తల్లితండ్రులకు చెప్పకుండా కారుతో ఉడాయించి 900 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన పిల్లలు

  • 16 జూలై 2019
పిల్లలు తీసుకెళ్లిన కారు ఇదే Image copyright QUEENSLAND POLICE
చిత్రం శీర్షిక పిల్లలు తీసుకెళ్లిన కారు ఇదే

ఆస్ట్రేలియాలో 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలురు, ఒక బాలిక చేపలు పట్టే సామగ్రి (ఫిషింగ్ రాడ్స్), డబ్బులు తీసుకొని ఓ కారు ఎక్కారు. 900 కిలోమీటర్లకు పైగా దానిని నడుపుకొంటూ వెళ్లిపోయారు.

వీళ్లను న్యూ సౌత్ వేల్స్‌ రాష్ట్రంలోని గ్రాఫ్టన్ పట్టణంలో ఆదివారం గుర్తించారు. వీరు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ బాలలు క్వీన్స్‌లాండ్ రాష్ట్రం గ్రేస్‌మేర్ పట్టణం నుంచి బయల్దేరారు. తాను బయటకు వెళ్తున్నామని ఒక బాలుడు కుటుంబ సభ్యులకు నోట్ రాసినట్లు చెబుతున్నారు.

వీరు డ్రైవింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం.

వీరిపై అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఏయే అభియోగాలు మోపేదీ వారు వెల్లడించలేదు.

ఈ పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాదు. వీరిలో ఒకరు తల్లిదండ్రులకు తెలియకుండా కారు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

వీరు ఆదివారం దాదాపు 140 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బాననా అనే పట్టణంలో ఒక సర్వీస్ స్టేషన్ వద్ద కారు ఆపి పెట్రోలు దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సర్వీస్ స్టేషన్ ఉద్యోగి ఒకరు సిడ్నీకి చెందిన డైలీ టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడుతూ- ఈ కారు ఇంధనం కోసం సాధారణ వాహనంలాగే వచ్చిందని భద్రతా వీడియోను బట్టి తెలుస్తోందన్నారు.

వాహనం నడుపుతున్న బాలుడు ఎత్తు తక్కువగా ఉన్నాడని, కిటికీ వరకు కూడా లేడని ఆయన చెప్పారు.

అదే రోజు గ్రాఫ్టన్ పట్టణానికి సమీపంలోని గ్లెన్ ఇన్స్ పట్టణంలో వీరి వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. వాహనం నడుపుతున్న బాలుడి వయసును దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని వెంబడించడం ఆపేశారు.

ఆ తర్వాత గ్రాఫ్టన్ పట్టణంలో ఒక రోడ్డు పక్కన ఈ కారును పోలీసులు గుర్తించారు.

పిల్లలు కారు లోపల తాళం వేసుకొన్నారని, పోలీసులు లోపలికి వెళ్లి వారిని అరెస్టు చేసేందుకు బ్యాటన్ వాడాల్సి వచ్చిందని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ డారెన్ విలియమ్స్‌ను ఉటంకిస్తూ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.

బాలల్లో ఒక్కరే కాకుండా ఒకరి తర్వాత మరొకరు వాహనం నడిపి ఉండొచ్చని, మధ్యలో ఆగకుండా ప్రయాణిస్తే గ్రేస్‌మెర్ నుంచి గ్రాఫ్టన్‌ చేరుకోవడానికి దాదాపు పది గంటలు పడుతుందని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఇది దూర ప్రయాణమేనని, ఒకే బాలుడు కారు తోలడం కష్టమని తెలిపారు.

ఈ పిల్లలను తల్లిదండ్రుల సమక్షంలో విచారిస్తామని పోలీసులు చెప్పారు.

క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కనీసం 17 ఏళ్ల వయసు ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)