పార్లమెంటు సభ్యులకు పదహారేళ్ల అమ్మాయి పాఠాలు

  • 24 జూలై 2019
గ్రెటా Image copyright Getty Images

''మీరు మా మాట వినక్కర్లేదు.. కానీ సైన్స్ మాట వినితీరాల్సిందే'' -కాకలుతీరిన రాజకీయనాయకులు, ఫ్రాన్స్ పార్లమెంటులో.. ఆ దేశ ఎంపీలను ఉద్దేశించి ఒక బాలిక చెప్పిన పాఠం ఇది.

కానీ.. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో మంగళవారం ఆమె చేసిన ప్రసంగాన్ని.. కొందరు ఎంపీలు - సంప్రదాయవాదులైన రిపబ్లికన్, తీవ్ర మితవాదులైన నేషనల్ ర్యాలీ సభ్యులు - బహిష్కరించారు.

ఆ బాలిక పేరు గ్రెటా థన్‌బర్గ్. వయసు పదహారేళ్లు. స్వీడన్‌కు చెందిన ఈ టీనేజీ బాలిక ఒంటరిగా ఒక పోరాటం ప్రారంభించింది.

Image copyright ADAM BERRY / GETTY IMAGES

ఇంతకీ ఎవరీ గ్రెటా?

స్వీడన్ పార్లమెంటు ముందు గత ఏడాది ఆగస్టులో ఒంటరిగా ధర్నాకు దిగింది గ్రెటా. ''స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ (వాతావరణం కోసం స్కూలు సమ్మె)'' పేరుతో ఉద్యమించింది.

అది ఒక మహోద్యమంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో స్కూలు విద్యార్థులు రంగంలోకి దిగారు. బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఆమెతో జతకలిశారు.

Image copyright LUKAS SCHULZE/GETTY IMAGES

#FridaysforFuture హ్యాష్ ‌ట్యాగ్‌తో స్కూలు సమ్మె చేసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

''ఈ వాతావరణ మార్పు సంభవించకుండా నిరోధించటానికి ఎవరూ ఏమీ చేయటం లేదని నాకు అర్థమైంది. కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి'' అని ఆమె బీబీసీ ఇంటర్వ్యూలో పేర్కొంది.

రాజకీయనాయకుల నిష్క్రియపై ఆగ్రహం

గ్రెటాను గత డిసెంబర్‌లో పోలండ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలకు ఆహ్వానించారు. అక్కడ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగం ప్రశంసలందుకుంది.

Image copyright ALEXANDER POHL/NURPHOTO VIA GETTY IMAGES

ఆ తర్వాత పోప్‌ను కలిసింది. యూరోపియన్ (ఈయూ) పార్లమెంటులో ప్రసంగించింది. వాతావరణ మార్పు విషయంలో రాజకీయ నాయకులు నిష్క్రయాపరత్వంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌ పార్లమెంటులో ప్రసంగించింది. వాతావరణం విషయంలో బ్రిటన్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని తప్పుపట్టింది.

షేల్ గ్యాస్ వెలికితీయటానికి మద్దతు ఇవ్వటం, నార్త్ సీ నుంచి చమురు, గ్యాస్ నిక్షేపాలను భారీగా తోడేయటం, విమానాశ్రయాలను విస్తరించటం వంటి బ్రిటన్ చర్యలు పెద్ద పొరపాట్లని హెచ్చరించింది.

''కొద్ది మంది లెక్కపెట్టలేనంత డబ్బులు పోగువేసుకోవటం కోసం మా తరం భవిష్యత్తును దోచుకున్నారు'' అని మండిపడింది.

ఆమె ప్రసంగాలు రాజకీయ నాయకులను, ప్రభుత్వ పెద్దలను ఆలోచనలో పడేస్తున్నాయి.

Image copyright Getty Images

''షార్ట్స్ ధరించిన ప్రవక్త'' అంటూ విమర్శలు

తాజాగా.. గ్రెటాను, ఆమె టీనేజీ స్నేహితులను ఫ్రాన్స్ పార్లమెంటులో ప్రసంగించాల్సిందిగా వివిధ పార్టీలతో కూడిన రాజకీయనాయకుల బృందం ఆహ్వానించింది.

అయితే.. ''ప్రపంచం అంతం కాబోతోందని చెప్పే గురువులు మనకు అవసరం లేదు'' అని ట్వీట్ చేసిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి గిల్లామ్ లారైవ్.. పార్లమెంటులో గ్రెటా ప్రసంగాన్ని బహిష్కరించాలని తన సహచరులకు విజ్ఞప్తి చేశారు.

మరికొందరు పార్లమెంటు సభ్యులు సైతం.. ''షార్ట్స్ ధరించిన ప్రవక్త'' అని, ''పర్యావరణ జస్టిస్ బైబర్'' అని అభివర్ణిస్తూ గ్రెటాను విమర్శించారు. ఆమెకు ''భయంలో నోబెల్ బహుమతి'' ఇవ్వాలని రిపబ్లికన్ ఎంపీ జూలియన్ ఆబర్ట్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పారిస్‌లో ఫ్రాన్స్ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి గ్రెటా ప్రసంగించింది

గ్రెటా చేస్తున్న కృషి.. ''నిరంతర భావోద్వేగ నియంతృత్వం'' అని నేషనల్ ర్యాలీ ఎంఈపీ జోర్డాన్ బార్డెలా ఒక టీవీతో వ్యాఖ్యానించారు.

గ్రెటా మీద ట్విటర్ వంటి సోషల్ మీడియాలో కొందరు జర్నలిస్టులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. రాజకీయనాయకులు ఆమెను విమర్శించేటపుడు కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు.

''నిజం చెప్పే పిల్లలం మీకు దుష్టలుగా కనిపిస్తున్నాం''

పార్లమెంటులో గ్రెటా ప్రసంగానికి గ్రీన్ పార్టీ సభ్యులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు చెందిన ఎన్ మార్చ్ పార్టీ సభ్యులు పూర్తి మద్దతుగా నిలిచారు.

లారైవ్, ఆబర్ట్‌లు.. వాతావరణ మార్పుపై పోరాటం వెనుక రాజకీయ క్రీడ ఆడుతున్నారు'' అని జనరేషన్ ఎకాలజీ పార్టీ ఎంపీ డెల్ఫైన్ బాతో మండిపడ్డారు.

Image copyright Getty Images

గ్రెటా మంగళవారం పార్లమెంటులో మాట్లాడింది. ఇంగ్లిష్‌లో ప్రసంగించింది. కర్బన ఉద్గారాలను నిరోధించటానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

వాతావరణ మార్పు గురించి రాజకీయ నాయకులకు ''ఇబ్బందికరమైన విషయాలు'' చెప్పటానికి ధైర్యం చేసినందుకు గాను.. వారికి తాను, తన వంటి పిల్లలు ''దుష్టులు''గా కనిపిస్తున్నామని ఆమె వ్యాఖ్యానించింది.

''ఈ సైంటిఫిక్ సత్యాలు, ఈ సంఖ్యలు ఉటంకించినంత మాత్రానే.. మేం ఊహించలేనంత తీవ్రస్థాయిలో ద్వేషం, హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులు, జర్నలిస్టులు మమ్మల్ని గేలి చేస్తున్నారు.. మా గురించి అబద్ధాలు చెప్తున్నారు'' అని ఆమె మండిపడింది.

వాతావరణ మార్పు వెనుక ఉన్న సైన్స్ విషయంలో పార్లమెంటు సభ్యులందరూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు