మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లిన ఆ అమ్మాయి ఏమైంది.. 36 ఏళ్లుగా వీడని చిక్కుముడి

  • 22 జూలై 2019
ఎమాన్యుయెలా ఓర్లాండీ Image copyright Alamy
చిత్రం శీర్షిక ఎమాన్యుయెలా ఓర్లాండీ

సంగీతం నేర్చుకోవడానికి వెళ్లిన ఆ పదిహేనేళ్ల అమ్మాయి ఇంటికి తిరిగిరావడానికి బస్‌స్టాప్‌లో నిల్చుంది. తెలిసినవారు అక్కడే ఆమెను చివరిసారి చూశారు. ఆ తరువాత ఇక ఎవరికీ కనిపించలేదు.

ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా..? లేదంటే చంపేశారా? తనే ఎక్కడికైనా వెళ్లి రహస్యంగా జీవిస్తోందా? ముప్ఫయ్యారేళ్లుగా ఈ ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం దొరకలేదు.

ఇటలీలోని రోమ్‌లో 1983 జనవరి 22న మాయమైపోయిన ఆ అమ్మాయి పేరు ఎమాన్యుయెలా ఓర్లాండీ. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. అసలు బతికే ఉందో చనిపోయిందో అసలే తెలియదు.

వాటికన్ సిటీలో పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఎమాన్యుయెలా కోసం ఆమె కుటుంబం ఇప్పటికీ తమ అన్వేషణ సాగిస్తోంది. ఎవరు ఏ చిన్న సమాచారం ఇచ్చినా.. అది నిజమైనా, వదంతులైనా కూడా ఆ సమాచారం ఆధారంగా ఎమాన్యుయెలా జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

తాజాగా అలా అందిన సమాచారం ప్రకారమే వాటికన్ సిటీలోని కొన్ని సమాధులను తవ్వుతున్నారు. అందులో ఎక్కడైన మట్టిలో కలిసిపోయిన తమ ముద్దుల తల్లి అస్థికలైనా కనిపిస్తాయేమోనని ఆశగా వెతుకుతున్నారు.

Image copyright Reuters

తాజా తవ్వకాల్లో భాగంగా శనివారం వాటికన్ సిటీలోని రెండు సమాధులను తవ్వి అందులో ఉన్న అస్థికలను పరిశీలించారు.

అంతకుముందు జులై 11న కూడా రెండు సమాధులను తవ్వారు. వాటికన్‌లోని పాంటిఫికల్ ట్యూటానిక్ కాలేజ్‌లో ఉన్న స్మశానంలో ఈ సమాధులున్నాయి.

హోలీ సీ ప్రెస్ ఇంటెరిమ్ డైరెక్టర్ అలెస్సాండ్రో జిసోటీ దీనిపై మాట్లాడుతూ.. 'యువరాణి సమాధికి సమీపంలో ఉన్న రెండు సమాధులను తవ్వారు.

వాటిలోని అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. వారు వివరాలు చెప్పడానికి సమయం పడుతుంది' అన్నారు.

సాధారణంగా ఎముకల ఆధారంగా వయసు, అవి ఏ కాలం నాటివో చెప్పడానికి శాస్త్రవేత్తలకు 5 గంటలు చాలు. కానీ, డీఎన్‌ఏను ప్రాథమికంగా గుర్తించడానికి కూడా సమయం పడుతుంది.

Image copyright AFP

ట్యూటానిక్ కాలేజ్‌ స్మశానంలోనే ఎందుకు తవ్వుతున్నారు

ఈ ఏడాది మార్చిలో ఎమాన్యుయెలా కుటుంబసభ్యులకు ఒక లేఖ అందింది. అందులో... ట్యూటానిక్ కాలేజ్ స్మశానంలోని ఓ సమాధిపై దేవత ఉన్నట్లుగా ఫొటో ఒకటి ఉంది.

దాంతో ఎమాన్యుయెలాను అక్కడ పాతిపెట్టారనడానికి సంకేతంగా ఎవరో ఈ చిత్రాన్ని పంపించి ఉంటారన్న అనుమానంతో కుటుంబసభ్యులు వాటికన్ అధికారులను సంప్రదించారు.

వారు అనుమతి ఇవ్వడంతో అక్కడి సమాధులు తవ్వుతున్నారు.

అయితే.. ఎమాన్యుయెలా మరణ రహస్యం ఛేదించడానికి జరుపుతున్న సమాధుల తవ్వకాలు మరిన్ని చిక్కుముడులకు కారణమయ్యాయి.

అక్కడ 18వ శతాబ్దానికి చెందిన ఇద్దరు యువరాణుల సమాధుల ప్రాంతాలనూ తవ్వగా అందులో ఉండాల్సిన యువరాణుల అస్థికలూ కనిపించకపోవడం సంచలనంగా మారింది.

అయితే, 1960-70 మధ్య కాలేజ్, అక్కడ స్మశానంలో జరిగిన పనుల సమయంలో ఆ అస్థికలు స్థలమార్పిడికి గురై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎమాన్యుయెలా అదృశ్యం తరువాత రోమ్‌లో ఓ గోడపై వేసిన ఆమె చిత్రం(చిత్రంలో కుడివైపు యువతి)

‘చెల్లాయి ఏమైందో తెలుసుకుంటేనే నాకు మనశ్శాంతి’

ఎమాన్యుయెలా పెద్దన్న పీట్రో ‘బీబీసీ’తో మాట్లాడుతూ ‘‘ఎమాన్యుయెలా గురించి మర్చిపోయి సంతోషంగా జీవించాలని చాలామంది నాకు చెప్తుంటారు.

కానీ.. నేను వదిలిపెట్టను. ఆమె అదృశ్యం కేసు తేలకపోతే నాకు మనశ్శాంతి ఉండదు’ అన్నారు.

ఎమాన్యుయెలా తల్లి అయితే ఇంకా తన కుమార్తె బతికే ఉందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

88 ఏళ్ల ఆ వృద్ధురాలు తన కుమార్తె కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు