బెన్ స్టోక్స్: ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ‘న్యూజీలాండర్’.. జట్టు కెప్టెన్ మోర్గాన్, జోఫ్రా ఆర్చర్, జేసన్ రాయ్‌లదీ వలసే

  • 15 జూలై 2019
బెన్ స్టోక్స్ Image copyright Getty Images

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఎట్టకేలకు ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన కలను నెరవేర్చకుంది. అయితే, ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్రపోషించింది వలస వచ్చిన ఆటగాళ్లే కావడం గమనార్హం.

ఫైనల్ పోరులో తన అసాధారణ పోరాటపటిమతో న్యూజీల్యాండ్ విజయానికి అడ్డుకట్టవేసిన బెన్ స్టోక్స్‌ వాస్తవానికి పుట్టుకతో న్యూజీల్యాండర్. అక్కడే క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన ఈ ఆల్ రౌండర్ 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వచ్చాడు.

స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ ఒకప్పుడు న్యూజీల్యాండ్ రగ్బీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఒక రగ్బీ జట్టుకు కోచ్‌గా పనిచేసేందుకు కుటుంబంతో సహా వలసవచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌లోనే క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు.

2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టోక్స్ రైట్ హ్యాండ్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో కూడా 66.2 సగటుతో 465 పరుగులు చేసిన స్టోక్స్ 7 వికెట్లు కూడా పడగొట్టి తన జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

Image copyright Getty Images

ఐర్లాండ్ నుంచి వచ్చిన కెప్టెన్

ఇంగ్లండ్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన సారథిగా చరిత్రలో నిలిచిన ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ది కూడా ఇంగ్లండ్ కాదు.

ఒక ఆటగాడు రెండు దేశాల తరఫున ఆడటం చాలా అరుదు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన ఆటగాడు కూడా ఇయాన్ మోర్గాన్.

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్ ఆ దేశ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. అయితే, మరింత మెరుగైన కెరీర్ కోసం ఇంగ్లండ్‌కు తరలివచ్చాడు.

2009లో జరిగిన ట్వంటీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.

2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు చెత్త ప్రదర్శన చేసినప్పుడు కూడా మోర్గానే కెప్టెన్.

Image copyright Getty Images

కరేబియన్ దీవుల నుంచి దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్లో న్యూజీల్యాండ్‌ను కట్టడి చేసిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ పుట్టింది ఇంగ్లండ్‌లో కాదు.

కరేబియన్ దీవుల నుంచి అతను వలస వచ్చాడు. వెస్టండీస్ అండర్ 19 క్రికెట్ జట్టులోనూ ఆడాడు.

బార్డోడస్‌లో పుట్టిన ఆర్చర్ తండ్రి ఇంగ్లండ్ వాసి. 2019లో ససెక్స్ కౌంటీ క్రికెట్ తరఫున ఇంగ్లండ్‌లో ఆడటం మొదలు పెట్టిన ఆర్చర్ అతి త్వరలోనే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

ఇంగ్లండ్ క్రికెట్ నిబంధనల మూలంగా మొదట్లో 2022 వరకు ఆ దేశ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఆర్చర్‌కు రాకుండా పోయింది. అయితే, ఈసీబీ తన నిబంధనలను మార్చుకోవడంతో జాతీయ జట్టులోకి వచ్చాడు.

గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరే ఆర్చర్ ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడు. అతని బౌలింగ్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఆమ్లా తీవ్రంగా గాయపడి మధ్యలోనే క్రీజు వదలగా, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కేరీ ముఖం చిట్లిపోయింది.

Image copyright Getty Images

జేసన్ రాయ్... దక్షిణాఫ్రికా

ఈ వరల్డ్ కప్‌లో ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇంగ్లండ్ విజయలో కీలకంగా మారిన మరో ఆటగాడు జేసన్ రాయిది కూడా ఇంగ్లండ్ కాదు. 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అతను వలసవచ్చాడు.

సిరిస్ మొత్తంలో అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో రాణించిన జేసన్ రాయ్ ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో 443 పరగులు చేశాడు. మొదట దేశవాళీ క్రికెట్‌లో సర్రే తరఫున ఆడిన రాయ్ ఇండియాతో ఆడిన ట్వంటీ20తోనే జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు.

ట్వంటీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించాడని ఔట్ అయిన తొలిబ్యాట్స్‌మెన్‌గా కూడా జేసన్ రాయి చరిత్రకెక్కాడు.

స్నిన్నర్లు అదిల్ రషీద్, మొయిన్ అలీలు పాకిస్తాన్ మూలాలున్న క్రికెటర్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)