సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగుల మధ్యలో క్రికెట్ ఆడదామా?

  • 13 జూలై 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాల మధ్యలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది

ప్రపంచంలో చాలా చోట్ల క్రికెట్ ఆడతారు కానీ ఈ ప్రదేశం మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే.

ఇక్కడ క్రికెట్ ఆడటం చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది. బ్యాట్స్‌మన్, బౌలర్లు, స్టంప్స్ - మైదానంలో ఇలా అన్నీ ఉంటాయి.

కానీ తీక్షణంగా పరిశీలిస్తే, ఇదొక విభిన్నమైన ప్రదేశం అని అర్థమవుతుంది. ఇక్కడి ఆటగాళ్లు కేవలం బంతిపైన దృష్టిపెడితే సరిపోదు, చుట్టూ ఉన్న ఏనుగులు, సింహాలు, క్రూర మృగాలపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. వీరంతా చేస్తున్నది ఇదే.

"ఒక వేళ జంతువుల వైపుగా బంతిని కొడితే, దాన్ని అందుకునేందుకు ఆ వైపు పరిగెత్తడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే" అంటున్నారు ఒబుయా క్రికెట్ అకాడమీ కోచ్ జాషువా రజూలా.

ఐదేళ్లుగా, కెన్యాలో ఉన్న ఒల్ పెజేటా వణ్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఎన్నో బృందాలు వస్తున్నాయి. అయితే వారంతా ఇక్కడికొచ్చేది సఫారీ కోసం కాదు... క్రికెట్ ఆడటానికి.

"ఈ ఏడాది నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఆడేందుకు గతనెలలో ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు కనిపించాయి. ఆఫ్రికాలోనే అత్యంత ప్రమాదకర జంతువు అయిన అడవి దున్నల సమూహం కనిపించింది. వాటి వల్ల ఒక్కోసారి ఆట ఆలస్యమవుతుంది" అని టోర్నమెంట్ డైరెక్టర్ రాబ్ స్టీవెన్‌సన్ తెలిపారు.

కెన్యాలో క్రికెట్ పెద్దగా ఫేమస్ కాదు. అందులోనూ వన్యప్రాణి సంరక్షణా ప్రాంతంలో పోటీలను నిర్వహిస్తే చాలా మంది ఆసక్తి కూడా చూపించరు. ఇక్కడి సింహాల సమూహం లేదా ఏనుగుల గుంపుల భయం ఓ కారణమైతే, వాటి కారణంగా ఆటను మధ్యలో ఆపేయాల్సివస్తుందనేది మరో ఆలోచన. కానీ ఇక్కడకు చేరుకుని క్రికెట్ ఆడుతున్న వారిని ఈ ప్రదేశం తనకున్న ప్రత్యేకతలతో ఆకర్షిస్తుంది.

అనుకోకుండా వచ్చి, ఇక్కడి ఆటను చూసిన పర్యటకులు చాలా ఆనందిస్తుంటారు. ప్రకృతి ఒడిలో, జంతువుల మధ్యలో క్రికెట్ అంటే అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని వారంటుంటారు.

"ఎంతో అద్భుతంగా ఉంది. నేను సఫారీ కోసం వచ్చాను. నేను పుట్టింది మలావీలో. క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. కానీ నాకు జంతువులను చూడటం అంటే చాలా ఇష్టం. అలానే ఇలాంటి ప్రదేశంలో క్రికెట్‌ను చూడటం కూడా బాగుంది" అని ఓ మహిళా పర్యటకురాలు అన్నారు.

పర్యాటకులను, కొత్తవారిని ఆకర్షించడం మాత్రమే ఈ క్రికెట్ మ్యాచ్ ఉద్దేశం కాదు. ఒల్ పెజెటా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మిగిలిన ఒకేఒక్క శ్వేత ఖడ్గమృగానికి ఆవాసంగా ఉండేది. కానీ అది కూడా గతేడాది చనిపోయింది. ఖడ్గమృగాలను వేటాడి దారుణంగా చంపడాన్ని అడ్డుకోవడానికీ, అలాగే ఇక్కడి జీవజాతుల సంరక్షణ కోసం చాలా ఖర్చవుతుంది. ఈ క్రీడా పోటీల ద్వారా డబ్బును సేకరించి దానికోసం ఉపయోగించాలనేది ఈ ఆట ముఖ్యోద్దేశం.

"ఒక్కో ఖడ్గ మృగం సంరక్షణకు ఏడాదికి 800 అమెరికన్ డాలర్లు అవసరం. ఇక్కడ దాదాపు 150 ఖడ్గ మృగాలున్నాయి" అని రాబ్ స్టీవెన్‌సన్ తెలిపారు.

ఈ క్రికెట్ పోటీల ద్వారా లక్ష డాలర్ల వరకు సేకరించారు. వీటిని సేవా కార్యక్రమాలకు, ఖడ్గమృగాల సంరక్షణకూ ఉపయోగిస్తారు.

ఈ ఏడాది టోర్నమెంట్‌లో నైరోబీకి చెందిన కాన్బిస్ స్పోర్ట్స్ క్లబ్ విజేతగా నిలిచింది. అయితే అసలైన విజేతలు మాత్రం ఈ ప్రాంతంలో నివసించే వన్యప్రాణులు. ఇక్కడ జరిగే క్రీడలతో వాటికి సంబంధం లేకపోవచ్చు కానీ ఈ పోటీల వల్ల కలిగే ప్రయోజనం వాటికే దక్కుతుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)