చైనా వృద్ధిరేటు ఎందుకు పడిపోతోంది? అమెరికాతో వాణిజ్య యుద్ధమే కారణమా?

  • 21 జూలై 2019
చైనా ఆర్థిక వ్యవస్థ Image copyright Getty Images

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి రేటు దాదాపు గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నెమ్మదించింది.

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు గత ఏడాదితో పోలిస్తే 6.2 శాతం వృద్ధి నమోదైంది. 1992 నుంచి గత 27 సంవత్సరాల్లో వృద్ధిరేటు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. వృద్ధిరేటు తగ్గుదల ముందుగా వెలువడిన అంచనాలకు అనుగుణంగానే ఉంది.

మొదటి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి వరకు నమోదైన 6.4 శాతం వృద్ధి రేటు కన్నా కూడా ఇది తక్కువగా ఉంది.

చైనాలో ఆర్థిక సంవత్సరం జనవరి 1న మొదలై డిసెంబరు 31తో ముగుస్తుంది.

చిత్రం శీర్షిక ఆధారం: చైనా జాతీయ గణాంకాల విభాగం

ప్రజల్లో వ్యయాన్ని ప్రోత్సహించడం, పన్నులు తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ఈ సంవత్సరం చైనా ప్రయత్నాలు చేస్తోంది.

అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపింది. వృద్ధి రేటును తగ్గించింది.

ఇటీవల చైనా వృద్ధిరేటు గణాంకాలు వెలువడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందిస్తూ- అమెరికా సుంకాల విధింపుతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోందని వ్యాఖ్యానించారు.

దేశం లోపల, దేశం వెలుపల సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నట్లు వృద్ధి రేటు గణాంకాలను బట్టి అర్థమవుతోందని చైనా జాతీయ గణాంకాల విభాగం వ్యాఖ్యానించింది. 2019 ప్రథమార్ధంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు పర్వాలేదని, కానీ వృద్ధిరేటు తగ్గుదల ఒత్తిడిని ఎదుర్కొందని చెప్పింది.

విశ్లేషణ

అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా వృద్ధిరేటుపై కొంత ప్రభావం చూపినట్లు గణాంకాలు సూచిస్తున్నాయని బీబీసీ వాణిజ్య ప్రతినిధి ఆండ్రూ వాకర్ చెప్పారు. చైనాకు అంతర్జాతీయంగా మెరుగైన వాణిజ్య వాతావరణం ఉంటే వృద్ధిరేటు ఇంత నెమ్మదించేది కాదన్నారు.

ఆయన విశ్లేషణ ప్రకారం- 1990 నుంచి 2010 వరకు మూడు దశాబ్దాల్లో చైనా సగటు వృద్ధిరేటు పది శాతంగా ఉంది. ఇంత వృద్ధిరేటు సుదీర్ఘకాలం కొనసాగడం సాధ్యం కాదని చైనా నాయకత్వంతోపాటు ప్రతీ ఆర్థికవేత్త భావిస్తూనే వచ్చారు.

Image copyright Getty Images

ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులు, ఎగుమతులపై తక్కువగా, దేశ ప్రజల వ్యయంపై ఎక్కువగా ఆధారపడేలా చూడాలనే లక్ష్యం నాయకత్వానికి ఉండేది.

పెట్టుబడులు, పొదుపు రేట్లు అధికంగా ఉన్నప్పటికీ, కొంత పురోగతి సాధ్యమైంది. ఇప్పుడు వ్యాపార సంస్థల రుణాలు అధిక స్థాయిలో ఉండటం లాంటి అంశాలు సమస్యాత్మకమయ్యే ఆస్కారముంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం అధికార యంత్రాంగం వ్యాపార సంస్థలకు రుణ వితరణను బాగా ప్రోత్సహించింది. ఈ చర్యలు వృద్ధిరేటు వేగంగా, భారీగా పడిపోవడాన్ని నివారించేందుకు తోడ్పడ్డాయి. అయితే ఇవి మరిన్ని ఆర్థిక సమస్యలను కూడా సృష్టించాయి.

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)పై చైనా అధికారిక గణాంకాలను ఆచితూచి పరిగణనలోకి తీసుకోవాలని చైనా వ్యవహారాలను పరిశీలించే నిపుణులు హెచ్చరిస్తారు. అయినప్పటికీ ఈ గణాంకాలు చైనా వృద్ధి పథాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి.

కొన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలను చూస్తే- చైనా ఆర్థిక వ్యవస్థలో కొంత పురోగతి కూడా కనిపిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తినే తీసుకుంటే జూన్‌లో గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే చిల్లర అమ్మకాలు 9.8 శాతం పెరిగాయి.

ఈ రెండూ కూడా రాయిటర్స్ పోల్స్ అంచనాల కన్నా మెరుగ్గానే ఉన్నాయి.

Image copyright Getty Images

అంతర్జాతీయ ప్రభావం

చైనాలో వృద్ధిరేటు మందగమనం అంతర్జాతీయంగా పరోక్షంగా ప్రభావం చూపొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

వృద్ధిరేటు తాజా గణాంకాలను బట్టి చూస్తే చైనా ఆర్థిక మందగమనం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే మరిన్ని చర్యలను చైనా సెంట్రల్ బ్యాంకు నుంచి మార్కెట్లు ఆశించవ్చని ఒయాండా సంస్థలో సీనియర్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఎడ్వర్డ్ మోయా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు