భారత్‌లో క్రికెట్ బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?

  • 15 జూలై 2019
బుక్కీలదే రాజ్యం అవుతుందా? Image copyright Getty Images

రెండో పరుగు తీస్తున్న మహేంద్రసింగ్ ధోనీ క్రీజుకు కొన్ని సెంటీమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. వేగంగా వచ్చిన ఒక డైరెక్ట్ హిట్ వికెట్లపై బెయిల్స్ గాల్లోకి ఎగిరేలా చేసింది.

ఆ ఒక్క బంతి ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న భారత్ ఆశలపై నీళ్లు చల్లింది.

మాజీ కెప్టెన్ ధోనీ వికెట్ భారత్‌లో అందరినీ విషాదంలో పడేస్తే, ఒకరిని మాత్రం పారవశ్యంలో ముంచెత్తింది.

అతడి పేరు ఆర్యన్, తన అసలు పేరు బయటపెట్టద్దని కోరిన అతడు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ఒక రాష్ట్రంలో ఒక క్రికెట్ బెట్టింగ్ బుకీ.

అతడితో పందాలు వేసే వాళ్లలో ఎక్కువమంది స్థానిక వ్యాపారులే. ఓల్డ్ ట్రఫర్డ్‌లో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ న్యూజీలాండ్‌ను ఓడిస్తుందని వారంతా చాలా భారీ పందాలు కట్టారు.

కానీ, వారి దురదృష్టం ఆర్యన్‌కు 5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది.

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసుల దాడుల తర్వాత బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పిన మరో ఇద్దరు దానికి నిరాకరించారు.

కానీ ఆర్యన్ మాత్రం ఇంటర్నెట్ కాల్‌ మాట్లాడేందుకు అంగీకరించాడు. కొన్ని క్షణాల ముందు ఏర్పాటు చేసుకున్న గుర్తుతెలియని ఖాతా నుంచి మాతో మాట్లాడాడు.

Image copyright Getty Images

అతడి జాగ్రత్తలు మాకు ఆశ్చర్యం కరిగించలేదు. ఎందుకంటే భారత్‌లో పాపులర్ అయిన క్రికెట్, దానిపై పందాలు కాసేలా చేసింది.

బెట్టింగ్‌తో చివరికి ఆర్యన్ లాంటి వాళ్లను తయారు చేశాయి. అందుకే పదేళ్ల నుంచీ ఈ వ్యాపారం చేస్తున్న అతడు 20 ఏళ్లకే నేరస్థుడయ్యాడు.

అయినా అతడిది నేరం చేశానని భయపడి పారిపోయే మనస్తత్వం కాదు.

భారతదేశంలో క్రికెట్ చాలామందికి ఇష్టమైన క్రీడ. అందుకే క్రికెట్ ప్రపంచకప్ వచ్చిదంటే బుకీలకు పండగే అంటాడు ఆర్యన్. ఇప్పుడప్పుడే ఆ సంబరానికి తెరపడుతుందని తనకు అనిపించడం లేదని చెబుతాడు.

"నాక్కూడా కొన్నిసార్లు భయమేస్తుంది. పట్టుబడతానేమో అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుందో జరగనీ అనే ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది" అన్నాడు.

"మాకు కొన్నిరోజుల్లోనే బెయిల్ వచ్చేస్తుంది. గత ఐపీఎల్‌ సమయంలో మా స్నేహితులు కొందరు దొరికిపోయారు. వాళ్లు 10-15 రోజుల్లోనే బెయిల్‌తో బయటికొచ్చారు. డబుల్ ఎనర్జీతో మళ్లీ ఇదే వ్యాపారం చేశారు" అని ఆర్యన్ చెప్పాడు.

క్లోజ్ నెట్ వర్క్

ఆర్యన్ చెబుతున్న విషయాల గురించి భారత న్యాయ మంత్రిత్వ శాఖ, ముంబై పోలీసులు స్పందన కోరినపుడు వారు మాట్లాడ్డానికి నిరాకరించారు.

బెట్టింగ్ పరిశ్రమను బలపరిచే అనధికారిక వ్యవస్థ అతడి అతి విశ్వాసానికి మద్దతుగా నిలుస్తోంది.

బయటివాళ్లను పందాలకు ఎలా అనుమతిస్తావ్ అని అడిగితే, నేను రెఫరెన్స్ లేకుండా క్లైంట్లను కలవను అని అతడు చెప్పాడు.

చిత్రం శీర్షిక భారత్‌లో బుకీలు మొబైల్ యాప్స్ ద్వారానే పందాలు స్వీకరిస్తారు

"ఈ బిజినెస్ మాకు మార్కెట్లో ఉండే గుడ్‌విల్‌ను బట్టి ఉంటుంది. మేం ఒక వ్యక్తితో కనెక్ట్ అయినప్పుడు, అతడితో మా లావాదేవీలు బాగుంటే, అతడే మరికొందరిని మాకు రెఫర్ చేస్తాడు. అలా మెల్లమెల్లగా మా నెట్‌వర్క్ పెరుగుతూ పోతుంది. మొదట ఐదుగురు, తర్వాత పది, ఆ తర్వాత 15 మంది అలా మేం ఒక చెయిన్ ఏర్పాటు చేసుకుంటాం" అని ఆర్యన్ తెలిపాడు.

మొబైల్ యాప్స్‌లో ఉండే సంక్లిష్ట పాయింట్ వ్యవస్థ, క్రమం తప్పకుండా మళ్లించే వెబ్‌సైట్స్ ద్వారా ఆర్యన్ ఈ మధ్య ఎక్కువగా ఆన్‌లైన్లో పనిచేస్తున్నాడు.

డిజిటల్‌గా వెళ్లడం వల్ల సగటు పందెం పరిమాణం తగ్గిపోయింది. వ్యక్తిగత లావాదేవీలు జరిగే రోజుల్లో పంటర్లు ఒక్కొక్కరు కోటీ 30 లక్షల వరకూ పెట్టేవాళ్లు. అయినా, వ్యాపారం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.

ఇండియాలో చాటుమాటుగా జరిగే బెట్టింగ్ మార్కెట్ పరిధి 45 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని ఒక అంచనా.

తాజా రిపోర్టుల ప్రకారం టీమిండియా ఆడే ప్రతి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌పై 190 మిలియన్ డాలర్లకు పైగా పందాలు పెడుతుంటారని తెలుస్తోంది.

Image copyright Getty Images

ఊరించే బహుమతులు

అంకెల సంగతి ఎలాఉన్నా, భారతదేశంలోని క్రికెట్ బెట్టింగ్ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతారు. చట్టబద్ధంగా బెట్టింగ్ జరిగే, బ్రిటన్ లాంటి దేశాల కంటే ఇది కచ్చితంగా ఎక్కువే ఉంటుందంటున్నారు.

బుకీల్లో తక్కువ శాతం మందికి మాత్రమే అవినీతిలో ప్రమేయం ఉన్నప్పటికీ, భారీగా, పన్నుల్లేని బహమతులు కొందరిని దీనివైపు ఊరిస్తున్నాయని చెబుతున్నారు.

ఆటకు దగ్గరగా ఉండే ప్రొఫెషనల్ క్రికెటర్స్, ఇంకెవరైనా మీ దగ్గర పందాలు కాశారా అని అడిగితే, ఆర్యన్ ఏం మాట్లాడలేదు. కానీ "స్పాట్ ఫిక్సింగ్‌తో ఐపీఎల్‌కు సమస్యలు రావడంతో ఆటలోని చిన్న చిన్న అంశాలను ఉద్దేశపూర్వకంగా సర్దుబాటు చేశారు" అన్నారు.

2013లో ప్రాక్టీస్ సమయంలో అక్కడ ఉన్న ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. మరో కేసులో ముంబై పోలీసులు బుకీలతో లింకులున్న బీసీసీఐ ఉద్యోగి బంధువును ఒకరిని అరెస్ట్ చేశారు.

తర్వాత న్యాయమూర్తులతో కూడిన కమిటీలు ఐపీఎల్‌ మ్యాచ్ ఫిక్సింగ్, అక్రమ బెట్టింగ్‌లో చాలా మంది దోషులని గుర్తించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు కమిటీ

బెట్టింగును నేరంగా భావించకుండా చేయడానికి సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని 2016లో సుప్రీంకోర్టు లా కమిషన్‌ను కోరింది.

దీనిని చట్టబద్ధమైన పరిశ్రమగా నియంత్రించడం వల్ల నల్లధనం ముప్పును సమర్థంగా అరికట్టవచ్చని గత ఏడాది చెప్పింది.

లైసెన్స్‌డ్ ఆపరేటర్లతో ఒక నెట్‌వర్క్ ఉండాలని, ఇప్పటికే ఉన్న ఐడీలను ఉపయోగించి జూదగాళ్లకు రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.

బెట్టింగుకు చట్టబద్ధత ఇవ్వడం వల్ల ఉపాధిని కల్పించవచ్చని, సమాజంలోని బలహీన వర్గాలను కాపాడవచ్చని, ప్రస్తుతం బుకీలను వెంటాడేందుకు విలువైన వనరులను వెచ్చిస్తున్న అధికారులకు ఉపశమనం లభిస్తుందని వాదించింది.

పన్నుల ద్వారా ఆదాయం

బెట్టింగును చట్టబద్ధత చేయడం వల్ల అంతా బహిరంగంగా ఉంటుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులు సిద్దార్థ ఉపాధ్యాయ చెప్పారు.

"బెట్టింగులో ఎవరు పాల్గొంటున్నారు, ఎవరు లేదు అనేది అందరికీ తెలుస్తుంది. అది నేర కార్యకలాపాలను చాలావరకూ తగ్గించడానికి సాయపడుతుంది" అని ఆయన అన్నారు.

"ప్రభుత్వానికి చాలా బలమైన పన్ను వ్యవస్థ, అది అమలు చేయడానికి బలమైన నియంత్రణ వ్యవస్థ ఉన్నాయని నాకు తెలుసు. ఇప్పటి సాంకేతిక పురోగతితో పోలిస్తే, అది ఒక పెద్ద సమస్య కాకూడదు" అన్నారు.

బెట్టింగుకు చట్టబద్ధత కల్పించడం వల్ల పన్నుల ద్వారా ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తుందని ఉపాధ్యాయ చెప్పారు.

Image copyright Getty Images

ఈ ప్రపంచకప్‌లో ఫైనల్ ముందువరకూ 60 వేల కోట్ల బెట్టింగ్ జరిగిందని ఆయన అన్నారు .

"బెట్టింగ్‌పై పన్నుల వల్ల వచ్చే నిధులతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగించవచ్చు. జాతీయ క్రీడలకు ప్రయోజనం లభించేలా చూడచ్చు" అని ఉపాధ్యాయ చెప్పారు.

బెట్టింగ్‌కు బానిసలైన జూదగాళ్లను రక్షించడానికి బెట్టింగ్ మొత్తంపై ఒక పరిమితి కూడా విధించాలని ఆయన అన్నారు.

దీనిని నేరంగా భావించకపోవడం వల్ల ఫిక్కీ ప్రకారం బెట్టింగులు పెట్టే క్రీడలను ఎంచుకోవడం వల్ల దేశంలో తక్కువ పాపులారిటీ ఉన్న మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించవచ్చు.

Image copyright Getty Images

పురాతన జూదం

క్రీడా బెట్టింగులకు చట్టబద్ధత అనే అంశం రాజకీయ అడ్డంకులను అధిగమించినా, దానికి సాంస్కృతిక అవరోధాలు మాత్రం అలాగే ఉంటాయి.

జూదం గురించి శతాబ్దాల పురాతన భారత గ్రంథాలలో కొన్ని అంశాలు కనిపిస్తాయి. మహాభారతంలో ధర్మరాజు జూదంలో ఓడి తన రాజ్యాన్ని, సోదరులను, భార్యను కోల్పోతాడు.

సిక్కిజంలో పొగతాగడం నిషేధించినా, దాదాపు అన్నిమతాలూ మద్యం తాగడాన్ని వ్యతిరేకిస్తున్నా దేశంలోని చాలా రాష్ట్రాల్లో సిగరెట్లు, మద్యం అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యాయ చెబుతారు.

"భార్య కోసం, చిన్న కూతురు కోసం ఏదో ఒక రోజు తను సరైన దారిలో నడుస్తానని, స్థానికంగా ఒక మంచి సెంటర్లో బెట్టింగ్ దుకాణం తెరుస్తానని కూడా ఆర్యన్ ఆశిస్తున్నాడు.

"భారతదేశంలో దీన్ని చట్టబద్ధం చేసినా, నా క్లైంట్స్ కొందరు షాపు దగ్గరికొచ్చి పన్నులు ఎగ్గొట్టేందుకు బెట్టింగ్ చట్టవిరుద్ధంగానే చేద్దాం అని అడుగుతారు. వాళ్లు నగదు లావాదేవీలకే ఇష్టపడతారు. నేను కూడా వాళ్లకు వద్దని చెప్పలేను"

అక్రమ బెట్టింగులకు మీరు ఒప్పుకుంటారా అని ఆర్యన్‌ను అడిగితే..."ఆ ఒప్పుకుంటా, డబ్బంటే ఎవరికి చేదు. కానీ నేను చట్టబద్ధమైన బెట్టింగ్ మీదే ఎక్కువ దృష్టి పెడతాను" అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు