సముద్రగర్భంలో యుద్ధ ట్యాంకులు.. ఆర్మీ హెలికాప్టర్లు

  • 26 జూలై 2019
జోర్డాన్ మ్యూజియం Image copyright AFP

ప్రపంచంలోనే మొట్టమొదటి సముద్రగర్భ మిలిటరీ మ్యూజియంను జోర్డాన్ ప్రారంభించింది. అకాబా తీరంలో దీనిని ఏర్పాటు చేశారు.

బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ దేశం కొన్ని సైనిక వాహనాలను నీళ్లలో ముంచేసింది. వీటిలో కొన్ని ట్యాంకులు, ట్రూప్ కారియర్లతోపాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంది.

ఈ హెలికాప్టర్‌ను జోర్డానియన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ మ్యూజియంకు బహూకరించింది.

జోర్డాన్ మ్యూజియం Image copyright Reuters

సైన్యం నుంచి వెనక్కు పిలిపించిన 19 ఆర్మీ వాహనాలు ఇందులో ఉన్నాయి.

వీటన్నింటితో ఎర్ర సముద్రంలో 92 అడుగుల లోతున ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు.

యుద్ధంలో మోహరింపును తలపింపజేసేలా ఈ వాహనాలను సముద్రగర్భంలోని పగడపు దిబ్బలపై ఏర్పాటు చేశారు.

జోర్డాన్ మ్యూజియం Image copyright Reuters

ఈ ప్రదర్శన దేశానికి వచ్చే పర్యాటకులకు 'కొత్త రకం' మ్యూజియం అనుభవాలను అందిస్తుందని స్థానిక అధికారులు చెప్పారు.

ఈ మ్యూజియంలో క్రీడలు, పర్యావరణం, ఇతర అంశాలకు సంబంధించిన వస్తువులు కూడా ప్రదర్శిస్తామని అకాబా స్పెషల్ ఎకనామిక్ జోన్ అథారిటీ(ఏఎస్ఈజడ్ఏ) చెబుతోంది.

వాహనాలను సముద్రంలో ముంచే ముందు వాటిలో ఉన్న హానికారక పదార్థాలన్నీ తొలగించినట్లు ప్రకటించింది.

జోర్డాన్ మ్యూజియం Image copyright Reuters

స్నోర్కెల్ మాస్క్ పెట్టుకుని సముద్రంలోపలికి వెళ్లేవారు, స్కూబా డైవర్లు సముద్రం అడుగు వరకూ వెళ్లి ఈ మ్యూజియం చూడవచ్చు.

మిగతా పర్యాటకులను మాత్రం గాజు ఫ్లోర్ ఉన్న పడవల్లో తీసుకెళ్లి సముద్రం అడుగున ఉన్న ఈ వాహనాలను చూపిస్తారు.

జోర్డాన్ మ్యూజియం Image copyright Reuters

ఉత్తర ఎర్ర సముద్రంలో ఉన్న పగడపు దిబ్బలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి భారీగా వస్తుంటారు. వారికి ఇప్పుడు ఈ మ్యూజియం మరింత వినోదం, విజ్ఞానం అందించనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)