బ్రిటన్‌ హోంమంత్రిగా భారత సంతతి మహిళ ప్రీతి పటేల్.. ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి అల్లుడు రిషి

  • 26 జూలై 2019
ప్రీతి పటేల్, సాజిద్ జావిద్ Image copyright PA

బ్రిటన్‌కు ఇప్పుడు హోంమంత్రిగా భారత సంతతి మహిళ, ఆర్థిక మంత్రిగా పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తి సేవలందించనున్నారు.

బోరిస్ జాన్సన్ నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు హోంమంత్రి పదవి లభించగా, పాకిస్తాన్ మూలాలున్న సాజిద్ జావిద్‌కు ఆర్థిక మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. దీనికి ముందు పాత ప్రభుత్వంలో సాజిద్ హోంమంత్రిగా ఉన్నారు.

థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రీతికి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఓ వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్ అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు.

2017లో ప్రీతి ఇజ్రాయెల్‌లో చేపట్టిన 'వ్యక్తిగత' పర్యటన, విదేశాంగ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారం కారణంగా ఆ పదవి నుంచి ప్రీతి తప్పుకోవాల్సి వచ్చింది.

Image copyright Getty Images

ప్రస్తుతం హోం మంత్రి పదవిని అందుకోవడం ద్వారా ఆమె ఓ విధంగా గొప్ప పునరాగమనం చేసినట్లైంది.

ప్రీతి వయసు 47 ఏళ్లు. ఆమె లండన్‌లోనే జన్మించారు. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌. వారు మొదట ఉగాండాలో నివసించేవారు. అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.

వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.

Image copyright PA WIRE

20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.

కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగం కూడా చేశారు. 1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు. ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది.

విలియమ్ హేగ్ కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా మారిన తర్వాత ప్రీతి తిరిగి ఆ పార్టీలో చేరారు. 1997 నుంచి 2000 వరకూ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. ప్రముఖ మద్యం తయారీ సంస్థ డియాజియోతోనూ ప్రీతి పనిచేశారు.

Image copyright Reuters

యురోపియన్ యూనియన్ (ఈయూ)ను విమర్శించినవారిలో ప్రీతి కూడా ఉన్నారు. బ్రెగ్జిట్‌ను ఆమె చాలా బలంగా సమర్థించారు.

స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన ప్రీతి.. ధూమపానంపై ఆంక్షలు విధించడానికి వ్యతిరేకంగానూ మాట్లాడారు.

2005 ఎన్నికల్లో నాటింగ్‌హామ్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా, 2010లో విట్‌హామ్ ఎంపీగా ప్రీతి గెలిచారు. అప్పటి నుంచి ఆమె ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

డేవిడ్ కేమరూన్ హయాంలో ఓ ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా పనిచేసే అవకాశం ప్రీతికి లభించింది.

బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమని ప్రీతి చెబుతుంటారు.

తండ్రి బస్ డ్రైవర్..

సాజిద్ జావిద్ వయసు 49 ఏళ్లు. ఆయన బ్రిటన్‌లోనే జన్మించారు. ఆయన కుటుంబం పాకిస్తాన్‌ నుంచి వలసవచ్చి బ్రిటన్‌లో స్థిరపడింది.

2018లో థెరెసా మే ప్రభుత్వంలో సాజిద్‌కు హోంమంత్రి పదవి లభించింది. బ్రిటన్‌లో మైనార్టీ వర్గాలకు చెందిన ఓ వ్యక్తి ఆ పదవి చేపట్టడం అదే తొలిసారి. 2010 నుంచి సాజిద్ బ్రమ్స్‌గ్రోవ్ ఎంపీగా ఉన్నారు.

పాకిస్తాన్‌లోని ఓ చిన్న గ్రామంలో తన తండ్రి జన్మించారని, 17 ఏళ్ల వయసులోనే పొట్టచేత్తో పట్టుకుని బ్రిటన్‌కు వచ్చారని ఈవెనింగ్ స్టాండర్డ్ పత్రికతో ఒకసారి సాజిద్ చెప్పారు.

Image copyright Press Association

''రాక్‌డెల్‌లో ఓ టెక్స్‌టైల్ మిల్‌లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. కానీ, వేతనాలు ఎక్కువగా ఉంటాయని ఆయన బస్ డ్రైవర్‌గా మారారు. రాత్రీపగలు తేడా లేకుండా ఆయన పనిచేస్తుంటారు. అందుకే, 'మిస్టర్ నైట్ అండ్ డే' అని కొందరు ఆయన్ను పిలుస్తుంటారు'' అని సాజిద్ చెప్పారు.

సాజిద్ తండ్రి ఓ దుస్తుల దుకాణాన్ని కొనుగోలు చేశారు. దానిపైన ఉండే రెండు గదుల ఫ్లాట్‌లోనే వారి కుటుంబం నివాసం ఉండేది.

పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే సాజిద్‌కు బ్యాంకింగ్, షేర్ మార్కెట్‌ల మీద ఆసక్తి పెరిగింది.

14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సాజిద్ తన తండ్రితో వెళ్లి బ్యాంక్ మేనేజర్‌ను కలిసి, 500 పౌండ్ల రుణం తీసుకున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఆలోక్ శర్మ

పుట్టింది ఆగ్రాలోనే..

భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కూడా బోరిస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ శాఖ మంత్రిగా అలోక్ వర్మ పదవి స్వీకరించారు.

అలోక్ ఆగ్రాలో పుట్టారు. ఐదేళ్ల వయసులో ఉండగానే కుటుంబంతోపాటు బ్రిటన్‌కు వలసవచ్చారు.

వృత్తిరీత్యా అలోక్ ఓ చార్టర్డ్ అకౌంటెంట్. రాజకీయాల్లోకి రాకముందు 16 ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు.

2010 నుంచి అలోక్ రీడింగ్ వెస్ట్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2017 జూన్‌లో ఆయనకు గృహనిర్మాణ శాఖ మంత్రి పదవి వచ్చింది.

గ్రీన్‌ఫెల్ టవర్‌లో అగ్ని ప్రమాదం గురించి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 2017 జులైలో అలోక్ భావోద్వేగంతో చేసిన ప్రసంగానికి మీడియా కవరేజీ విశేషంగా లభించింది.

2018 జనవరిలో అలోక్ ఉద్యోగకల్పన వ్యహారాల శాఖ మంత్రి పదవి చేపట్టారు.

Image copyright UK PARLIAMENT
చిత్రం శీర్షిక రిషి సునక్

‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి అల్లుడు

49 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ రిషి సునక్ ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటన్ ప్రభుత్వంలో ఇది జూనియర్ లోకల్ మంత్రి పదవి. సోషల్ కేర్‌తో పాటు పలు అంశాలకు సంబంధించిన బాధ్యతలు రిషి నిర్వర్తించనున్నారు.

రిషి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన తండ్రి వైద్యుడు. తల్లి ఔషధ దుకాణాన్ని నడుపుతున్నారు.

2015 నుంచి రిషి రిచ్‌మండ్ ఎంపీగా ఉన్నారు.

ఇన్ఫోసిస్ సంస్థ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తిల కుమార్తె అక్షతా మూర్తిని రిషి వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు