అంతరిక్ష దళం ఏర్పాటు చేస్తాం.. ఉపగ్రహాలను కాపాడుకుంటాం: ఫ్రాన్స్

  • 15 జూలై 2019
అంతరిక్ష పరిశోధన Image copyright AFP/Getty Images

ఫ్రాన్స్ సెప్టెంబరులో అంతరిక్ష రక్షణ దళం (స్పేస్ డిఫెన్స్ కమాండ్) ఏర్పాటు చేయనుంది.

దేశ ఉపగ్రహాలను మరింత బాగా కాపాడుకోవడానికి ఈ దళం ఉపయోగపడుతుందని అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. ఉపగ్రహాల పరిరక్షణకు ఈ దళం క్రియాశీలంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించుకోవడం కూడా దీని ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటని మేక్రాన్ చెప్పారు.

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాలకు (జులై 14) ఒక్క రోజు ముందు శనివారం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్

అంతరిక్ష దళం ఏర్పాటును ఫ్రాన్స్ రక్షణాత్మక ధోరణి నుంచి దూకుడుతనంతో కూడిన ధోరణి వైపు మరలడంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా, చైనా, రష్యా కూడా ఇలాంటి దళం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాయి.

2010లో ఏర్పాటు చేసిన సంయుక్త అంతరిక్ష దళం స్థానంలో ఈ అంతరిక్ష దళం ఏర్పాటవుతుందని ఫ్రాన్స్ సైనిక ఉన్నతాధికారులతో మేక్రాన్ చెప్పారు.

అంతరిక్ష దళం వైమానిక దళంలో భాగంగా ఏర్పాటవుతుందని, వైమానిక దళం పేరును 'వైమానిక, అంతరిక్ష దళం'గా మారుస్తామని ఆయన వివరించారు.

ఫ్రెంచ్ గయానాలోని కౌరూలో ఉన్న ఐరోపా అంతరిక్ష సంస్థ, అంతరిక్ష కార్యక్రమాల్లో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషించేందుకు తోడ్పడుతోంది.

చిత్రం శీర్షిక అమెరికా సైన్యంలో ఆరో విభాగంగా అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అమెరికా సైన్యంలో ఆరో విభాగంగా అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం జూన్‌లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్పేస్ ఫోర్స్ ఏర్పాటుతో దేశ భద్రత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.

''అంతరిక్షంలో అమెరికా ఉనికి ఉంటే సరిపోదు. అక్కడ అమెరికా ఆధిపత్యం కూడా ఉండాలి'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అంతరిక్షంలో చైనానో, రష్యానో నాయకత్వం వహించడం తమకు ఆమోదనీయం కాదని ట్రంప్ తెలిపారు.


చంద్రయాన్ 2 ఛేదించే రహస్యాలేంటి?


ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)