దొరికిన అమెరికా యుద్ధనౌక ఆచూకీ... 70 ఏళ్ల నాటి వివాదం పరిష్కారం

  • 21 జూలై 2019
యూఎస్ఎస్ ఈగల్ పీఈ-56 Image copyright SMITHSONIAN CHANNEL

రెండో ప్రపంచం యుద్ధ కాలంలో అమెరికా తూర్పుతీరంలో మునిగిపోయిన ఆ దేశ యుద్ధనౌకను ఓ ప్రైవేటు గజ ఈతగాళ్ల బృందం కనిపెట్టింది. దీంతో 75 ఏళ్ల నాటి కేసు పరిష్కారమైంది.

అమెరికా నౌకా దళానికి చెందిన యూఎస్ఎస్ ఈగల్ పీఈ-56 ప్రమాదం వల్ల ముగినిపోయిందని మొదట భావించారు. అయితే, జర్మన్ సబ్‌మెరైన్ దాడి వల్లే ఆ నౌక మునిగిపోయిందని ఇప్పుడు దొరికిన ఆధారాలతో తెలిసింది.

ఈ నౌక మునిగిపోయిన ప్రాంతం 2018 జూన్ వరకు మిస్టరీగానే ఉంది. ఈగల్ యుద్దనౌక అట్లాంటిక్ మహాసముద్రంలో 300 అడుగులు (91 మీటర్లు) లోతులో మునిగిపోయింది.

Image copyright SMITHSONIAN CHANNEL

''ఇప్పుడు అందరూ ఈ నౌక గురించే చర్చించుకుంటున్నారు. ఒక వేళ మేం దీన్ని కనిపెట్టకపోతే దీని గొప్పతనం తెలిసేదే కాదు'' అని ర్యాన్ కింగ్ అన్నారు. 8 మంది ఉన్న గజ ఈతగాళ్ల బృందంలో ఈయన ఒకరు.

ఈయనతో పాటు మరో ఏడుగురు గత నాలుగేళ్ల నుంచి ఈ నౌక గురించి వెతుకుతున్నారు.

ఈ యుద్ధనౌక 69 ఏళ్ల కిందట అట్లాంటిక్ సముద్ర తీరంలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 62 మందిలో 49 మంది జలసమాధి అయ్యారు.

గ్యారీ కొజక్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ నౌకను కనిపెట్టే బాధ్యతను చేపట్టింది. ముఖ్యంగా అనేక లక్ష్యాలను నిర్దేశించుకొని జీపీఎస్‌ సమన్వయంతో నౌకను కనుగొనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.

జూన్ చివర్లో ఈ బృందంలోని ఇద్దరు సభ్యులు.. సముద్రం లోపల అన్వేషిస్తుండగా ఒక పెద్ద స్టీల్ గోడలాంటిది వారి కంటపడింది. ''ఆ స్టీల్ గోడే ఈగల్ పీఈ-56 అని తర్వాత తెలిసింది'' అని కింగ్ చెప్పారు.

Image copyright NAVAL HISTORY AND HERITAGE COMMAND
చిత్రం శీర్షిక యూఎస్ఎస్ ఈగల్ పీఈ-56 తరహా యుద్ధనౌక ఇది.

వేసవికాలంలో ఈ బృందం మరో 20 మందితో కలిసి మళ్లీ ఆ నౌక వద్దకు చేరుకొని దాన్ని పరిశీలించింది. ఈ నౌక పీఈ-56 అని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించింది.

నౌకాదళ చరిత్రకు సంబంధించిన నిపుణుడు రాబర్డ్ నెయ్‌ల్యాండ్‌తో కలిసి ఈ బృందం పనిచేసింది.

సముద్ర ఉపరితలం నుంచి నౌక ఉన్న స్థలానికి చేరడానికి ఈ బృందానికి నాలుగ నిమిషాలు పడుతుంది. సముద్రం లోపల 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, పీడనాన్ని అధిగమిస్తూ వారు నౌక శిథిలాలను సేకరించారు.

ఈ యుద్ధనౌకను రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హెన్రీ ఫోర్డ్ రూపొందించారు. ఈ యుద్ధంలో మునిగిపోయిన ఏకైక ఈగల్ యుద్ధ నౌక కూడా ఇదే.

బాయిలర్ పేలుడు వల్ల ఈ యుద్ధనౌక మునిగిపోయిందని అప్పట్లో భావించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తాము యుద్దనౌకకు సమీపంలో జర్మన్ సబ్‌మెరైన్‌ను చూశామని చెప్పారు.

''ఇకపై చరిత్రను మార్చి రాయాలి. దీన్ని కనిపెట్టడం అనేది వెలకట్టలేని విషయం'' అని నెయ్‌ల్యాండ్‌ అన్నారు.

''శిథిలమైన నౌకను కనుగొన్న వెంటనే మేం నిజంగా ఈ కథను చెప్పాలనుకున్నాం. మా కథ కాదు.. ఈగల్ కథ'' అని గజ ఈతగాళ్ల బృందం సభ్యుడు కింగ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు