ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టు ఇదే, టీమిండియా నుంచి ఇద్దరికి చోటు

  • 15 జూలై 2019
రోహిత్ శర్మ Image copyright Reuters

ఐసీసీ ప్రపంచ కప్ 2019 పురుషుల డ్రీమ్ టీమ్‌ను ప్రకటించారు. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఆడిన ఆరుగురు ఆటగాళ్లకు ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టులో చోటు లభించింది.

మొట్టమొదటిసారి ప్రపంచ విజేతలుగా ఆవిర్భవించిన ఇంగ్లండ్ నుంచి ఎక్కువగా నలుగురికి ఇందులో ప్రాతినిధ్యం లభించగా, రన్నరప్‌గా నిలిచిన న్యూజీలాండ్ జట్టులో ఇద్దరికి ఈ డ్రీమ్ టీమ్‌లో స్థానం లభించింది.

Image copyright Getty Images

ప్రపంచకప్ 2019 టోర్నీలో అద్భుత ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లను గౌరవిస్తూ ఐసీసీ ప్యానల్ ఈ జట్టును ఎంపిక చేసింది.

జట్టులోని మిగతా ఆటగాళ్లలో సెమీఫైనల్లో ఓడిపోయిన టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇద్దరిద్దరు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆటగాడు షాకిబ్ అల్ హసన్‌కు కూడా జట్టులో స్థానం ఇచ్చారు.

ఈ జట్టును ఎంపిక చేసిన కమిటీలో మాజీ ఆటగాళ్లు, కామెంటరేటర్లు అయిన ఇయాన్ బిషప్, ఇయాన్ స్మిత్, ఇసా గుహ, క్రికెట్ రచయిత లారెన్స్ బూత్, ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ ఆలర్డైస్ ఉన్నారు.

Image copyright TWITTER/CRICKETWORLDCUP

ఐసీసీ ప్రపంచకప్ 2019 పురుషుల జట్టు (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం)

బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం ఆటగాడి పేరు దేశం ప్రపంచకప్‌లో ప్రదర్శన
1 జేసన్ రాయ్ ఇంగ్లండ్ 63.28 సగటుతో 443 పరుగులు
2 రోహిత్ శర్మ భారత్ 81.00 సగటుతో 648 పరుగులు
3 కేన్ విలియమ్సన్ (కెప్టెన్) న్యూజీలాండ్ 82.57 సగటుతో 578 పరుగులు
4 జో రూట్ ఇంగ్లండ్ 61.67 సగటుతో 556 పరుగులు
5 షాకిబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ 86.57 సగటుతో 606 పరుగులు, 36.27 సగటుతో 11 వికెట్లు
6 బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ 66.42 సగటుతో 465 పరుగులు, 35.14 సగటుతో 7 వికెట్లు
7 అలెక్స్ కేరీ (వికెట్ కీపర్) ఆస్ట్రేలియా 62.50 సగటుతో 375 పరుగులు, 20 డిస్మిసల్స్
8 మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా 18.59 సగటుతో 27 వికెట్లు
9 జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ 23.05 సగటుతో 20 వికెట్లు
10 లోకీ ఫెర్గూసన్ న్యూజీలాండ్ 19.47 సగటుతో 21 వికెట్లు
11 జస్‌ప్రీత్ బుమ్రా భారత్ 20.61 సగటుతో 18 వికెట్లు

ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్ రాయ్‌కు టాపార్డర్‌లో చోటు లభించింది.

ఏడు ఇన్నింగ్సుల్లో జేసన్ 5 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. వీటిలో బంగ్లాదేశ్‌పై ఓ భారీ సెంచరీ కూడా ఉంది.

సూపర్ ఓవర్‌లో అతడు విసిరిన త్రో వల్లే న్యూజీలాండ్ ఆటగాడు గఫ్తిల్ రనౌట్ అయ్యాడు. విజయానికి అవసరమైన రెండో పరుగు చేయలేకపోయాడు.

జేసన్ రాయ్‌తోపాటు ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేయడంతోపాటు, మొత్తం ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ ఎంపిక ఈ జట్టులో అందరికంటే సులభం.

Image copyright Getty Images

మూడో స్థానంలో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేశారు. అతడినే ఈ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.

ఈ టోర్నీలో కెప్టెన్లు అందరి కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు, జట్టును ఫైనల్ వరకూ ముందుండి నడిపించిన ఆటతీరే అతడిని ఈ జట్టుకు కెప్టెన్‌గా చేసింది.

ఇంగ్లండ్ టాప్ స్కోరర్‌గా, ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచిన జో రూట్ ఐసీసీ కలల జట్టులో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై సెంచరీలు చేసిన జో రూట్, మిగిలిన మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

Image copyright Getty Images

ఐసీసీ జట్టులో ఐదో స్థానం బంగ్లాదేశ్‌ ఆల్ రౌండర్ షాకిబ్ అల్ హసన్‌కు దక్కింది. బంగ్లాదేశ్ జట్టులో మూడో స్థానంలో ఆడిన షాకిబ్ తన కెరీర్లో ఎక్కువగా ఐదో స్థానంలో బరిలోకి దిగాడు. అందుకే ఐసీసీ ఆ స్థానం అతడికే ఇచ్చింది.

87 పరుగుల సగటులో పరుగులు సాధించిన షాకిబ్ రెండు సెంచరీలతోపాటూ ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో 11 వికెట్లు కూడా పడగొట్టాడు.

Image copyright Getty Images

ఇక ఫైనల్లో వీరోచిత ఆటతీరుతోపాటు టోర్నీలో స్థిరంగా ఆడిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐసీసీ జట్టులో ఆరో స్థానంలో నిలిచాడు.

ఈ జట్టులో వికెట్ కీపర్‌గా ఐసీసీ ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ కేరీని ఎంపిక చేసింది. ఈ టోర్నీలో న్యూజీలాంట్ కీపర్ టామ్ లాథమ్ అత్యధిక డిస్మిసల్స్ చేసినా, 60కి పైగా సగటుతో 375 పరుగులు కూడా చేయడంతో అలెక్స్ కేరీ ఐసీసీ జట్టు ఫేవరెట్ కీపర్ అయ్యాడు.

ఆస్ట్రేలియా కీపర్‌తోపాటూ ఈ టోర్నీలోనే అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్ స్టార్క్‌కు ఈ జట్టులో స్థానం లభించింది.

Image copyright Getty Images

ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సూపర్ ఓవర్ హీరోగా నిలిచిన జోఫ్రా ఆర్చర్‌కు కూడా ఐసీసీ టీంలో ప్లేస్ దొరికింది. టోర్నీలో 4.57 ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్ 20 వికెట్లు కూడా పడగొట్టాడు.

టోర్నీలో అత్యధిక వికెట్ల జాబితాలో 21 వికెట్లతో రెండో స్థానంలో నిలిచిన న్యూజీలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్‌కు కూడా ఐసీసీ జట్టులో స్థానం లభించింది.

Image copyright Getty Images

ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు, అద్భుత క్యాచ్ అందుకున్న ఫెర్గూసన్... ఓవరుకు ఐదు కంటే తక్కువ పరుగులే ఇచ్చాడు.

చివరి బౌలర్ స్థానం ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు దక్కింది. ఓవరుకు 4.41 సగటుతో 18 వికెట్లు తీసుకున్న బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అందరికంటే మెరుగ్గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)