భారత్‌ దాడులతో మూసేసిన గగనతలాన్ని మళ్ళీ తెరిచిన పాకిస్తాన్

  • 16 జూలై 2019
ఎయిర్ స్పేస్ తెరిచిన పాకిస్తాన్ Image copyright Getty Images

బాలాకోట్ దాడుల తర్వాత మూసివేసిన తమ ఎయిర్ స్పేస్‌ను మళ్లీ తెరుస్తున్నట్లు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ప్రకటించింది.

పాక్ గగనతలాన్ని తక్షణం తెరుస్తున్నట్లు మంగళవారం ఉదయం అథారిటీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పింది.

ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి సమాధానంగా ఫిబ్రవరి 28న భారత్ బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపింది. తర్వాత పాకిస్తాన్ తమ గగనతలం మూసేసింది.

పాకిస్తాన్ నిర్ణయంతో నష్టాలు ఎదుర్కున్న భారత ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఇది ఉపశమనం కలిగించింది.

పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు వేరే మార్గంలో వెళ్లాల్సొచ్చింది. చాలాదూరం చుట్టు తిరిగి వెళ్లడం వల్ల కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కుంది.

పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలోని ఎయిర్‌మెన్(NOTAM) భారత కాలమానం ప్రకారం సుమారు 12.41కు ఒక నోటీస్ జారీ చేసింది.

Image copyright Pcca

అందులో పాకిస్తాన్ గగనతలాన్ని అన్నిరకాల పౌర విమానాల కోసం తక్షణం తెరుస్తున్నట్లు చెప్పింది.

Image copyright Getty Images

ఎవరికి ఎంత నష్టం

పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత భారత విమాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా రోజూ కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కుంది.

భారత పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ జులై 3న దీనికి సంబంధించి రాజ్యసభలో కొన్ని గణాంకాలు ప్రవేశపెట్టారు.

అందులో ఎయిర్ ఇండియాకు జులై 2 వరకూ 491 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు చెప్పారు.

పాక్ నిర్ణయం వల్ల ప్రైవేటు ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు 30.73 కోట్లు, ఇండిగోకు 25.1 కోట్లు, గో ఎయిర్‌కు 2.1 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

పాక్ తమ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత యూరప్, అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. చాలా అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సివచ్చింది.

ఇండిగో దిల్లీ- ఇస్తాంబుల్ డైరెక్ట్ విమాన సేవలను రద్దు చేసింది. పాక్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడికి వెళ్లేదారిలో ఈ విమానం కతార్‌లోని దోహాలో ఆగాల్సివచ్చేది.

పాక్ ప్రకటన తర్వాత భారత్ కూడా రెండు దేశాల గగనతలంపై ఎలాంటి ఆంక్షలూ లేవని ప్రకటించింది.

అమెరికా నుంచి దిల్లీ, ముంబైలకు విమాన సేవలను రద్దు చేసిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ దానిని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)