హైపర్‌లూప్: 2020 నాటికి 10 కి.మీ. పరీక్షకు సిద్ధమంటున్న ఎలాన్ మస్క్

  • 22 జూలై 2019
హైపర్‌లూప్ Image copyright VIRGIN HYPERLOOP ONE

తన హైపర్‌లూప్‌తో వచ్చే సంవత్సరం పోటీల్లో పాల్గొనేందుకు ఓ 10 కిలోమీటర్ల పొడవైన సొరంగం కావాలని ఎలాన్ మస్క్ చెప్పారు.

హైపర్‌లూప్‌తో భూగర్భ రవాణా మార్గాల ద్వారా అత్యంత వేగంగా ఒకచోట నుంచి మరొక చోటకు ప్రయాణించవచ్చని ఎలాన్ మస్క్ గతంలో ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించినప్పుడు వివరించారు.

మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో జరుగుతున్న స్పీడ్-రికార్డ్ పోటీల్లో వరుసగా నాలుగోసారి కొత్త రికార్డు సృష్టించిన తర్వాత ఆయన తన భవిష్యత్ ప్రణాళికలను బయటపెట్టారు.

"అమెరికాలో ప్రస్తుతం పరిశోధన జరుగుతున్న ట్యూబ్‌లో తమ ప్రాజెక్టు ద్వారా గంటకు 463 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాం. వచ్చే సంవత్సరం వంపులు తిరిగిన ట్యూబ్ మార్గంలో దీన్ని పరీక్షిస్తాం" అని మస్క్ ట్వీట్ చేశారు.

Image copyright AFP

గంటకు 1220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం హైపర్‌లూప్‌ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ పరిశోధనకు రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గ్రూప్ నుంచి నిధులు సమకూరాయి. దీని సహాయంతో 'హైపర్‌లూప్ ఒన్' అనే ఓ కొత్త ప్రయాణ సాధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బృందం కృషి చేస్తోంది. ఇది విజయవంతమైతే గంటకు అవలీలగా కనీసం 1080 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చంటున్నారు.

Image copyright ANDREAS HEDDERGOTT /TUM

భారత్‌లో ప్రతిపాదనలు ఇవీ

భారత్‌లో ముంబయి-బెంగళూరు-చెన్నై నగరాల మధ్య 1,102 కిలోమీటర్ల హైపర్‌లూప్ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ముంబయి నుంచి చెన్నైకి 63 నిమిషాల్లో చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 334 కిలోమీటర్ల దూరంలోని చెన్నైకు 23 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ముంబయి-పుణె మధ్య కూడా ఈ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థ పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం, హైపర్‌లూప్ అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీస్(హెచ్‌టీటీ) మధ్య 2017లో అవగాహన ఒప్పందం జరిగింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)