బంగ్లాదేశ్‌లో మూక దాడులు: పిల్లల అపహరణ వదంతులతో ఎనిమిది మందిని కొట్టి చంపిన మూకలు

  • 25 జూలై 2019
మూక దాడులు Image copyright Getty Images

పిల్లల అపహరణలకు సంబంధించి ఆన్‌లైన్‌లో వదంతులు వ్యాపించటంతో బంగ్లాదేశ్‌లో మూక దాడుల్లో ఎనిమిది మంది చనిపోయారని పోలీసులు తెలిపారు.

రాజధాని నగరం ఢాకా దక్షిణ ప్రాంతంలో పద్మ వంతెన నిర్మాణానికి మానవ బలులు అవసరమన్న వదంతులు వెల్లువెత్తటంతో ఈ మూకదాడులు జరిగాయి.

ఢాకాలో 300 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు బలి ఇవ్వటానికి పిల్లల తలలు నరుకుతున్నారంటూ వదంతులు వ్యాప్తి చెందాయి.

ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బృందాలు.. పిల్లలను అపహరించుకుపోయే వాళ్లుగా అనుమానించిన వ్యక్తుల మీద దాడి చేసి కొట్టి చంపాయి.

ఈ వదంతులతో 30 మందికి పైగా వ్యక్తులపై మూక దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ మూక దాడుల్లో చనిపోయిన వారిలో ఎవరికీ పిల్లల అహపరణలతో ప్రమేయం లేదని పోలీస్ అధికారి జావేద్ పట్వారీ ఢాకాలో విలేకరులకు వివరించారు.

Image copyright POLICE HANDOUT
చిత్రం శీర్షిక ఇద్దరు పిల్లల తల్లి తస్లీమా బేగం కూడా మూక దాడి మృతుల్లో ఉన్నారు

మూక దాడుల్లో చనిపోయిన ఎనిమిది మందిలో తస్లీమా బేగం అనే ఒంటరి తల్లి కూడా ఉంది. ఆమెకు నాలుగేళ్లు, పదకొండేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆమె హత్యకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని.. ఈ తప్పుడు వదంతులను వ్యాప్తి చేయటానికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.

మూకదాడుల బాధితులు ఎవరు?

గత వారంలోనే మూక దాడుల్లో ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు.

శనివారం ఢాకాలోని ఒక స్కూల్ వెలుపల తస్లీమా బేగం (42)ను పిల్లల కిడ్నాపర్‌గా అనుమానించిన మూక.. దాడిచేసి కొట్టి చంపింది.

ఆ పాఠశాలలో తన పిల్లలను చేర్చటం కోసం వివరాలు తెలుసుకోవటానికి వచ్చిన తస్లీమాను కిడ్నాపర్‌గా అనుమానించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు బీడీన్యూస్24.కామ్ అనే బంగ్లాదేశీ ఆన్‌లైన్ వార్తాపత్రిక పేర్కొంది.

''జనం పెద్ద సంఖ్యలో ఆమెపై దాడి చేస్తుండటంతో మేం ఏమీ చేయలేకపోయాం'' అని ఆమె హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన ఒక టీచర్ ఆ వెబ్‌సైట్‌తో చెప్పారు.

గత గురువారం కెరానిగంజ్‌లో 30 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి, శనివారం సావార్‌లో ఒక 30 ఏళ్ల మహిళ మూక దాడుల్లో చనిపోయారని బీడీన్యూస్24.కామ్ చెప్పింది.

Image copyright WIKIPEDIA COMMONS
చిత్రం శీర్షిక పద్మా బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లలను బలిఇవ్వటానికి కిడ్నాపర్లు సంచరిస్తున్నారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి

ఈ వదంతులు ఎలా మొదలయ్యాయి?

ఈ వదంతులు సుమారు రెండు వారాల కిందట సోషల్ మీడియాలో వ్యాప్తి చెందటం మొదలయ్యాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఫేస్‌బుక్ పోస్టులు, యూట్యూబ్ వీడియోల్లో ఇవి విస్తరించాయి.

బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతంలోని నెట్రోకోనా జిల్లాలో.. బాలుడి తల నరికి తీసుకెళుతూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడని ఓ వదంతి వ్యాపించింది.

''పద్మా బ్రిడ్జి కోసం పిల్లల తలలు, రక్తం సేకరించటానికి పిల్లల కిడ్నాపర్లు తిరుగుతున్నారు'' అని ఫేస్‌బుక్‌ పోస్టుల వదంతులు చెప్తున్నట్లు స్థానిక మీడియా వివరించింది.

ఈ వదంతులను విస్తరిస్తున్న పలు పోస్టులు, వీడియోలను ఫేస్‌బుక్‌లో బీబీసీ చూసింది.

''దేశంలో అలజడి సృష్టించటానికి ఉద్దేశపూర్వకంగా ఈ వదంతులను వ్యాప్తి చేస్తున్నారు'' అని పోలీస్ అధికారి బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే.. అనుమానితుల గురించి వివరించలేదు.

Image copyright FACEBOOK
చిత్రం శీర్షిక భారతదేశంలో వాట్సాప్ వదంతుల నేపథ్యంలో అభిజిత్ నాథ్, నీలోత్పల్ దాస్‌లను మూక దాడిలో కొట్టి చంపారు

అధికారులు ఏం చేస్తున్నారు?

మీడియాలో ప్రచారం ద్వారా వదంతులను అరికట్టటానికి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించటం ద్వారా మూక దాడులను నిరోధించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ వదంతులను విస్తరిస్తున్నట్లు ఆరోపణలున్న 25 యూట్యూబ్ చానళ్లు, 60 ఫేస్‌బుక్ పేజీలు, 10 వెబ్‌సైట్లను మూసివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

గ్రామాలు, చిన్న పట్టణాల్లో.. ఈ వదంతుల ప్రభావాన్ని తొలగించటానికి అధికారులు లౌడ్‌స్పీకర్లలో ప్రచారం చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో 2010లో కూడా ఒక వంతెన నిర్మాణానికి సంబంధించి.. ఇదే తరహా మూక దాడుల హత్యలు జరిగాయని స్థానిక మీడియా చెప్తోంది.

భారతదేశంలో ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో వ్యాపించిన పిల్లల అపహరణ వదంతుల వల్ల కూడా మూక దాడులు, హత్యలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)