సీఎంఏహెచ్: "గుండెపోటు ముప్పు పెరగడానికి కారణం ఈ జన్యువు నిర్వీర్యం కావడమే"

  • 27 జూలై 2019
గుండెపోటు వచ్చినట్లు చూపిస్తున్న వ్యక్తి Image copyright Getty Images

దాదాపు ఏ క్షీరదానికీ రాని గుండెపోటు మనిషికే ఎందుకు వస్తుంది? సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఒక జన్యువు ప్రభావాన్ని కోల్పోవడమే దీనికి కారణమంటోంది తాజా పరిశోధన.

పూర్వం జన్యుమార్పుల వల్ల 'సీఎంఏహెచ్' అనే జన్యువు మనిషిలో నిర్వీర్యమైపోయింది. పరిణామ క్రమంలో దాదాపు రెండు లక్షల ఏళ్ల క్రితం హోమోసెపియన్స్ వచ్చే వరకు ఈ జన్యువు లక్షణం కొనసాగింది.

సీఎంహెచ్‌ఏ జన్యువు నిర్వీర్యమైపోవడం వల్ల మనిషికి గుండెపోటు ముప్పు పెరిగిందని అమెరికాలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన 'శాన్‌డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్' పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) సమాచారం ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 70 ఏళ్లు నిండక ముందే సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో గుండెజబ్బు ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో దాదాపు మూడో వంతు అంటే 1.79 కోట్ల మరణాలకు గుండెజబ్బులే కారణం. 2030 నాటికి ఈ సంఖ్య 2.3 కోట్లకు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.

గుండెజబ్బులకు అత్యధిక సందర్భాల్లో కారణం- అథెరోస్క్లెరోసిస్. రక్తప్రసరణకు అడ్డంకి కలిగించేలా ధమనుల్లో పూడికలు ఏర్పడటాన్ని 'అథెరోస్క్లెరోసిస్' అంటారు.

Image copyright Getty Images

ఈ సమస్య మనుషుల్లో ఎక్కువగానే ఉండగా, ఇతర క్షీరదాల్లో మాత్రం దాదాపు లేదు. అంతగా శారీరక శ్రమలేని జీవనశైలి కలిగిన చింపాంజీల్లోనూ ఇది లేదు. స్పెర్మ్ వేల్, డాల్ఫిన్లలోనూ ఈ సమస్య తాలూకు ఆధారాలు లేవు.

మరి మనుషులకు మాత్రం ఏమైంది? మనుషుల్లోనే ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది?

ప్రస్తుత అధ్యయన వివరాలు రాసిన పరిశోధకుల్లో ఒకరైన అజిత్ వార్కి.. మనిషి తప్ప జంతువుల్లో వేటికీ 'అథెరోస్క్లెరోసిస్' రాదని గత అధ్యయనాల్లోనే గుర్తించారు.

పదేళ్ల క్రితం, చింపాంజీలు, ఇతర క్షీరదాలపై ఒక ప్రయోగం జరిగింది. శారీరక శ్రమలేకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అధిక రక్తపోటు లాంటి అంశాలు మనుషుల్లో గుండెజబ్బులకు కారణమవుతుంటాయి. ఇవే అంశాలు ఈ జంతువుల్లోనూ గుండెజబ్బులకు దారితీస్తాయా అనేది గుర్తించేందుకు పరిశోధకులు ఈ ప్రయోగం చేశారు. ఇందులో ముఖ్యమైన అంశాలేవీ వెల్లడికాలేదు.

చింపాంజీల్లో గుండెపోటు అరుదు. ఒకవేళ వచ్చినా, దానికి అథెరోస్క్లెరోసిస్ కారణం కాదు.

మనుషుల మాదిరి వ్యవహరించేలా జన్యు మార్పులు చేస్తేనో, లేదా శాస్త్రపరిశోధన కోసం అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్‌తో కూడిన ఆహారం అందిస్తేనో తప్ప జంతువులకు గుండెజబ్బు రాదని గత పరిశోధనల ఆధారంగా పరిశోధకులు చెప్పారు.

ప్రస్తుత పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ యూఎస్ఏ (పీఎన్‌ఏఎస్)'లో ప్రచురితమయ్యాయి.

Image copyright Getty Images

ప్రయోగంలో ఏం తేలిందంటే...

అజిత్ వార్కి, ఆయన బృందసభ్యులు తమ పరిశోధనలో భాగంగా- జన్యుమార్పులు చేసిన ఎలుకల్లో సీఎంఏహెచ్ జన్యువును నిర్వీర్యం చేశారు. అంటే మనుషుల్లో మాదిరే వీటిలోనూ ఈ జన్యువు క్రియారహితంగా మారిపోయింది. మరికొన్ని ఎలుకలకు ఇలా చేయలేదు.

జన్యువును నిర్వీర్యం చేసిన ఎలుకలకు, చేయని ఎలుకలకు ఒకే ఆహారం అందించారు. వాటి రోజువారీ కార్యక్రమాలు ఒకేలా ఉండేలా చూశారు. తర్వాత పరీక్షలు జరిపితే, మిగతా ఎలుకల కన్నా ఈ జన్యువును నిర్వీర్యం చేసిన ఎలుకల రక్తంలో రెండింతలు ఎక్కువగా కొవ్వు పేరుకుపోయింది.

శరీర బరువులోగాని, లిపిడ్ ఫ్రొపైల్స్‌లోగాని మార్పులు లేకున్నా, సీఎంఏహెచ్ నిర్వీర్యమైతే అథెరోస్క్లెరోసిస్ ముప్పును పెంచుతుందని స్పష్టమైందని పరిశోధకులు చెప్పారు. పరిణామక్రమంలో మనిషిలో ఈ జన్యువు నిర్వీర్యం కావడం గుండెజబ్బు ముప్పు ఏర్పడటానికి కారణమై ఉంటుందని తెలిపారు.

మనుషుల్లో గుండెజబ్బు ముప్పును పెంచే ఇతర అంశాలూ ఉన్నాయని వారు ప్రస్తావించారు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, వయసు, మధుమేహం, ఊబకాయం, పొగతాగడం, జంతుమాంసం(రెడ్‌మీట్) తినడం ఈ ముప్పును పెంచుతాయన్నారు.

గుండెజబ్బు తొలిసారి వచ్చినవారిలో 15 శాతం మంది విషయంలో ఈ కారణాలు కనిపించవని అజిత్ వార్కి ప్రస్తావించారు. అయినప్పటికీ వీరికి గుండెజబ్బు రావడానికి కారణం ఆ ముప్పు ఉండటమేనని చెప్పారు. గుండెజబ్బుకు దారితీసే కారణాలు లేకపోయినప్పటికీ శాకాహారులకు కూడా గుండెపోటు ముప్పు ఎందుకు ఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొన్ని రకాల క్యాన్సర్లు, రెడ్‌మీట్ మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు కూడా ఈ పరిశోధన తోడ్పడుతుందని భావిస్తున్నారు.

జంతుమాంసం తినేవారికి గుండెజబ్బు ముప్పు ఎక్కువని కూడా ఈ పరిశోధన చెబుతోంది.

సీఎంఏహెచ్ జన్యువు 'ఎన్-గ్లైకోలిల్ న్యురామిక్ యాసిడ్(ఎన్‌ఈయూ5జీసీ)' అనే ఒక రకం సియాలిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెడ్ మీట్ తిన్నప్పుడు ఇది శరీరానికి లభిస్తుంది.

సీఎంఏహెచ్ జన్యువు నిర్వీర్యమైపోయిన తర్వాత, మన పూర్వీకుల శరీరంలో ఈ యాసిడ్ లోపం ఏర్పడింది. బయటి పదార్థం విషయంలో మాదిరే ఈ యాసిడ్ విషయంలో శరీరం స్పందించడం మొదలుపెట్టింది.

రెడ్‌మీట్‌లో ఎక్కువగా ఉండే ఈ యాసిడ్‌ను తీసుకున్నప్పుడు, శరీరంలోని యాంటీబాడీలు ప్రతిస్పందిస్తాయి. ఇది 'గ్సెనోజియలైటిస్' అనే దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయొచ్చు. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రస్తుత, గత పరిశోధనల ఫలితాల ఆధారంగా పరిశోధకులు చెప్పారు.

ప్రస్తుత పరిశోధనలో ఎన్‌ఈయూ5జీసీ అధికంగాగల ఆహారం తీసుకున్న ఎలుకల్లో అథెరోస్క్లెరోసిస్ సమస్య 2.4 రెట్లు ఎక్కువగా వచ్చింది.

ఎప్పుడు, ఎలా జరిగింది?

సీఎంఏహెచ్ జన్యువు కచ్చితంగా ఎప్పుడు, ఎలా నిర్వీర్యమైపోయిందనేది అంతుబట్టడం లేదు.

అయితే ఈ జన్యువు నిర్వీర్యమైపోవడం వల్ల హోమోసెపియన్స్‌కు రెండు ప్రయోజనాలు కలిగాయి. వాటిలో ఒకటి ఎక్కువ దూరాలు నడవగలగడం, రెండోది సంతానోత్పత్తి తగ్గడం.

గుండెజబ్బుల చికిత్సకు కొత్త విధానాలను అభివృద్ధి చేయడంలో తమ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని అజిత్ వార్కి చెప్పారు.

జంతుమాంసం అధిక వినియోగం, కొన్ని క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు కూడా తాజా పరిశోధన ఫలితాలు తోడ్పడతాయని, అయితే ఈ కోణంలో ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)