మదీనా-అల్-జహరా: ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది..

  • 16 జూలై 2019
మదీనా-అల్-జహరా Image copyright Getty Images

అత్యంత విలాసవంతంగా, సంపన్నంగా ఉన్న ఈ నగరాన్ని చూసి అప్పట్లో జనం ఆశ్చర్యపోయేవారట.

అప్పట్లో అది ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్నో స్మారక నిర్మాణాలు, ఆకర్షణలతో నిండిన ఈ నగరం స్పెయిన్‌ ఎండాలూసియా ప్రాంతంలోని కోర్డోబాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కానీ, ఈ నగరం కేవల 70 ఏళ్లపాటే ఉందనేది కూడా ఒక చరిత్రే.

మనం కాల్పనిక మదీనా అజహారా నగరం గురించి మాట్లాడుతున్నాం. దీనిని అరబ్బీలో మదీనా-అల్-జహరా అంటే మెరిసే నగరం అనేవారు.

అప్పట్లో స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో అరేబియన్ ముస్లింల పాలన కొనసాగేది.

అల్ అందాలూస్( ఇప్పుడు స్పెయిన్‌లోని అందాలూసియా ప్రాంతం) రాజకుమారుడు ఖలీఫా అబ్దుర్‌రహమాన్ 936వ సంవత్సరంలో కోర్డోబా పశ్చిమంలోని గ్వాదలక్వివీర్ నదీ తీరలో తన రాజధానిని నిర్మించాడు.

నదీ తీరంలోని బండరాళ్లపై వెలిసిన ఈ నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా ఉండేది. దాన్ని చూసి జనం ఆశ్చర్యపోయేవారట.

Image copyright Getty Images

పదేళ్లలో నగర నిర్మాణం

ఆ నగరానికి మదీనా-అల్-జహరా అని పేరు పెట్టారు. దీనిని పదేళ్లలోనే నిర్మించారు. 945లో ఖలీఫా దర్బార్ కూడా ఇక్కడికి చేరింది.

ఈ కొత్త రాజధానిని నిర్మించడానికి అంతులేని సంపదను ఖర్చు చేశారు. కొన్ని ఆధారాల ప్రకారం ఈ నగర నిర్మాణానికి పది వేల మంది కూలీలు పనిచేశారు. రోజూ 6,000 రాళ్లను ఇక్కడకు తీసుకొచ్చేవారు. సరకు రవాణా కోసం 1500 గాడిదలు, కంచరగాడిదలు ఉపయోగించారు.

అప్పట్లో అత్యంత నిపుణులైన శిల్పులను ఇక్కడకు రప్పించారు. వారు చెక్కిన అందమైన శిల్పాలను నగరంలోని గోడలు, కోటలు, స్తంభాలు, మార్గాలు అన్నిటిపై అమర్చి వాటిని అందంగా మార్చారు.

Image copyright IRENE HERNÁNDEZ VELASCO

నగరం కోసం భారీ వ్యయం

పోర్చుగల్‌లోని ఎస్త్రెమోజ్ నుంచి పాలరాయి తెప్పించారు. కోర్డోబా కొండల్లో నుంచి ఊదా రంగు సున్నపు రాయిని ఉపయోగించారు. ఇక్కడికి దగ్గర్లోని సియెరా డే కాబ్రా నుంచి ఎర్ర రంగు రాయిని తీసుకొచ్చారు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుకే నగరం నుంచి తెల్లటి సున్నపురాయి తెప్పించారు. ఇక ఖలీఫా దగ్గర బంగారానికి ఏమాత్రం లోటు ఉండేది కాదు.

మదీనా అల్ జహరా పురావస్తు ప్రాంత డైరెక్టర్ ఆల్బర్ట్ మోన్‌తేజో బీబీసీతో మాట్లాడారు. "ఈ నగరం ఖలీఫా గొప్పతనం, సంపద, బలానికి నిదర్శనం. అందుకే దీని గురించి చెబుతున్నప్పుడు అందులో వీలైనంత ఎక్కువ వైభవం, గొప్పతనం కనిపించేలా చేయడానికి చూస్తాం" అన్నారు.

"ఈ నగరాన్ని నిర్మిండానికి వారు రాజ్యంలోని అన్ని ఆర్థిక వనరులను ఉపయోగించారు. ఆ సమయంలో ఖిలాఫత్ వార్షిక బడ్జెట్ 40 నుంచి 50 లక్షల దిర్హాంలు. అందులో కనీసం మూడింట ఒక వంతు భాగాన్ని మదీనా అల్ జహరా నిర్మాణానికే ఖర్చు చేశారు".

"ఈ నగరాన్ని ఎగుడుదిగుడు బండరాళ్లపై నిర్మించారు. వాస్తు నిపుణులు దీనిని పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నారు. నగరాన్ని మూడు వేరువేరు తలాలుగా మార్చారు. అన్నిటికంటే పైన ఉన్న ప్రాంతంలో రాజపరివారానికి ఒక కోటను నిర్మించారు. ఇది అబ్దుర్‌రహమాన్ మూడో నివాస స్థలంగా ఉండేది. ఇందులో చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి. వాటిని అలంకరించడానికి అద్భుత శిల్పకళా నైపుణ్యం ఉపయోగించారు" అని మోన్‌తేజో చెప్పారు.

Image copyright Getty Images

ఖలీఫా మొత్తం నగరాన్ని చూసేలా..

విశాలంగా ఉన్న తమ మహలు పైనుంచి ఖలీఫా మొత్తం నగరాన్ని చూడగలిగేవారు.

రెండో ప్రాంతంలో పాలన కోసం భవనాలు, కీలకమైన అధికారుల ఇళ్లు ఉండేవి. నగరంలో కింది స్థాయిలో సాధారణ ప్రజలు జీవించేవారు. ఇక్కడ సైనికుల ఇళ్లు, మసీదులు, బజార్లు, స్నానాల గదులు, బహిరంగ తోటలు ఇంకా ఎన్నో ఉండేవి.

నిర్మించిన 15 ఏళ్లకే నగరంలోని కొన్ని ప్రాంతాలు కూలగొట్టి మళ్లీ పెద్దవిగా కట్టారు.

"కోర్డోబా ఖిలాఫత్ మధ్యధరా సముద్ర ప్రాంతంలో అప్పట్లో మహా సామ్రాజ్యంగా ఉండేది. దానిని బైజాంటిన్ సామ్రాజ్యంతో పోల్చేవారు. ఆ సమయంలో మదీనా అల్ జహరా అంత సంపన్న నగరం ఎక్కడా లేదు" అని మోన్‌తేజో చెప్పారు.

Image copyright Getty Images

70 ఏళ్లకే అంతరించిన నగరం

అయితే ఈ నగరం కేవలం 70 ఏళ్లు మాత్రమే ఉనికిలో ఉంది.

976లో ఖలీఫా అబ్దుర్‌రహమాన్ కొడుకు, వారసుడు అల్ హాకెన్-2 మరణం తర్వాత నుంచి ఈ నగరం పతనం మొదలైంది.

పాలనా పగ్గాలు కేవలం 11 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కొడుకు హిషామ్ చేతుల్లోకి వెళ్లిపోయాయి.

అప్పుడు అధికారమంతా అల్ హాకెన్ సేనాపతి అల్-మంజూర్ చెలాయించేవాడు. ఆయన్ను మంత్రిగా, సలహాదారుడుగా నియమించింది అల్ హాకెనే.

కానీ, అల్ మంజూర్ అల్-అందాలూస్ పాలనను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తర్వాత తన కోసం వేరే నగరాన్ని నిర్మించాడు. మదీనా అల్ జాహిరా, మదీనా అల్ జహ్రాను వదిలి అక్కడికి వెళ్లిపోయాడు.

Image copyright Getty Images

ఆనాటి అందాలు ధ్వంసం

రక్తసిక్తమైన అంతర్యుద్ధం తర్వాత 1031లో కోర్డోబా ఖిలాఫత్ కూడా ముగిసింది. ఆ ప్రాంతం వేరు వేరు రాజ్యాలుగా విడిపోయింది. వాటిని తైఫా రాజ్యాలు అనేవారు. తర్వాత మదీనా అల్ జహరాను పూర్తిగా విడిచిపెట్టారు.

పాశ్చాత్య ప్రపంచంలో అత్యంత అందమైన నగరం అని పేరున్న అల్ జహరాను దోచేశారు, తగలబెట్టారు. దాని అందాలను ధ్వంసం చేశారు.

రాజధాని నిర్మాణానికి ఉపయోగించిన అత్యంత విలువైన వస్తువులను గోడల నుంచి స్తంభాల నుంచీ పెకలించారు. వాటిని తీసుకువెళ్ళి అమ్ముకున్నారు.

"రాజధానికి సంబంధించిన వస్తువులు ఎవరిదగ్గరైనా ఉంటే, వారిని చాలా గౌరవించేవారు. చివరికి వారు సెవిలే చేరుకున్నారు. లేదంటే ఉత్తర ఆఫ్రికా, ఉత్తర స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు" అని మోన్‌తేజో చెప్పారు.

Image copyright IRENE HERNÁNDEZ VELASCO

గోడల్లో రాళ్లు కూడా తీసుకెళ్లారు

తర్వాత కూడా అక్కడ దోపిడీలు జరిగాయి. నగరాన్ని చాలా ఘోరంగా దోచుకున్నారు. గోడలు, భవనాలకు తాపడం చేసిన శిల్పాను, కట్టడాలకు ఉపయోగించిన రాళ్లను కూడా పెకలించి తీసుకెళ్లిపోయారు.

మదీనా అల్ జహరా ఒక అందమైన నగరం నుంచి నిర్మాణ సామగ్రిని తవ్వి తీసుకునే ఒక గనిలా మారిపోయింది. శతాబ్దాల నాటి అందమైన శిల్పాలు, నగిషీలు తాపడం చేసిన రాళ్లుండడమే ఆ నగరానికి శాపమైంది.

తర్వాత అందరూ ఆ నగరం గురించి మర్చిపోయారు.

1911లో ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు ఈ నగరం బయటపడింది. ఈ మాయా నగరం అలా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

ఒక అంచనా ప్రకారం అప్పట్లో ఉన్న నగరంలో 11 శాతం మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది. 2018లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)