నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

  • 24 జూలై 2019
మహిళ Image copyright Getty Images

"శుక్రవారం నాడు నా కొడుకుని దింపిన తరువాత ఆ రాత్రికి నేను చెయ్యాల్సిన పని గుర్తు రాగానే నా ఒళ్లు జలదరిస్తుంది"

సార్వత్రిక నగదు బదిలీ(యూనివర్సల్ క్రెడిట్)లో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక గత్యంతరం లేని స్థితిలో వ్యభిచారం చేయాల్సివస్తోందంటున్న అలిసన్ మాటలివి.

చాలీచాలని ఆదాయంతో బతకలేక సెక్స్ వర్కర్లుగా మారుతున్న మహిళల కష్టాలను తెలుసుకుంటూ, అందుకు దారితీస్తున్న పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కొందరు బ్రిటన్ ఎంపీలకు అలిసన్ కథ సుపపరిచితమే.

అలిసన్‌లాగే బ్రిటన్‌లోని చాలామంది మహిళలు.. సార్వత్రిక నగదు బదిలీ పథకానికి చేసిన మార్పుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

'సార్వత్రిక నగదు బదిలీ పకం' అంటే..?

పని చేసే వయసులో ఉన్న యువతకు అండగా ఉండేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే భృతి పేరే సార్వత్రిక నగదు బదిలీ పథకం. ఇందులో ఆరు ప్రయోజనాలను కలిపి ఒకేసారి భృతి రూపంలో ఇస్తారు.

"మనలాంటి ధనిక దేశంలో ఇలాoటివి జరగడం దురదృష్టకరం. నాకు ఈ విషయం షాకింగ్ గా ఉంది" అని స్వతంత్ర ఎంపీ హెయిది అల్లెన్ అంటున్నారు.

Image copyright PA
చిత్రం శీర్షిక హెయిది అల్లెన్

2013లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సార్వత్రిక నగదు బదిలీ పధకం నుంచి భృతి పొందేవారికి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.

18 ఏళ్ల వయసులోనే ఒక వికలాంగ బాలుడికి జన్మనిచ్చిన అలిసన్‌కు ఈ భృతే జీవనాధారం.

"ఇంటి ఖర్చులన్నీ తీరాక కొన్ని వారాలకి చేతిలో డబ్బులు ఉండవు, అప్పుడనిపిస్తుంది వ్యభిచారం చెయ్యడం తప్ప వేరే దారి లేదని"

తనకి, తన కొడుక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేంత సంపాదిస్తే చాలు కానీ వ్యభిచారం వల్ల తనకు చేదు జ్ఞాపకాలు ఉన్నాయని అంటున్నారు అలిసన్.

Image copyright Getty Images

"నేను రోజూ చాలాసార్లు స్నానం చేస్తాను. కానీ, ఓసారి ఒక మగాడు కావాలనే వారం పాటు స్నానం చెయ్యకుండా నా దగ్గరకు వచ్చాడు. అతను వెళ్లిపోయిన తర్వాత కూడా నా ఒంటి నుంచి ఆ దుర్వాసన పోలేదు"

"ఇంకోసారి ఒకడి ఇంటికి వెళ్తే వాళ్ల అమ్మ తలుపు తెరిచింది. వాడు నాకు మత్తు పదర్ధాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే నేను ఇంటి వెనుక నుంచి పారిపోవాల్సి వచ్చింది".

"నాకు చావు భయం ఎక్కువ. కొంతమంది మగవారి ప్రవర్తన బాగుండదు. అలాంటప్పుడు చంపేస్తారేమోనని భయమేస్తుంది"

ఇలాంటి ఎన్నో విషయాలు బయటపడ్డాక ‘వర్క్, పెన్షన్ల కమిటీ’ చైర్మన్ ఎంపీ ఫ్రాంక్ ఫీల్డ్ ఈ విషయాలపై విచారణ ఆదేశించారు.

సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పోరాడే 'ఇంగ్లీష్ కలెక్షన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్స్' ఈ విచారణకు సాక్ష్యాలు పొందుపరిచింది.

Image copyright www.parliament.uk
చిత్రం శీర్షిక కమిటీకి చాలా మంది మహిళలు ఆధారాలు ఇచ్చారు

హెయిది అల్లెన్ ఈ ఏడాది కన్సర్వేటివ్ పార్టీకి రాజీనామా ఇవ్వడానికి ప్రధాన కారణమూ సార్వత్రిక నగదు బదిలీ పథకమేనట.

"ఒక సంక్షేమ రాష్ట్రం ప్రజలు అట్టడుగున ఉన్నప్పుడు వారిని పైకి తీసుకునిరావాలి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వారిని ఈ పథకం దిగజారుస్తోంది. అదే మనం మార్చాల్సింది".

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం 7 లక్షల మంది ఒంటరి తల్లితండ్రులు ఏటా 2380 పౌండ్లను ఈ పథకం వల్ల పొందలేకపోతున్నారు.

"మొదటి సారి భృతి రావాలంటే కనీసం 5 నెలలు వేచి ఉండాలి. అదే పెద్ద సమస్య" అని రీసెర్చ్ ఎకనమిస్ట్ టామ్ వాటర్స్ అంటున్నారు.

వికలాంగ కుమారుడితో తనకి సరిపడే ఉద్యోగం దొరకడం కూడా కష్టం అవుతోంది అని అలిసన్ వాపోతోంది.

"మాలాంటి వాళ్లకు సరిపడే డబ్బు ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక విధానం తేవాలి. మా ఆవేదనను వారు అర్ధం చేసుకోవాలి" అంటారామె.

అల్లెన్, ఫ్రాంక్ ఫీల్డ్‌తో జనాలు ఈ కథలను పంచుకోడం వాళ్లను ఎంతో కదిలించింది.

'వర్క్ అండ్ పెన్షన్స్' స్టేట్ సెక్రటరీ అంబర్ రూడ్‌కు ఇద్దరు వారి విన్నపాలు చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. కానీ, హెయిది అల్లెన్ మాత్రం ఆందోళన చెందుతోంది.

"అంబర్ ఈ విషయంలో పెద్ద అండగా ఉండబోతోంది. కానీ, కొత్త ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పదవి చేపట్టిన తర్వాత మంత్రులంతా మారనున్నారు. ఈ కథ మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉంది.

"ఈ మహిళల కథలను వారి నోటి నుంచి విన్నాక నేను నా మనసు మార్చుకున్నాను" అని ఎంపీ విల్ క్విన్స్ అన్నారు.

ఆయన అసలైతే వ్యభిచారానికి సార్వత్రిక నగదు బదిలీ పథకానికి ఎలాంటి సంబంధం లేదని గట్టిగా నమ్మారు.

"మా దృక్పథాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. మేము పార్లమెంట్ లో వెనక కూర్చున్న కూడా ఇలాంటి సమస్యల పరిష్కారంలో మేం ముందుంటాం".

అలిసన్ మాత్రం తనకు వచ్చే డబ్బు ఇకపై రాదేమోనన్న భయంతో ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వడానికి మాత్రం వెనుకంజ వేసింది.

ఏదయితేనేం, ఇప్పుడు తను ఒక మనిషితో ప్రేమలో ఉండటం వల్ల వ్యభిచారం మానేసిందట.

"ఇంకా నేను సార్వత్రిక నగదు బదిలీ పథకం నుండి వచ్చే డబ్బు తీసుకుంటున్న. నన్ను, నా కొడుకుని నా సహచరుడు బాగా చూసుకుంటున్నారు."

మళ్లీ ఎప్పుడైనా వ్యభిచారంలోకి వెళ్తావా అని అడిగితే అలిసన్ నిర్ఘాంతపోయింది.

"నిజంగా నాకు అలా ఆలోచించాలి అంటేనే భయం వేస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఉన్న మనిషితో విడిపోతే నా పరిస్థితి ఏంటి? నా దగ్గర వ్యభిచారం తప్ప వేరే అవకాశం లేదు" అని వేదన నిండిన కళ్లతో భయంభయంగా చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)