సోమాలియాలో మానవబాంబు దాడి... 26 మంది మృతి

  • 13 జూలై 2019
Image copyright AFP

సోమాలియాలోని ఓ హోటల్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ జర్నలిస్ట్ సహా పలువురు విదేశీయులు ఉన్నారు.

దక్షిణ సోమాలియాలో కిస్మాయో రేవుపట్టణంలోని అసాసీ హోటల్‌లోకి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సూసైడ్ బాంబర్ దూసుకొచ్చాడు. అనంతరం సాయుధులు చొరబడి కాల్పులు జరిపారు.

మృతుల్లో పాత్రికేయుడు హోదాన్ నలేయా, ఆమె భర్త ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుడు, ముగ్గురు కెన్యా పౌరులు, ముగ్గురు టాంజేనియావాసులు, ఇద్దరు అమెరికన్లు, ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.

ఇస్లామిస్ట్ గ్రూప్ అల్ షబాబ్ ఈ దాడి తమ పనేనని ప్రకటించుకుంది.

దాడి ఎలా జరిగింది...

త్వరలో జరగబోయో స్థానిక ఎన్నికల గురించి చర్చించడానికి ప్రాంతీయ నాయకులు, సంఘ ప్రముఖులు హోట‌ల్లో సమావేశమైన సందర్భంలో ఈ దాడి జరిగింది.

తొలుత భారీ పేలుడు శబ్దం వినిపించిందని.. అనంతరం సాయుధులు కొందరు లోనికి దూసుకొచ్చి కాల్పులు ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

'లోపలంతా గందరగోళంగా మారింది. ఘటనాస్థలం నుంచి కొన్ని మృతదేహాలను తీసుకెళ్లారు. పేలుడు తరువాత చుట్టుపక్కల భవనాల్లోని వారు కూడా భయంతో బయటకు పరుగులు తీశార'ని హుసేన్ ముక్తార్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

దాడి జరిగిన తరువాత హోటల్‌ను అదుపులోకి తీసుకోవడానికి అధికారులకు కొన్ని గంటల సమయం పట్టింది.

మృతులు ఎవరు...

ఈ బాంబు దాడిలో జర్నలిస్ట్ నలాయె(43), ఆమె భర్త ఫరీద్ చనిపోయారు. నలాయే ఓ చానల్‌లో పనిచేస్తున్నారు. ఆమెకు ఆరేళ్లున్నప్పుడు ఆ కుటుంబం కెనడా వెళ్లిపోగా కొన్నేళ్ల కిందట ఆమె మళ్లీ సోమాలియా వచ్చి అక్కడి ప్రజల జీవితాలపై మీడియాలో కథనాలు వెలువరిస్తున్నారు. ‘ఆమె ఎంతోమందికి గొంతుక’ని కెనడా ఇమిగ్రేషన్ మినిష్టర్ హుసేన్ అహ్మద్ అన్నారు. నలాయే అక్కడి ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించారని, ఎంతో మంచి మనిషని బీబీసీ జర్నలిస్ట్ ఫరాన్ జిమాలే చెప్పారు.

సోమాలియాలో తరచూ తీవ్రవాద దాడులు జరుగుతున్నాయి. అయితే, 2012లో అల్ షబాబ్‌ను కిస్మాయోలో ఉనికిలో లేకుండా చేసిన తరువాత ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. మొగాదిషులో తీవ్రవాదులు తరచూ దాడులు చేస్తున్నా కిస్మాయోలో ఇటీవల కాలంలో దాడులు లేవు.

అల్ ఖైదా అనుబంధ సంస్థయిన అల్ షబాబ్ సోమాలియా గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు