ఇమ్రాన్ ఖాన్, ట్రంప్ భేటీ: అమెరికాతో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు పాక్ ప్రయాస

  • 23 జూలై 2019
ట్రంప్, ఖాన్ Image copyright Getty Images

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తొలి ముఖాముఖి భేటీ కోసం వైట్‌హౌస్‌కు వెళ్లారు.

అఫ్ఘనిస్తాన్ వివాదం నేపథ్యంలో అమెరికాతో పూర్తిగా క్షీణించిన తమ ద్వైపాక్షిక సంబంధాలను చక్కదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ పర్యటన సాగుతోంది.

గత ఏడాది ట్రంప్.. పాకిస్తాన్ అబద్ధాలాడుతూ తమను మోసం చేస్తుందని ఆరోపిస్తూ ఆ దేశానికి అందించాల్సిన భద్రతా సాయాన్ని తగ్గించారు.

అమెరికా సారథ్యంలోని "ఉగ్రవాదంపై పోరు" కోసం పాకిస్తాన్‌ భారీగా ఖర్చు చేసిందని, దానితో పోల్చితే తమకు అమెరికా చేసిన సాయం చాలా తక్కువని ఇమ్రాన్ అన్నారు.

Image copyright Mark Wilson/gettyimages

గతేడాది పాక్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమెరికా చేస్తున్న డ్రోన్ దాడులు, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను

ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా విమర్శిస్తూనే, ఆ దేశంతో పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు ఉండాలని పిలుపునిచ్చారు.

తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతుందనే ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లతో చర్చలు జరిపి తమ దళాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, దేశ రక్షణతో పాటు వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.

ఇరు దేశాల మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి?

ట్రంప్ ప్రభుత్వం 2017లో అధికారంలోకి రాగానే పాకిస్తాన్‌పై కఠినవైఖరిని అవలంభించింది. ఇస్లామిక్ మిలిటెంట్స్‌కు పాక్ మద్దతు ఇస్తోందని, ఈ విషయంలో అమెరికాను కూడా తప్పుదోవ పట్టిస్తుందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే, ఈ విమర్శలను పాక్ కొట్టివేసింది.

పాక్‌కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తానని 2018 మొదట్లో ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాదాపు 2 బిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని నిలిపివేశారు.

ఇమ్రాన్ పర్యటన పాక్, అమెరికాల మధ్య దీర్ఘకాలిక సంబంధాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారిని పాకిస్తాన్ అరెస్టు చేసిందని గత బుధవారం ట్రంప్ ట్వీట్ చేశారు.

కానీ, వాస్తవానికి ఆ సూత్రధారి హఫీజ్‌ను పాక్ ప్రభుత్వం గత 20 ఏళ్లలో అనేకసార్లు అరెస్టు చేసి విడుదల చేయడం కూడా జరిగింది. ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేశారు.

అయితే, హఫీజ్ అరెస్టు వల్ల ఉగ్రవాదుల ఆర్థికసాయంపై అంతర్జాతీయంగా పర్యవేక్షించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్)కు సహాయపడినట్లు అవుతుందని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ చర్యతో ఆ సంస్థ తమను బ్లాక్ లిస్టులో పెట్టదని ఆశిస్తుంది.

అప్ఘనిస్తాన్‌లో సుస్థిరతే కీలకం

''అమెరికాతో సంబంధాలు మెరుగవ్వాలంటే అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడే పాకిస్తాన్ నిజంగా విజయం సాధించినట్లు'' అని షెర్రీ రహమాన్ వ్యాఖ్యానించారు. ఈయన 2011 నుంచి 2013 వరకు అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేశారు.

తాలిబన్లను పెంచిపోషించింది తామేననే విమర్శలను పాక్ ఖండిస్తూనే ఉంది. అయితే, 1996లో తాలిబన్లు అఫ్ఘన్‌లో అధికారం చేపట్టాక వారిని గుర్తించిన మూడు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. 9/11 ఘటన తర్వాత అమెరికా ఒత్తిడి చేయడంతో పాక్ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకుంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక కాబుల్‌లో గత నెలలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని గమనిస్తున్న స్థానికులు

ఈనెలలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చల కోసం తాలిబాన్లను ఒప్పించడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. ఈ చర్చలను అమెరికా ప్రతినిధి జల్మయ్ ఖలీల్జాద్ పెద్ద విజయంగా ప్రశంసిస్తున్నారు.

ఈ చర్చలు సులభతరం అవుతుండడంతో పాక్‌కు అనుకూలంగా ఈనెలలోనే రెండు చర్యలు జరిగాయని, ఒక విధమైన గుర్తింపు లభించిందని రెహమాన్ అభిప్రాయపడ్డారు.

అందులో ఒకటి పాకిస్తాన్‌లో వేర్వాటువాదాన్ని పోషిస్తున్న బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అమెరికా ఉగ్రవాదుల జాబితాలో పెట్టడం, రెండోది పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ 6 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు ఆమోదం తెలపడం అని ఆయన పేర్కొన్నారు.

''అమెరికా-తాలిబాన్ చర్చలకు పాకిస్తాన్ విశ్వాసంతో వేదికను కల్పిస్తోంది. దీన్ని తమ బాధ్యతగా భావిస్తోంది'' అని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కరాచీలో ప్రజలు ఆందోళనకు దిగారు.

ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి?

అమెరికా, తన విదేశీ పెట్టుబడులకు ప్రధాన వనరుగా పాక్‌ను చూస్తుంది. తన అతిపెద్ద మార్కెట్‌ ఎగుమతిదారుల్లో ఆ దేశం ఒకటి. అందుకే పాక్‌తో వాణిజ్యం అనేది అమెరికా ఎజెండాలో ప్రధానంగా ఉంది.

మరోవైపు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయిన పాక్‌ ఇప్పుడు సాయం కోసం చూస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కూడా పొదుపు చర్యలు చేపడుతూ, నిరాడంబరగా పాలన కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఒక్పపుడు ప్లేబాయ్‌గా పేరుబడిన ఆయన ఇప్పుడు తనను తాను పేదరిక నిర్మూలన సంస్కర్తగా చిత్రీకరించుకుంటున్నారు.

వాషింగ్టన్‌కు వచ్చినప్పుడు ఖరీదైన హోటల్‌లో కాకుండా పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలోనే ఉండాలని ఆయన భావిస్తునట్లు వార్తలు వచ్చాయి.

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కేందుకు చైనా సాయం కోసం కూడా పాక్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే చైనా.. పాక్‌కు అతిపెద్ద రుణదాతగా ఉంది.

ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఒకవైపు అమెరికాతో, దాని ప్రత్యర్థి చైనాతోనూ సున్నితంగా సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం