కర్ణాటక రాజకీయ సంక్షోభం.. సుప్రీం కోర్టు తీర్పు: కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందా?

  • 17 జూలై 2019
సుప్రీం కోర్టు Image copyright Getty Images

కర్ణాటక‌లో రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.

ఆ ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేయలేమని పేర్కొంది.

ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించాలా లేదా అనేది స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.

బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయకూడదని ఆదేశించింది.

సీజేఐ రంజన్ గొగోయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

సుప్రీం తీర్పుపై కర్ణాటక‌ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వహిస్తానని తెలిపారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, ‘ఇక ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే వారికి కావాల్సినంత బలం లేదు’ అని పేర్కొన్నారు.

Image copyright Getty Images

కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందా?

14 నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 78 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాగా, 37 మంది జేడీఎస్ సభ్యులు, ఒకరు బీఎస్పీ, మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.

225 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యలు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది.

ఒకవేళ ప్రభుత్వానికి రెబెల్‌గా మారిన 15 మంది ఎమ్మెల్యేలు గురువారం జరిగే బలపరీక్షలో పాల్గొనకపోతే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది.

కానీ, కుమారస్వామి ప్రభుత్వం బలం 102కు తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు