చంద్రుడిపైకి మానవుడు కాలుపెట్టి 50 ఏళ్లు: అప్పట్నుంచి ఇప్పటి వరకూ చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. ఎందుకు?

  • 21 జూలై 2019
అపోలో 11 వ్యోమనౌక Image copyright Getty Images

''ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే కావొచ్చు. కానీ, మనవాళికి ఇది అతిపెద్ద ముందడుగు'' అని చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు.

సరిగ్గా 50 ఏళ్ల కిందట నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. అపోలో 11 వ్యోమనౌక ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. కొన్ని గంటల తర్వాత.. అంటే 21.56 సీటీ (సెంట్రల్ టైమ్) (భారత కాలమానం ప్రకారం జూలై 21 ఉదయం 9.26 గంటలకు) నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, మానవ చరిత్రలో చంద్రుడిపై నడిచిన మొదటి మనిషిగా నిలిచిపోయారు.

ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లి వచ్చారు. అయితే, 1972లో యుజెన్ సెర్నన్ చంద్రుడిపైకి వెళ్లివచ్చాక అక్కడికి మనుషులను పంపే మిషన్‌కు అమెరికా ముగింపు పలికింది.

అప్పటి నుంచి నేటి వరకు అంటే 46 ఏళ్ల వరకు చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఆర్మ్ స్ట్రాంగ్

చంద్రుడి మీదకు మనుషులు వెళ్లనే లేదని, అక్కడికి వెళ్లివచ్చారనే ఫొటోలు కూడా అమెరికా సృష్టించినవేనని అనేక కుట్రసిద్దాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి.

ఈ ఏడాది మేలో నాసా ఒక ప్రకటన చేసింది. 2024లో మానవసహిత యాత్ర చేపడుతామని తెలిపింది.

ఈ యాత్రలో మహిళలను చంద్రుడిపైకి పంపిస్తామని పేర్కొంది.

అయితే, 50 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అమెరికాతో పాటే ఏ దేశం కూడా చంద్రుడిపైకి ఎందుకు మానవులను పంపించలేదనే ప్రశ్న ఉదయిస్తోంది?

Image copyright EPA

ఆర్థిక అవరోధాలేనా?

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రుడిపైకి పంపి రష్యాతో జరుగుతున్న అంతరిక్షపోరులో అమెరికా విజయం సాధించింది. కానీ, ఈ మూన్ మిషన్‌కు అమెరికాకు భారీగా ఖర్చు అయింది.

''చంద్రుడి మీదకు మానవసహిత యాత్ర చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులో శాస్త్రీయంగా సహేతుకత కూడా లేదు'' అని లాస్ ఏంజిలస్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఖగోళశాస్త్ర ప్రొఫెసర్ మిచెల్ రిచ్ అన్నారు.

శాస్త్రీయ ఆసక్తుల కంటే రాజకీయ, ప్రచార కారణాల వల్లే చంద్రుడిపైకి మానవసహిత యాత్రలు చేపట్టారని కొందరు నిపుణులు చెబుతారు.

''మూన్ మిషన్ బడ్జెట్‌ కోసం కాంగ్రెస్‌ను ఒప్పించడం చాలా కష్టమైన పని. అసలు వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపి తిరిగి తీసుకరావడానికి పెద్దగా కారణాలు ఏమి లేవు'' అని రిచ్ పేర్కొన్నారు.

మూన్ మిషన్ సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వం ఫెడరల్ బడ్జెట్‌లో నాసాకు 5 శాతం నిధులను కేటాయించింది. ప్రస్తుతం 1 శాతం కేటాయిస్తున్నారు.

''అప్పట్లో ఇలా మూన్ మిషన్‌కు అధిక నిధులు కేటాయించడంతో తాము కట్టిన పన్నులు చంద్రుడు మీదకు వెళ్లిపోతున్నాయని ప్రజలు భావించేవారు'' అని రిచ్ గుర్తు చేసుకున్నారు.

Image copyright Getty Images

కొత్త అవకాశాలు

ఇటీవల, ఒక్క అమెరికా నుంచే కాకుండా ఇతర దేశాలు కూడా చంద్రుడిపై యాత్రలకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మార్చిలో మాట్లాడుతూ, ''పొరపాట్లు చేయకండి, ఈరోజు మనం అంతరిక్ష పోటీలో ఉన్నాం. మనం 1960లో పోషించిన పాత్ర కంటే ఇప్పుడు పెద్దపాత్ర పోషించాలి'' అని పేర్కొన్నారు.

సాంకేతిక సామాగ్రి తక్కువ ధరకే దొరుకుతుండటం, ఏయిర్ క్రాఫ్ట్‌ల తయారీ విరివిగా జరుగుతుండటంతో అనేక దేశాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా మూన్ మిషన్‌లో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.

జనవరిలో చైనాకు చెందిన చేంగ్4 విజయవంతంగా చంద్రుడి మరో పార్శంవైపు విజయవంతంగా అడుగుపెట్టింది.

''ఇంకో వందేళ్లలో చంద్రుడి గురించి మనకు బాగా తెలిసిపోతుంది. అప్పుడు విశ్వంలోని ఇతర ప్రదేశాలను కనుగొనేందుకు వెళుతాం'' అని రిచ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)