ENG Vs NZ: ఇంగ్లండ్‌ను ఓడించాలంటే న్యూజీలాండ్ ఎలా ఆడాలి?

  • 14 జూలై 2019
కేన్ విలియమ్సన్, ఇయాన్ మోర్గాన్ Image copyright Getty Images

క్రికెట్ అంచనాలకు అందే ఆట కాదు!

15 పాయింట్లతో లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన భారత్, సెమీఫైనల్లో '45 నిమిషాల పేలవ ప్రదర్శన'తో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

లీగ్ దశ చివర్లో పుంజుకున్నప్పటికీ పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకోలేకపోయింది. న్యూజీలాండ్ మాదిరే 11 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్‌లో వెనకబాటు కారణంగా పాకిస్తాన్ లీగ్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది.

పది రోజుల కిందట లీగ్ దశలోనే నిష్క్రమిస్తుందేమోననే స్థితిలో ఇంగ్లండ్ కనిపించింది. కానీ అదే జట్టు ఈ రోజు (జులై 14) టైటిల్ ఫేవరెట్‌గా లండన్‌లో లార్డ్స్‌ వేదికగా జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతోంది.

ఇంగ్లండ్ లాంటి పరిస్థితిలోనే ఉండి తర్వాత సెమీస్ చేరుకున్న న్యూజీలాండ్ కూడా ఇప్పుడు టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉంది.

ఇంగ్లండ్‌తో తుది సమరం తేలిగ్గా ఉండదనే విషయం కివీస్‌కు తెలుసు.

మరి గెలవాలంటే న్యూజీలాండ్ ఏం చేయాలి?

తిరుగులేని ఓపెనింగ్ భాగస్వామ్యం లభించిన జట్టు విజయావకాశాలు అత్యధికమని ఈ టోర్నీలో చాలాసార్లు రుజువైంది. అంటే ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో కొత్త బంతిని ఎదుర్కోవడం బ్యాట్స్‌మన్‌కు సవాలుతో కూడుకొన్నది. ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో. ఇది ఇంగ్లండ్ క్రికెటర్లు వోక్స్, ఆర్చర్, స్టోక్స్‌లకు సుపరిచిత మైదానం. అందువల్ల ఫైనల్లో కివీస్ ఓపెనర్లు పెద్ద సవాలునే అధిగమించాల్సి ఉంటుంది.

Image copyright Getty Images

న్యూజీలాండ్ ఓపెనర్లలో ఒకరైన మార్టిన్ గప్తిల్ టోర్నీ మొత్తం ఫామ్‌లో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. ఆదివారం ఫైనల్లో కివీస్‌కు తొలి సవాలు ఎదురయ్యేది ఈ విషయంలోనే.

టోర్నీలో తొమ్మిది ఇన్సింగ్స్‌లకుగాను గప్తిల్ కేవలం 167 పరుగులే చేశాడు. కేవలం ఒకే ఒక్క అర్ధ సెంచరీ చేశాడు. జులై 9న భారత్‌తో సెమీఫైనల్లో కీలక దశలో మహేంద్ర సింగ్ ధోనీని రనౌట్ చేసిన తీరుకు గప్తిల్‌పై ప్రశంసల వర్షం కురిసింది. (ఈ రనౌట్‌తో కలిపి 297 వన్డే ఇన్సింగ్స్‌లలో ధోనీ 16 సార్లే రనౌట్ అయ్యాడు.)

తన ఫామ్ పేలవంగా ఉందనే విషయాన్ని గప్తిలే అంగీకరించాడు. "నెట్ ప్రాక్టీస్‌లో ఎప్పట్లాగే హార్డ్ వర్క్ చేస్తున్నా. ఈ మ్యాచ్‌లో నా ప్రయత్నాలన్నీ ఫలిస్తాయనే నమ్మకం ఉంది" అని అతడు వ్యాఖ్యానించాడు.

భారత్‌తో సెమీఫైనల్లో గప్తిల్ ఓపెనింగ్ భాగస్వామి నికోల్స్ ఫామ్ కూడా కివీస్ బృందానికి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆడిన గత మూడు మ్యాచుల్లో అతడి సగటు 12 పరుగులే. ప్రపంచ కప్ ఫైనల్లో ప్రయోగాలకు దిగడం అంత తెలివైన పనికాదు. అందువల్ల ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడానికి కివీస్ బృందానికి పెద్దగా అవకాశాలు కూడా లేకుండా పోయాయి. మొదటే బ్యాటింగ్‌కు దిగినా, లక్ష్యఛేదన చేయాల్సి వచ్చినా తమ ఓపెనర్లు రాణించాలనేది కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోరిక.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచ కప్‌లో విలియమ్సన్ ఇప్పటివరకు 548 పరుగులు చేశాడు.

టోర్నీలో విలియమ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు కీలకమైన సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు కొట్టిన అతడి సగటు 90కి పైగా ఉంది. కివీస్ జట్టులో ఇంగ్లండ్ బౌలర్లు అమూల్యమైనదిగా భావించే వికెట్ విలియమ్సన్‌దే.

ప్రారంభంలోనే వికెట్ కోల్పోతే, వచ్చి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు విలియమ్సన్ మానసికంగా సిద్ధంగా ఉండాలి. సెమీఫైనల్లో, అంతకుముందు మ్యాచుల్లో అతడు ఇదే పని చేశాడు.

స్టోక్స్, లియామ్ ప్లంకెట్ లాంటి ఇంగ్లండ్ బౌలర్లను విలియమ్సన్ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉంది. అదే సమయంలో, అబ్దుల్ రషీద్ గూగ్లీలను ఎదుర్కొనేందుకు ఆచితూచి ఆడొచ్చు.

సెమీస్‌లో భారత్‌పై 72 విలువైన పరుగులు చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ తిరిగి 'టచ్‌'లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అబ్దుల్ రషీద్‌ను భారీ షాట్లు ఆడగలిగే సామర్థ్యమున్న రాస్ టేలర్ లక్ష్యంగా చేసుకొనే అవకాశముంది.

Image copyright Twitter/cricketworldcup

నంబర్ 5, నంబర్ 6 స్థానాల్లో ఆడే జిమ్మీ నీషామ్, గ్రాండ్‌హోమ్‌ టోర్నీలో ఇప్పటివరకు చేసిన పరుగులు కలిపి చూస్తే దాదాపు 400 వరకు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో వీళ్లు దన్నుగా నిలుస్తున్నారు.

టోర్నీలో అసాధారణ ఫీల్డింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి కివీస్ ఆశ్చర్యపరిచింది.

ట్రెంట్ బౌల్ట్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఫెర్గూసన్, హెన్రీ (సెమీస్‌లో భారత్ టాప్‌ఆర్డర్‌ను కూల్చింది ఇతడే) బౌల్ట్‌కు అండగా నిలుస్తున్నారు.

టోర్నీలో ఈ ముగ్గురూ కలిసి 48 వికెట్లు పడగొట్టారు. వీళ్లు మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోలే ప్రధాన లక్ష్యంగా ఫైనల్లో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్ ఓపెనర్లు జట్టుకు నిర్ణయాత్మక ఓపెనింగ్ భాగస్వామ్యాలను అందిస్తూ వస్తున్నారు. గత పది మ్యాచుల్లో వీరిద్దరు చేసిన పరుగులను కలిపి చూస్తే 950 పైనే ఉన్నాయి.

ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్‌లో రూట్, ఇయాన్ మోర్గాన్, స్టోక్స్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. జోస్ బట్లర్ ఒక్కడే మొదట్లో మాదిరి ఇప్పుడు ఆడలేకపోతున్నాడు.

Image copyright TWITTER/CRICKETWORLDCUP
చిత్రం శీర్షిక టోర్నీలో అసాధారణ ఫీల్డింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి కివీస్ ఆశ్చర్యపరిచింది.

టోర్నీ ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో ఆడి, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కీలకమైన సెంచరీ సాధించిన బట్లర్ గత ఐదు ఇన్సింగ్స్‌లలో పరుగుల కోసం ఆపసోపాలు పడుతున్నాడు. వీటిలో కేవలం 68 పరుగులే చేయగలిగాడు.

జిమ్మీ నీషామ్ కివీస్ బౌలింగ్‌కు అదనపు బలం చేకూరుస్తున్నాడు. అతడు సాంట్నర్‌తో కలిసి ఇంగ్లండ్ రన్‌రేట్ పెరగకుండా నియంత్రించాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టోర్నీ ఆసాంతం బౌన్సర్లతో ఇబ్బంది పడుతున్నాడు. కివీస్ బౌలర్లు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

సెమీఫైనల్లో ఓటమి తర్వాత కివీస్ బౌలర్ల గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ- "పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉండి, వాళ్ల బ్యాట్స్‌మన్ తగినన్ని పరుగులు చేస్తే, ఈ మ్యాచ్‌లో మాదిరే వీళ్లు ప్రమాదకరంగా మారతారు" అని వ్యాఖ్యానించడం గమనించాల్సి ఉంది.

లార్డ్స్‌లో టాస్ కీలకం కానుంది.

లీగ్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ను 119 పరుగుల ఆధిక్యంతో ఓడించిన ఇంగ్లండ్‌కు మానసికంగా పైచేయి ఉంటుంది. అదే సమయంలో, గతంలో లార్డ్స్‌లో ఆడిన మొత్తం వన్డే మ్యాచుల్లో సగం కన్నా తక్కువ మ్యాచుల్లోనే తాను గెలిచిన విషయాన్ని ఇంగ్లండ్ గుర్తుచేసుకొంటూ ఉండొచ్చు.

ఈ టోర్నీలో ఈ మైదానంలో ఇంగ్లండ్, న్యూజీలాండ్ రెండూ తమ లీగ్ మ్యాచుల్లో ఓడిపోయాయి. ఆస్ట్రేలియానే రెండింటినీ ఓడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం