర్ గారి భావన.

కానీ, అది నిజం కాదు. ఈ ప్రపంచంలో 500కి పైగానే జీవజాతులలో స్వలింగ సంపర్కం ఉందని మెలీసా హోగెన్ బూమ్ బీ.బీ.సీకి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

నిజానికి పరలింగ సంపర్కం అనే పదం రూపొందిందే స్వలింగ సంపర్కానికి వ్యతిరేకార్ధంలో.

జంతువులలో స్వలింగ, పరలింగ సంపర్కులు అనే తేడా లేని మాట నిజమే. కానీ, మనుషులు మాత్రం కనీసం ఒక శతాబ్ద కాలం నుంచి తమ లైంగిక ఎంపిక ప్రకారమే తమను తాము నిర్వచించుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఎవరూ దాన్ని ప్రత్యేకంగా గమనించినట్టు కనబడరు.

పరలింగ సపర్కం అనేది ఒక నిర్దిష్ట అర్ధంలో ఏర్పడ్డ పదం. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకార్ధంలో పుట్టిన పదం అది. దాని పుట్టుక ఉద్దేశం తెలుసుకోవాలంటే జొనాథన్ నెడ్ కట్జ్ తన ' ద ఇన్వెన్షన్ ఆఫ్ హెటెరోసెక్సువాలిటీ' పుస్తకంలో అడిగిన ప్రశ్నను మనకు మనం వేసుకోవడంతో మన అన్వేషణ మొదలుపెట్టాలి.

"ప్రపంచాన్ని స్వలింగ, పరలింగ సంపర్కులుగా విభజించడం వలన ఎవరి ప్రయోజనాలు నెరవేరాయి?" అనేదే ఆ ప్రశ్న. స్వలింగ సంపర్కుడిలా కనిపించినందుకు నాలాగా చిన్నపుడు వేధింపులకు గురైన ఏ పిల్లవాడిని అడిగినా అది మా ప్రయోజనాల కోసం జరిగిన విభజన కాదనేది చెపుతారు.

ఈ విభజన ఇంకెంత కాలం కొనసాగుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరం. 2019లో 'యుగౌ' (ఇంటర్నెట్ ఆధారంగా మార్కెట్ రీసెర్చ్, డాటా విశ్లేషణ చేసే అంతర్జాతీయ సంస్థ) చేసిన సర్వే ప్రకారం 'జనరేషన్ వై'కి చెందిన ప్రతి పది మందిలో నలుగురు తమను తాము 'పూర్తి పరలింగ సంపర్కులు'గా భావించుకోవడం లేదు.

ఇది బహుశా మారుతున్న లైంగిక ఇష్టాల కంటే ఆ ఇష్టాలకు మారుతున్న అర్ధాల గురించి ఎక్కువ చెపుతోందేమో!

ఇంకొంత స్పష్టంగా చెప్పాలంటే మనల్ని మనం లైంగికంగా ఎలా గుర్తించుకుంటామనే దానికి మూడు దశాబ్దాలకు ముందున్నంత ప్రాధాన్యం ఇప్పుడు లేదు. స్వలింగ ఆకర్షణ, సంపర్కం మానవ లైంగికతలో భాగమే, సహజమే, ఆరోగ్యమే అని ప్రపంచం దాదాపు అంగీకరిస్తున్న దశలో సెక్స్ పద్ధతుల ఆధారంగా వచ్చే మగ లేదా ఆడ గుర్తింపు వారికి అంత పెద్ద ముఖ్యం కాకుండా పోయింది.

Image copyright Getty Images

బహుశా సెక్స్ దేనికి అనే ప్రశ్నను మనం వేసుకోవడం మానేసే కొద్దీ సెక్స్‌కు అర్ధం ఏమిటని, అది ఒక వ్యక్తి గుర్తింపుకు ఎలా దోహదం చేస్తుందని ఆలోచించే జనాల సంఖ్య తగ్గొచ్చు.

సెక్స్ దేనికి అనే ప్రశ్న పరలింగ సంపర్కులను వేధించినంతగా స్వలింగ సంపర్కులను వేధించదు. దానికి కొంత కారణం గర్భధారణ అవకాశాలు వారికి మొదటి నుంచి లేకపోవడం. ఇటీవలి కాలం వరకు వివాహం చేసుకోవడానికి కూడా వారికి అవకాశాలు లేకపోయాయి. దీని వల్ల వారికి సెక్స్ అనేది మరి దేనికో కాదు, సెక్స్ సెక్స్ కోసమే అనుకోగల స్వేచ్ఛ వారికి ఉంది.

ఎందుకు అనే ప్రశ్న స్వలింగ సంపర్కులకు అసలే ఉండదని నా ఉద్దేశం కాదు. ప్రేమతో సహా దానికి ఎన్నో జవాబులు ఉండొచ్చు. కానీ, చారిత్రకంగా స్వలింగ సంపర్క సంస్కృతిలోనే సెక్స్ దేనికి అనే ప్రశ్నకు జవాబు ఏదీ లేకపోవచ్చనే స్పృహ ఉంది. అలాగే ఉండాల్సిన అవసరం లేదనే స్పృహ కూడా ఉంది. దాన్నే సమాజం తమ సాంస్కృతిక భావనల మీద, లైంగిక విలువల మీద ఎదురుదాడిగా భావించి ఉండొచ్చు. బహుశా అందువల్లే స్వలింగ సంపర్కుల పట్ల ఒక రకమైన వ్యతిరేకతను పెంచుకుని ఉండొచ్చు.

వివాహ బంధానికి లోబడే లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని, మరో రకంగా చెప్పాలంటే వివాహేతర శృంగారానికి దూరంగా ఉండాలని చాలామంది పిల్లలకు నేర్పినట్టే నాకూ నేర్పారు. అయితే, కొంత కాలానికి దీన్ని నేను ప్రశ్నించడం ప్రారంభించాను. మరీ ముఖ్యంగా నాకు దాన్ని నేర్పిన వాళ్ళే దేవుడు మానవ జాతిని కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే సృష్టించాడని చెప్పినపుడు నాకు వారి జీవశాస్త్ర జ్ఞానం మీద చాలా సందేహాలు కలిగాయి. జీవశాస్త్రమే తెలియని వాళ్లకు జీవశాస్త్రంలో భాగమైన సెక్స్ గురించి మాత్రం వారికి ఏం తెలిసి ఉంటుంది?

సెక్స్ ద్వారా పిల్లల్ని కనలేని స్వలింగ సంపర్కులకు వారు ప్రవచించే నైతిక విలువలు సరిపోవని నేను గుర్తించాను. చెప్పుకోదగ్గ జనాభా ఆ ప్రమాణాలను అందుకోలేదని తెలిసి కూడా వాటిని ఆ విధంగా నిర్ణయించడం మర్యాదగా చెప్పాలంటే చిత్తశుద్ది లేని ప్రమాణాలని, నిర్మొహమాటంగా చెప్పాలంటే క్రూరమైన ప్రమాణాలని అనాలి.

పరలింగ సంపర్కులు చేసే సెక్స్ అంతా బిడ్డల్ని పుట్టించలేదు. అయినా పిల్లల్ని పుట్టించలేని స్వలింగ సంపర్కుల సెక్స్‌ను ఖండించినంతగా పిల్లల్ని పుట్టించని పరలింగ సంపర్కుల సెక్స్‌ను ఖండించరు ఎందుకో!

అదృష్టవశాత్తూ స్వలింగ సంపర్కానికి వ్యతిరేకత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 141 దేశాలలో సెక్స్ పట్ల ప్రజల వైఖరులలో వస్తున్న మార్పుల గురించి విలియమ్స్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో, అంటే 57 శాతం దేశాలలో 1981- 2014 మధ్య ఎల్‌జీబీటీలకు ఆమోదం పెరిగిందని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే అన్ని చోట్లా అటువంటి మంచి మార్పులు జరగలేదు. మొదటి నుండి వీరిని ఆమోదిస్తూ వచ్చిన ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్, అండోరా, నార్వేలలో ఈ ఆమోదం మరింత పెరిగితే మొదటి నుంచి వీరిని అంతగా ఆమోదించని అజర్ బైజాన్, బాంగ్లాదేశ్, జార్జియా, ఘనా దేశాలు వాటి పట్ల మరింత అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

వారి వ్యతిరేకతను విస్మరించకూడదు కానీ అధ్యయనం చేసిన దేశాలలో ఎక్కువ దేశాలు స్వలింగ సంపర్కాన్ని ఆమోదించాయని గుర్తు పెట్టుకోవడం అవసరం.

Image copyright Getty Images

ఈ ఆమోదానికి పలు కారణాలు ఉన్నాయి. ఎల్‌జీబీటీల గురించి మీడియాలో సానుకూల కథనాలు రావడం, మెడికల్, సైకాలజీ సంస్థల నుంచి బహిరంగంగా మద్దతు లభించడం, చాలామందికి ఎల్‌జీబీటీలు వ్యక్తిగతంగా తెలిసి ఉండడం వీటిలో కొన్ని.

అలాగని స్వలింగ సంపర్కులు.. నాకు బాగా తెలిసింది మగవాళ్ళ గురించే కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడతాను - అత్యున్నత లైంగిక నీతి గల మనుషులని నేను చెప్పను. పురుష స్వలింగ సంపర్కుల సమాజంలో కొన్ని రకాల (కండలు కలిగిన వాళ్ళు వగైరా)శరీరాకృతుల పట్ల ఇప్పటికీ చాలా ఆరాధన ఉంది. ఆ సౌందర్య కొలతలను అందుకోలేని (అటువంటి వాళ్ళే ఎక్కువ) వాళ్ళను తక్కువ స్థాయి మనుషులుగా చూస్తారు. ఈ ప్రమాణాలు 'గ్రిండర్' లాంటి యాప్స్ వచ్చాక మరింత విస్తృతంగా స్థిరపడిపోయాయి. స్వలింగ సంపర్కుల నెట్‌వర్కింగ్, డేటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ అది. అందులో పురుషులను కొన్ని శరీర అంగాలుగా ప్రదర్శించడం చూడొచ్చు. ఆ కొలతలలో లేనివారిని బ్లాక్ చేసి పడేస్తారు. ఈ యాప్స్‌లో తరచూ కనిపించే పదం 'నో ఫ్యాట్స్ అండ్ ఫెమ్స్'. అంటే, కొవ్వు గాని ఆడంగి లక్షణాలు గాని లేని శరీరాలు కావాలని. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం. స్వలింగ సంపర్కులు కూడా లైంగిక విలువల విషయంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

ఇటువంటి లోపాలు ఉన్నప్పటికీ లైంగిక నీతి గురించి గే సంస్కృతే ప్రపంచానికి కొన్ని కొత్త ఆలోచనలు కలిగించింది. పునరుత్పత్తితో, పెళ్ళితో, ప్రేమతో, దాంపత్య జీవితంతో నిమిత్తం లేని లైంగికత గురించి ఆలోచించడం నేర్పింది.

ఒక 2005 సర్వేలో స్వలింగ సంపర్కులలో 40 శాతం మంది నిర్నిబద్ధతతో కూడిన సంబంధాలకు ఆమోదం తెలిపితే పరలింగ సంపర్కులలో 5 శాతం మంది మాత్రమే ఆమోదం తెలిపారని వెల్లడయింది. భవిష్యత్తులో పైన చెప్పిన నిర్నిబద్ధ లైంగిక సంబంధాలే సాధారణ లైంగిక సంబంధాలుగా మారితే ఆ ఘనత ఆ దిశగా తొలి అడుగులు వేసిన స్వలింగ సంపర్కులకే దక్కుతుంది.

పరలింగ సంపర్కులకు ఈ విషయం మింగుడు పడకపోవచ్చు. కానీ, సెక్స్ విషయంలో వారికే ఉన్నతమైన విలువలు ఉన్నాయని నటించడం ఇకపై కష్టం. నేను ఇంతకుముందే చెప్పినట్టు 2019 సంవత్సరపు సంస్కృతి నిండా పరలింగ సంపర్కుల వివాహ వైఫల్యాలు, వివాహేతర సంబంధాలే కనిపిస్తాయి. పరలింగ సంపర్కం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని చెబుతారు. కానీ, నిజానికి అది 19వ శతాబ్దంలో సృష్టించబడ్డ 'సంప్రదాయం'. అది ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇప్పుడు గుర్తిస్తున్నాం.

Image copyright Getty Images

గత కొంతకాలంగా సెక్స్ భవిష్యత్తు ఏమిటని చాలామంది చాలా రకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ నుంచి హాప్టిక్ సాంకేతికత ద్వారా అనేక రకాల కొత్త సెక్స్ పద్ధతుల గురించి చర్చ జరుగుతోంది. ఎంతో దూరాన ఉండి కూడా లైంగిక సంతృప్తి కలిగించగల పద్ధతులు అవి. ఇవన్నీ వచ్చాక సెక్స్ మరింత డిజిటల్‌గా, కృత్రిమంగా తయారై సహజత్వం తగ్గుతుందని చెప్పే వాళ్ళున్నారు.

భవిష్యత్తులో భారీ సాంకేతిక మార్పులు వస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, వాటితో పాటు మన ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయని మనం గుర్తు పెట్టుకోవాలి.

పునరుత్పత్తి గురించి కొత్త ఆలోచనలు రాక తప్పదు. 1978 నుంచి ఇప్పటివరకు 80 లక్షల మంది పిల్లలు ఐ.వి.ఎఫ్ ద్వారా పుట్టారని ఇంతకుముందే చెప్పాను. ఆ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చే కొద్దీ, దాని ఖర్చు తగ్గే కొద్దీ ఐ.వి.ఎఫ్ పిల్లల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే గర్భనిరోధక పద్ధతులు, కుటుంబ నియంత్రణ సెక్స్‌ను, పునరుత్పత్తిని వేరు చేశాయి. పిండాన్ని గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే జన్యు విశ్లేషణ జరిపే పద్ధతి (పీజీడీ) గురించి గ్రీలీ జోస్యం నిజమైతే వచ్చే నాలుగు దశాబ్దాల లోపే ఏదో ఒక దశలో పిల్లల్ని కనడంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. జెనెటిక్స్, స్టెమ్ సెల్ పరిశోధనలు విజయవంతమైతే పీజీడీ 'సులభతరం' అవుతుంది (అంటే అందుబాటులోకి వస్తుంది). ఆ పరిశోధన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిమీద గ్రీలీ 'గార్డియన్' పత్రికలో ఏం రాశారో చదవండి.

"పిల్లలు కావాలనుకునే జంట క్లినిక్‌కి వెళ్లి- అతను కొన్ని వీర్య కణాలను, ఆమె చిన్న చర్మపు తునకను- ఇచ్చి వెళతారు. వారం పదిరోజుల తర్వాత ఆ కణాల నుంచి 100 పిండాలను సృష్టించి వాటి సమాచారాన్ని ఆస్పత్రివాళ్ళు ఆ జంటకు పంపిస్తారు. ఆ పిండాలలోని జన్యువులు వాటి నుంచి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి ఏం చెపుతున్నాయో ఆ సమాచారంలో ఉంటుంది. దాన్ని బట్టి ఏ పిండాన్ని గర్భంలోకి ప్రవేశపెట్టవచ్చో బిడ్డ తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు."

'డిజైనర్ బేబీస్' అనే ఆలోచనకే చాలామంది రగిలిపోవచ్చు కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కనాలనుకునే చాలామంది ఒకర్నొకరు ఎంపిక చేసుకోవడంలో కొన్ని లక్షణాలు చూస్తున్నారా లేదా! అవి వంశపారంపర్యంగా పిల్లలకు వస్తాయనే దృష్టి వాళ్లకు లేకుండానే ఉంటుందా! అప్పుడు అదీ ఎంపికే కదా! అలాంటపుడు వారి పద్ధతికీ, ఈ సాంకేతిక పద్దతికీ తేడా చూడడం కష్టమవుతుంది.

Image copyright Getty Images

ఒకే వ్యక్తితో జీవితాంతం కలిసి బతకడమనే ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. మనుషుల ఆయుర్దాయం తక్కువగా ఉన్న కాలంలో ఒకే వ్యక్తితో జీవితాంతం లైంగిక సహచర్యం చేయడం కొంత సులభమై ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మనుషుల ఆయుర్దాయం పెరిగింది. 1960 నుంచి 2017 మధ్య అది సగటున 20 ఏళ్ళు పెరిగింది. 2040 వచ్చేసరికి మన ఆయుర్దాయం మరో నాలుగేళ్ళు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అది చాలా తక్కువని, ఇంకా చాలా ఎక్కువ కాలమే బతుకుతారని కొందరి అంచనా. ఉదాహరణకు స్టీవన్ ఆస్టాడ్ అభిప్రాయం ప్రకారం 150 ఏళ్ళు బతకబోయే మొదటి మానవుడు లేదా మానవి 2001కి ముందే ఈ భూమి మీద పుట్టారు. ఇలాంటి పరిస్థితులలో ఒక స్త్రీ లేదా పురుషుడు 130 ఏళ్ళ పాటు ఒకే వ్యక్తిని లైంగిక సహచరి లేదా సహచరుడుగా కలిగి ఉండడం ఏ మేరకు ఆచరణసాధ్యం? మనం అంత దూరం దాకా కూడా పోనక్కరలేదు. ఇప్పటికే విడాకులు, పునర్వివాహాల సంఖ్య బాగా పెరిగింది. 2013 పీఈడబ్ల్యూ సర్వే ప్రకారం, ప్రతి పది అమెరికన్ వివాహాలకు గాను నాలుగు వివాహాలలో అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంతకుముందే వివాహం చేసుకున్నవాళ్ళు ఉన్నారు. మనిషి ఆయుర్దాయం పెరిగే కొద్దీ 'ఆజన్మాంతం కలిసి బతుకుతామని' ఇప్పటిదాకా చేసుకుంటున్న పెళ్లి ప్రమాణాలకు స్వస్తి పలకాలేమో!

లైంగిక గుర్తింపు విషయంలో కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. సెక్స్‌కు అర్ధం సెక్స్ తప్ప మరొకటి ఉండనపుడు; 'భిన్న' లైంగికత కారణంగా పిల్లలు వేధించబడనప్పుడు; పునరుత్పత్తి ల్యాబ్ లలో జరిగినప్పుడు; భవిష్యత్తు మానవులకు తమ ఇష్టానుసారం స్త్రీలు, పురుషులతో కూడా సెక్స్‌లో పాల్గొనే స్వేచ్ఛ లభిస్తుందా? అప్పుడు సొంత పద్ధతుల్లో లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి వారు ఇష్టపడతారా? లైంగిక ఇష్టాయిష్టాలు, గుర్తింపు ఇన్నాళ్ళూ పునరుత్పత్తితో ముడిపడి ఉండిందా? భవిష్యత్తులో పరలింగ, స్వలింగ లాంటి పదాలు చరిత్ర క్లాసు రూమ్‌లో మాత్రమే వినబోతామా!

ఈ ఆలోచనలు భవిష్యత్తులో మరింతగా ప్రధాన స్రవంతి ఆలోచనల్లో భాగమవడం ఖాయం. అందుకు ఎల్‌జీబీటీలకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది దశాబ్దాల నుంచి ఆధిపత్య సంస్కృతి చేత లైంగిక నీతి గురించి కొత్తగా ఆలోచింపజేసిన ఘనత వారికే దక్కుతుంది.

కొన్నేళ్ళ క్రితం తత్వవేత్త, జెండర్ సిద్ధాంతవేత్త అయిన జూడిత్ బట్లర్ ఒక సమావేశంలో "సెక్స్‌తో మనం చేయగల అద్భుతమైన పని దానిని అనుభవించి ఆనందించడమే" అన్నారు. అప్పుడు దానితో నేను ఏకీభవించలేదు కానీ ఆమె చెప్పింది నిజమని ఇప్పుడనిపిస్తోంది.

సెక్స్ ఎప్పుడూ దేనికో దాని కోసం ఉంటుంది కానీ, భవిష్యత్తులో అది ఎందుకు అనే దాని కంటే ఎవరికి అనే పద్ధతిలో ఉంటుందని నమ్ముతున్నా. అది మన కోసం, దాన్ని అనుభవించి ఆనందించే వాళ్ళ కోసం ఉంటుందని నమ్ముతున్నా. సెక్స్ అర్ధం కూడా మారిపోతుంది. అది మనుషులకు కలిగించే ఆనందంగా మాత్రమే మిగులుతుంది. భౌతిక ఆనందం, సామాజిక అనుబంధం, ప్రయోగశీలతలతో కూడుకున్న ఆనందం అది.

మళ్ళీ చెబుతున్నా భవిష్యత్తులో సెక్స్‌కు అర్ధం సెక్సే అవుతుంది, మరేమీ కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు